శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం కొన‌సాగిస్తాం : టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి

            తిరుమ‌ల‌ శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాలు కొన‌సాగుతాయ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నం వ‌ద్ద గురువారం త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో ఛైర్మ‌న్ మాట్లాడారు.

             ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ద‌ర్శ‌నాల విధానంలో ఎలాంటి మార్పు లేద‌ని, ఆలయంలో నిత్య కైంకర్యాల‌ను, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను ఆగ‌మ‌శాస్త్రబ‌ద్ధంగా నిర్వ‌హిస్తున్నామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. దేశ‌వ్యాప్తంగా, రాష్ట్ర‌వ్యాప్తంగా కోవిడ్‌-19 పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌డంతో భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం మెరుగైన ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్టు చెప్పారు. టీటీడీలో ఇప్పటివరకు 140 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ‌ని, వీరిలో ఏపీఎస్పీలో పనిచేసే దాదాపు 60 మంది భ‌ద్ర‌తా సిబ్బంది, 16 మంది పోటు కార్మికులు, 14 మంది అర్చ‌కులు, ఇత‌ర ఉద్యోగులు ఉన్నార‌ని వివరించారు. 70 మంది ఇప్ప‌టికే కరోనా నుంచి కోలుకున్నార‌ని, వీరిలో కొంద‌రు హోమ్ క్వారంటైన్‌లో ఉండ‌గా, మిగిలిన‌వారు విధుల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని తెలిపారు. మ‌రో  70 మంది చికిత్స పొందుతూ కోలుకుంటున్నార‌ని, ఒక్కరు మాత్రమే స్విమ్స్ ఐసియులో చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు. ఐసియులో చికిత్స పొందుతున్న ఉద్యోగికి మెరుగైన వైద్యం అందిస్తున్నామ‌ని, త్వ‌ర‌గా కోలుకుంటార‌ని డాక్ట‌ర్లు చెప్పార‌ని తెలియ‌జేశారు.

          శ్రీ‌వారి ఆల‌యంలో విధులు నిర్వ‌హించేందుకు మొత్తం 40 మంది అర్చ‌కులు ఉండ‌గా, వారిలో 14 మందికి పాజిటివ్ కేసులు రావ‌డంతో స్వామివారికి కైంక‌ర్యాలు నిర్వ‌హించేందుకు ఎలాంటి అటంకం క‌ల‌గ‌కుండా చూడ‌డంలో భాగంగా అర్చకుల ఆరోగ్యంపై స‌మీక్షించామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. వేరువేరుగా గ‌దులు కేటాయించి భోజ‌న వ‌స‌తి క‌ల్పించాల‌ని,  వ‌య‌సు పైబ‌డిన అర్చ‌కులకు ఇంట్లో ఉండేందుకైనా, తిరుప‌తిలో విధులు కేటాయించేందుకైనా అర్చ‌కులు కోరార‌ని, ఆ మేర‌కు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామ‌ని చెప్పారు. తిరుమ‌ల‌లో ఇప్పటివ‌ర‌కు భ‌క్తులెవ‌రికీ పాజిటివ్ కేసులు రాలేద‌ని, అలాగే భ‌క్తుల ద్వారా ఉద్యోగులు వ్యాధిబారిన ప‌డ‌లేద‌ని తెలిపారు. ఉద్యోగుల కుటుంబ స‌భ్యుల ద్వారా లేదా వారి ప‌రిస‌ర ప్రాంతాల ద్వారా మాత్ర‌మే పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌న్నారు. అదేవిధంగా, మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ టిటిడిలో గానీ, టిటిడికి అనుబంధంగా ప‌నిచేస్తున్న‌వారు గానీ స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌ద‌లిస్తే బోర్డుకు తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*