శ్రీవారు తిరుమలలో ఉంటే….బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో…!

ఇప్పడు తిరుమలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఒకప్పుడు తిరుచానూరులోనే జరిగేవని శాసనాలు చెబుతున్నాయి. 1400 ఏళ్ల క్రితం ధ్వజారోహణం, ధ్వజావరోహణం మినహా…మిగిలిన వాహన సేవలన్నీ తిరుచానూరులో నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది. అప్పట్లో తిరుమల కీకరాణ్యంగా ఉండటం, జనసంచారం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ మాటకొస్తే… శ్రీవారు తిరుచానూరులోనే కొలవయ్యారు. శ్రీభోగ శ్రీనివాసమూర్తిగా పూజలందుకున్నారు.

తొలి వెలుగు తిరుచానూరే…

ఇవి కీ.శ. 614 సంవత్సరం నాటి విశేషాలు…అది పల్లవ రాజుల కాలం. పల్లవులకు సామంతరాజుగా ఉన్న శక్తి విటంకన్‌ తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో….ఆయన సతీమణి పామవై (కడవన్‌ అనే పేరు కూడా ఉంది) తిరుచానూరులో తిరువిలాన్‌ కోయిల్‌లో భోగశ్రీనివాసమూర్తిని ప్రతిష్టించారు. ఇది తిరుమల శ్రీవారికి ప్రతిరూపం. వెండితో తయారు చేయించారు. మనవాల్‌ పెరుమాళ్‌ అని కూడా పిలిచేవారు. ఈ ఆలయం ఎంతగానో ప్రకాశించింది. ఆలయంలో పురటాశి నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు అయ్యే ఖర్చులకుగాను తిరుచానూరులో ఏడువేల కులి విస్తీర్ణంగల భూములను సర్వమాన్యంగా తిరుచానూరులోని స్థానత్తారులకు అప్పగించారట. ఆ తరువాత శ్రీనివాసమూర్తికి వజ్రవైడూర్యాలతో కిరీటం, వడ్డాణం, భుజకీర్తులు, అనేక రకాలైన ఆభరణాలు తయాచుచేయించారు. ఆ కాలంలోనే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరోహణ, అవరోహణ ఉత్సవాలు మాత్రమే కొండపైన జరిపించేవారట. మిగిలిన వాహన సేవలన్నీ తిరుచానూరు తిరువిలాన్‌ కోయిల్‌లో నిర్వహించేవారు. తిరుమల కొండ కీకారణ్యంగా ఉండి జనసంచారం లేకపోవడం వల్ల క్రూరమృగాలకు ఆలవాలమై ఉండేది. అందుకే ఈ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తిరువిలాన్‌ కోయిల్‌ ఆలయంలో భోగశ్రీనివాసమూర్తిని ప్రతిష్టించడం ద్వారా….భీకరారణ్యంలో ప్రయాణించి శ్రీవారిని దర్శించుకో లేనివారు….తిరుచానూరులోనే స్వామివారి దర్శనం చేసుకునేవారట.

తిరుమలకు భోగ శ్రీనివాసమూర్తి…

పల్లవులు వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించారు. తిరుచానూరును వైష్ణవ మత విస్తరణకు కేంద్రంగానూ చేసుకున్నారు. ఇక్కడే శైవులను వైష్ణవులుగా మార్చడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగానే తిరుచానూరులో శ్రీభోగ శ్రీనివాసమూర్తి ఆలయం ఆవిర్భవించింది. పల్లవులు వైష్ణవాన్ని ఆచరించినా…శైవాన్ని ద్వేషించలేదు. పల్లవుల తరువాత రాజ్యం చేసిన చోలుల కాలంలో కపిలతీర్థంలో శివలింగ ప్రతిష్ట జరిగింది. తిరుచానూరు సమీపాన వున్న యోగిమల్లవరంలో తిప్పలాధీశ్వరస్వామి పేరుతో పరాశరేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆ క్రమంలోనే తిరుచానూరులోని భోగ శ్రీనివాసమూర్తిని తిరుమలకు తరలించి…వైఖానస ఆగమానుసారం పున:ప్రతిష్టించారు. అప్పటి నుంచి తిరుమల ఆలయంలో జరిగే పూజా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

నాడు తిరుచొక్కనూరు…

ఇప్పటి తిరుచానూరును ఒకప్పడు తిరుచొక్కనూరు అని పిలిచేవారు. తిరుపతి నగరం కన్నా ముందు తిరుచానూరు ఉందని చరిత్ర చెబుతోంది. 1000 సంవత్సరాలకు ముందు తిరుపతి ఏర్పడితే….అంతకు మునుపే తిరుచొక్కనూరు ఉనికిలో ఉంది. తిరుమండ్యం గ్రామానికి ఆనాడు ప్రాధాన్యత ఉంది. ఆనాడు ఒక వెలుగు వెలిగిన తిరుచానూరు మళ్లీ ఇప్పుడు అలిమేలు మంగాపు రంగా పూర్వవైభవం సంతరించుకుంటోంది. తిరుమల తరువాత అత్యధిక మంది భక్తులు దర్శించుకునే క్షేత్రంగా విరాజిల్లులోంది. రానున్న కాలంలో తిరుచానూరు మరింతగా వెలుగొందడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*