శ్రీశైలం నిండుతోంది…. సీమ తాగు నీటికి అల్లాడుతోంది..ఎందుకు?

కోస్తా ఉత్తరాంధ్రలో వానలు దంచేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి తల్లి పొంగిపొర్లి గ్రామాలకు గ్రామాలను వరదతో ముంచెత్తుతోంది. రోజూ వార్తా పత్రికల నిండుగా వరద బాధితుల వార్తలు వస్తున్నాయి. అందుకు తద్విరుద్దంగా రాయలసీమ చేసుకున్న పాపమో ఏమోగానీ చినుకు జాడ లేదు. సాగు నీటి అవసరాలు అటుంచగా కనీసం తాగునీటికి కూడా సీమ వాసులు కటకటలాడి పోతున్నారు. పనులు లేకుండా సీమ వాసులు వలసబాట పడుతున్నారు. అన్నింటి కల్లా మరో విషాదం ఏమంటే రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత్యంతరం లేని స్థితిలో వర్షాల కోసం చిర కాలంగా వున్న సంప్రదాయాల మేరకు గ్రామాల్లో భజనలు, కప్పలకు పెళ్లిళ్లు తదితర చిట్కాలను సాగిస్తున్నారు. ఈ వ్యధాభరిత, హృదయ విదారకమైన వార్తలు వాస్తవ పరిస్థితిని వివరిస్తూ మీడియాలో చోటు చేసుకోవడం లేదు. అంతేకాదు. ప్రభుత్వం వేపు నుండి కూడా స్పందన లేకపోవడానికి తోడు సీమ నుండి ఎన్నికైన శాసనసభ్యులు పట్టించుకోక పోవడం కొస మెరుపు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అంతే కాదు. 52 శాసనసభ స్థానాలు వుంటే ఈ ప్రభుత్వానికి 49 స్థానాలు కట్టబెట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా సీమ వాసుల ఇబ్బందులు తీర్చేందుకు ఎట్టి కార్యాచరణ చేపట్టిన జాడ లేదు. తుదకు తక్షణం చేపట్టవలసిన అంశాలు కూడా పట్టించుకోవడం లేదు.

అదృష్టం కొద్ది, ఆశాకిరణంగా కృష్ణ నదికి వరద వచ్చింది. శ్రీ శైలం జలాశయంలో రోజుకు నీటిమట్టం పెరుగుతోంది. ఈ నెల 5 వతేదీ ఉదయానికే 100 టియంసిల నీరు చేరింది. అయితే అంగట్లో అన్నీవున్నా అల్లుని నోట్లో శని వున్నట్లు ప్రభుత్వం వేపు నుండి కించిత్తు చర్య కనిపించడం లేదు.
శ్రీ శైలం నీటిమట్టం 800 అడుగులకు చేరగానే ముచ్చుమర్రి నుండి ఎత్తిపోతలు మొదలెట్టవచ్చు. 830 అడుగుల నీటి మట్టం చేరగానే హంద్రీనీవా నుండి ఎత్తిపోతలు ప్రారంభించవచ్చు. 854 అడుగుల నీటిమట్టం రాగానే పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి సీమ జిల్లాలకు గ్రావిటీ ద్వారా నీరు సరఫరా చేయవచ్చు. 5వ తేదీ ఉదయానికే నీటి మట్టం 860. 90 అడుగులకు చేరింది. గొంతెండి పోతున్న రాయలసీమకు బేషుగ్గా జలాశయం నుండి నీరు విడుదల చేయవచ్చు. కాని ఎపి ప్రభుత్వం నుండి ఎట్టి కదలిక కనిపించడం లేదు. తుదకు తాగు నీటికి అల్లాడుతున్న సీమ వాసులకు ముచ్చుమర్రి నుండి కడప జిల్లాకు, హంద్రీనీవా నుండి అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కనీసం తాగునీరు అందించ వచ్చు. పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఇప్పడైనా నీరు విడుదల చేయ వచ్చు. జల వనరుల శాఖలో గాని, తుదకు ఈ ప్రాంత శాసనసభ్యులలో ఈ ఆలోచన – ప్రతిపాదన వున్నట్లు కన్పించడం లేదు.

గమనార్హమైన అంశమేమంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొద్దిపాటి వరద రాగానే శ్రీ శైలం ఎగువ భాగంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీరు తరలించుతోంది. రెండు రోజుల నుండి శ్రీ శైలం ఎడమ గట్టు నుండి విద్యుదుత్పత్తి కూడా మొదలు పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ కూడా ఎపిలో కరవు అయింది. వైసిపి పార్టీ కి సీమ ప్రజలు అఖండ విజయం చేకూర్చారు. సీమ నుండి ఎన్నికైన శాసన సభ్యులు అత్యంత ప్రధానమైన ఈ అంశం ప్రభుత్వ దృష్టికి ఎందుకు తేవడంలేదో అర్థం కావడంలేదు.

ఏ ప్రభుత్వానికి గాని తక్షణ కర్తవ్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు వుంటాయి. ప్రస్తుతం అధికార గణమంతా వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది నియామకంపై ననే వున్నారు. తక్షణ కర్తవ్యాలు గాలికి వదిలేశారు. వెంటనే సీమ శాసనసభ్యులు శ్రీ శైలం జలాశయం నుండి ముచ్చుమర్రి మల్యాల ఎత్తిపోతలతో పాటు పోతురెడ్డి పాడు రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేయనున్నట్లు చూడవలసి వుంది.

– వి.శంకరయ్య 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*