శ్రీ‌వారి ద‌ర్శ‌నం టికెట్లు – ఆర్‌టిసి కోటా…అక్ర‌మాల బాట‌!

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను అక్రమ పద్ధతుల్లో సంపాదించడానికి దళారులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. సామాన్యుల ఊహకైనా అందని పద్ధతులను, దారులను దళారులు కనిపెడు తుంటారు. ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా వదలిపెట్టరు. ఆర్‌టిసికి కేటాయించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. ఆర్‌టిసి కోటా దళారులకు రాచబాటగా మారింది. దీనిపై ధర్మచక్రం పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆర్‌టిసికి రోజుకు 1000 టికెట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం టూరిజాన్ని ప్రోత్సహించే క్రమంలో ఏపి టూరిజంకు కొన్ని దర్శనం టికెట్లు కేటాయిస్తోంది. టూరిజం ద్వారా టికెట్లు బుక్‌ చేసుకొచ్చేవారిని బస్సుల్లో తీసుకొచ్చి దర్శనం చేయించి తీసుకెళుతుంటారు. ఇటువంటి అవకాశాన్నే ఆర్‌టిసి కూడా కల్పించారు. రోజుకు 1000 టికెట్లు ఆర్‌టిసికి ఇస్తున్నారు. ఆర్‌టిసి బస్సు టికెట్టుతో పాటు శ్రీవారి దర్శనం టికెట్టు కూడా బుక్‌ చేసుకోవచ్చు. ఇటువంటి అవకాశాన్ని ఆన్‌లైన్‌లో కల్పించారు. ఈ విధంగా టికెట్టు తీసుకున్నవారు తిరుమల బస్టాండుకు చేరుకుంటే… మిగతా ఏర్పాట్లు ఆర్‌టిసి అధికారులు చేస్తారు. ఆ జాబితా ఆధారంగా ముందే దర్శనం టికెట్లు, లడ్డూ టోకెన్లు సిద్ధం చేస్తారు. భక్తులు రాగానే….ఆ టికెట్టు, టోకెన్‌ తీసుకుని క్యూలైన్‌లోకి వెళితే సరిపోతుంది. ఆర్‌టిసిలో వచ్చే భక్తులను ఉదయం 11 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 4 గంటలకు ఒకసారి రెండు దఫాలుగా దర్శనానికి అనుమతిస్తారు. అత్యంత డిమాండ్‌ ఉన్న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఆర్‌టిసికి కేటాయించడం వెనుక ఉద్దేశం ఏమంటే….టిటిడికి సేవలందిస్తున్న ఆర్‌టిసి బస్సులకు ఆచరణ పెంచడం ముఖ్యమైనది. అయితే…ఇది అక్రమార్కులకు కాసులు కురిపించే వరంగా మారింది.

అక్రమాలు ఎలాగంటే….
శ్రీవారి దర్శనానికి ఆర్‌టిసి కోటా ఉన్న సంగతి సామాన్య భక్తులకు తెలియదు. ఇంటర్నెట్‌ సెంటర్లు నడుపుతున్నవారు, దళారులకు దీనిపైన అవగాహన ఉండదు. సాధారణ కోటా కింద టికెట్లు దొరకకకున్నా ఆర్‌టిసి కోటాలో అందుబాటులో ఉంటాయి. దీన్ని దళారులు ఉపయోగించుకుంటున్నారు. ఆర్‌టిసి కోటా కింద టికెట్లు బుక్‌ చేసి భక్తులకు ఇస్తున్నారు. ఇలా టికెట్లు తీసుకుంటున్న 1000 మందిలో 150 మంది కూడా బస్సుల్లో రావడం లేదట. అందరూ విమానాలు, రైళ్లు, సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకుంటున్నారు. టికెట్లు తీసుకొచ్చి ఆర్‌టిసి బస్టాండులోని ప్రత్యేక కౌంటర్‌లో తనిఖీ చేయించుకుని, తమ దర్శనం, లడ్డూ టోకెన్లను తీసుకెళుతున్నారు. ఆర్‌టిసి అధికారులు కూడా దీన్ని చూసీచూనట్లు వదిలేస్తున్నారు. ఎందుకంటే….ఇది ఆర్‌టిసికి కూడా లాభదాయకంగా ఉంది. టికెట్లు బుక్‌ చేసుకున్నవారు బస్సు ఎక్కకుంటే…ఆ సీటులో ఇంకొకర్ని ఎక్కించుకుని వస్తున్నారు.

ఆర్‌టిసి కోటాను వినియోగించుకుని దళారులు, ఇంటర్నెట్‌ కేఫ్‌ల నిర్వాహకులు బాగానే సంపాదిస్తున్నారు. నెల్లూరు, కడప, చెన్నై, బెంగుళూరు, అనంతపురం…..ఇలా తిరుపతికి సమీపంలోని ప్రాంతాల నుంచి బస్‌ టికెట్లు బుక్‌ చేసి, వాటికి అనుబంధంగా శ్రీవారి దర్శనం టికెట్లూ తీసుకుంటున్నారు. దర్శనం టికెట్లకు ఆర్‌టిసి అదనపు ఛార్జీలు ఏమీ వసూలు చేయకున్నా…దళారులు మాత్రం వేల రూపాయలు గుంజుకుంటున్నారు. రూ.300 టికెట్టును రూ.1000 నుంచి రూ.2000 దాకా అమ్ముకుంటున్నారు.

స్థాని దళారుల చేతివాటం….
తిరుమలలో తిష్టవేసిన దళారులు కూడా ఆర్‌టిసి కోటాను వినియోగించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. యాత్రీకులను తమ సొంత ద్విచక్ర వాహనాల్లో ఎక్కించుకుని, ఆర్‌టిసి బస్టాండుకు తీసుకొచ్చి, టికెట్లు తనిఖీ చేయించుకుని, దర్శనం-లడ్డూ టోకెన్లు తీసుకెళ్లడం ధర్మచక్రం పరిశీలనలో బయటపడింది. ఈ దళారులు ముందుగానే…ఎవరో ఒకరి పేరుతో టికెట్లు బుక్‌చేసి, ఆ తరువాత తీసుకోవాలి. దీనివల్ల దళారులకు కొంతవరకు బ్రేక్‌ వేయొచ్చు. పంపుతున్నారు. ఇటువంటి వారితో ఆర్‌టిసి సిబ్బంది కుమ్మక్కవుతున్నారు. ఎవరు బుక్‌ చేసుకున్నారు, ఎవరు టికెట్టు తెచ్చారు అనేదానితో సంబంధం లేకుండా దర్శనం, లడ్డూ స్లిప్పులు ఇచ్చిపంపుతున్నారు. క్యూకాంప్లెక్స్‌లోనూ ఆర్‌టిసి కోటా కింద వచ్చేవారిని పెద్దగా తనిఖీ చేయడం లేదు. దీంతో దళారులకు అడ్డు లేకుండాపోయింది.

లడ్డూలలోనూ అక్రమాలు
ఆర్‌టిసి కోటా కింద దర్శనం టికెట్లు బుక్‌ చేసుకున్నవారు ఒక్కోసారి ఏవో ఇబ్బందులతో దర్శనానికి రారు. అలాంటి వారి పేరుతో తీసుకున్న లడ్డూలు పక్కదారిపడుతున్నాయి. టికెట్లు బుక్‌ చేసుకున్నవారు తిరుమలకు రాక మునుపే….ఆన్‌లైన్‌ లిస్టు ఆధారంగా లడ్డూ టోకెన్లను ఆర్‌టిసి సిబ్బందికి ఇచ్చేస్తున్నారు. ఎంతమంది దర్శనానికి రాకుంటే…ఆర్‌టిసి సిబ్బందికి అంతలాభమన్నమాట.

అక్రమాలను అరికట్టడానికి ఏమి చేయాలి?
ఆర్‌టిసి కోటా కింద టికెట్లు బుక్‌ చేసుకుని విమానాలు, రైళ్ల ద్వారా వస్తున్నవారి వల్ల ఆర్‌టిసికి నష్టంలేకపోవచ్చుగానీ…బస్సుల్లోనే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకునే సాధారణ ప్రయాణీకులకు దర్శనం టికెట్లు దొరకడం లేదు. అలాంటప్పుడు ఆర్‌టిసికి ప్రత్యేక కోటా ఎందుకివ్వాలన్న ప్రశ్న టిటిడి నుంచి ఎదురుకావచ్చు. అర్‌టిసిని అడ్డుపెట్టుకుని దళారులు లాభపడుతుంటే చూస్తూ ఎందుకుండాలన్న భావన కలగవచ్చు. అందుకే ఈ అ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి అటు ఆర్‌టిసి, ఇటు టిటిడి చర్యలు తీసుకోవాలి.

ఆర్‌టిసి కోటా కింద శ్రీవారి దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే పద్దతికి స్వస్తి చెప్పాలి. ఎవరికైనా ఆర్‌టిసి టికెట్టుతో పాటు శ్రీవారి దర్శనం అవసరమనుకుంటే…అటువంటి వారు నేరుగా సమీపంలోని బస్టాండుకు వెళ్లి టికెట్టు బుక్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల దళారులకు కొంతవరకు బ్రేక్‌ వేయొచ్చు. అదేవిధంగా తిరుమలలో లడ్డూ టోకెన్లు ముందుగా ఇచ్చే పద్ధతి తీసేయాలి. భక్తులు వచ్చిన తరువాత గుర్తింపు కార్డుల తనిఖీలన్నీ టిటిడి సిబ్బందే నిర్వహించి టోకెన్లు జారీచేసే పద్ధతి ప్రవేశపెట్టాలి. ప్రయాణీకులను తీసుకురావడం వరకే ఆర్‌టిసి పని. అపై వ్యవహారాలన్నీ టిటిడి క్యూకాంప్లెక్స్‌ లోపలే జరిగేలా మార్పులు తీసుకురావాలి.

ఆర్‌టిసి బస్టాండులో పంచె కట్టుడు మోసం!
ఆర్‌టిసి కోటా కింద శ్రీవారి దర్శనం టికెట్లు బుక్‌ చేసుకుని వస్తున్న వారికి తిరుమల బస్టాండులోనే శఠగోపం పెడుతున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్లాంటే….సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాలి. ఈ సంగతి చాలామంది యాత్రీకులకు తెలియదు. బస్టాండులో టికెట్లు తనిఖీ చేయించుకోడానికి వచ్చే భక్తులను….అక్కడే తిష్టవేసిన దళారులు మోసం చేస్తున్నారు. పంచె లేకుంటే దర్శనానికి అనుమతించరని చెబుతూ….తమ వద్దవున్న పంచెలను అధిక ధరలకు అంటగడుతున్నారు. అత్యంత పలచగా వుండే పంచె, పైన కట్టుకుంటే లోపలున్న దుస్తులు కనిపించే పంచె, రూ.70 విలువ చేయని పంచెనూ రూ.200 – రూ.250కు విక్రయిస్తున్నారు. బస్టాండులోనే ఒక మూల నిలబడి…పంచెలు కట్టి మరీ పంపిస్తున్నారు. అక్కడున్న ఆర్‌టిసి సెక్యూరిటీ సిబ్బంది, ఇతరు ఉద్యోగులూ దళారులకు సహకరిస్తున్నారు. తమకు రావాల్సింది తాము తీసుకుంటున్నారు. రోజూ ఇక్కడ వేల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఆర్‌టిసి బస్టాండు కావడంతో టిటిడి విజిలెన్స్‌ సిబ్బంది కూడా ఈ పంచెకట్టుడు మోసాన్ని పట్టించుకోవడం లేదు.

2 Comments

Leave a Reply

Your email address will not be published.


*