శ్రీ‌వారి ఆల‌య‌మా…సినిమా థియేట‌రా..!

తిరుమల శ్రీవారి ఆలయానికి ఎంతో ప్రతిష్టవుంది. ఆలయ నిర్వహణకు సబంధించి దశాబ్దాల కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఈ ప్రతిష్టను ఇనుమడించాయి. ప్రత్యేకింమి ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహాద్వార ప్రవేశానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం అందరి ప్రశంసలూ అందుకుంది. ముఖ్యమంత్రిగా మహద్వార ప్రవేశానికి అర్హత వున్నా ఎన్‌టి రామారావు తానూ సామాన్యభక్తునిగా క్యూలైన్‌లోనే వెళతానన్నారు. ఇదే సంప్రదాయాన్ని ఆ తరువాత కూడా చాలామంది ప్రముఖులు పాటిస్తున్నారు.

అంతా సజావుగా ఉన్న సమయంలో ఏమి అవసరమొచ్చిందోగానీ…ప్రభుత్వం తాజాగా ఓ జీవోను జారీ చేసింది. చాలామందికి అదనంగా మహద్వారా ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవో ప్రకారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు కుటుంబ సభ్యులతో కలిసి మహద్వార ప్రవేశం చేయడానికి అవకాశం కల్పించారు. ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే అంశమే. అసలు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చిందనేది ప్రశ్న.

విఐపిలకు బ్రేక్‌ దర్శనం ఎటూ కల్పిస్తున్నారు. ఈ సమయంలో క్యూలన్నీ ఆపేసి…విఐపిలను మాత్రమే పంపిస్తూ శ్రీవారి మూలవిరాట్టు ముందు నిలబెట్టి, హారతులిచ్చి పంపుతున్నారు. ఇప్పుడున్న పద్ధతిలో విఐపిలకు కలుగుతున్న అసౌకర్యం ఏమీలేదు. అయితే…ఇటువంటి విఐపిలందరినీ మహద్వారం ద్వారా అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా ప్రవేశిస్తే….విఐపిల గౌరవం తగ్గిపోతుందా? దేవుని దర్శనం కోసం నాలుగు అడుగులు కూడా నడవలేరా? అయినా…మహద్వార ప్రవేశం కావాలని అడిగిందెవరు? అడిగినా ఇచ్చేస్తారా? ఇన్నాళ్లు పెట్టుకున్న సంప్రదాయాలు ఏమైపోవాలి?

మహద్వార ప్రవేశం ఒకసారి సరళం చేసిన తరువాత మరింతమంది తమకూ అటువంటి ప్రవేశ అవకాశం కల్పించమని అడిగే అవకాశం లేదా? ఇప్పుడు మంత్రులకు మహద్వార ప్రవేశం కల్పించారు…మరి ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు, ఎంపిలు అడగరా? న్యాయశాఖ అధికారులను అనుమతించేటప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఐఏఎస్‌లు, ఐపిఎస్‌ల నుంచి అటువంటి డిమాండ్‌ రాదా?

ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసేటప్పుడు అన్ని అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించాలి. అంతేగానీ….ఎవరో అడిగారని తిరుమల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆలయ ప్రతిష్ట గంగలో కలిసిపోతుంది. ఇప్పుటికే విఐపిల గురించి సామాన్య భక్తుల్లో తీవ్ర అసహనం ఉంది. తాజా నిర్ణయంతో ఇది మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇప్పటికైనా ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలి. గతంలో ఉన్న విధంగానే శ్రీవారి ఆలయ మహద్వార దర్శనానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, ప్రధాని, ముఖ్యమంత్రులు వంటి అత్యంత ఉన్నత పదవుల్లోని వారికి మాత్రమే పరిమితం చేయాలి. లేదంటే శ్రీవారి ఆలయాన్ని సినిమా థియేటర్‌లా మార్చేసిని వాళ్లవుతారు. ఆ పాపం జీవోలు జారీ చేసిన వాళ్లదే అవుతుంది.

1 Comment

  1. In order to maintain the sacredness of the Lord Venkateswara Swamy Temple and to further enhance the faith and belief of devotees, all special or VIP darshans are avoided in Tirumala similar to other temples like Dharmasthala in Karnataka which reflects the concept that all human beings are equal in front of God. Yes, to maintain the time slots and to avoid the over crowds at the Temple, online booking system is continued and only for the sevas separate Q lines are maintained as those sevas are conducted separately.

Leave a Reply

Your email address will not be published.


*