సంతలతో తీరుతున్న చింతలు..!

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

      శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో వసరపు సంతలు ఎక్కువగా ఏర్పాటు చేస్తుండటంపై ఇటు రైతులు, అటు వినియోగ దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


    గతంలో శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో సంత ఏర్పాటు చేశారు. పట్టణంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న సంతకు విశేష ఆధరణ లభిస్తోంది. శ్రీకాళహస్తి పరిసర ప్రాంత వాసులేగాక బిఎన్ కండ్రిగ, వెంకటగిరి, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సంతను ఉపయోగించు కుంటున్నారు. మరోవైపు ఏర్పేడు మండలంలో ఇటీవల సంతలు విరివిగా ప్రారంభిస్తున్నారు. ఈ మండలంలోని ముసిలిపేడు గ్రామంలో ప్రతి మంగళవారం సంత జరుగుతుంది. అలాగే ఏర్పేడులో ప్రతి గురువారం జరిగే సంతను ఇటీవల ఎంఎల్ఎ ప్రారంభించగా తాజాగా పాపానాయుడుపేటలో ప్రతి బుధవారం జరిగే సంతను ఎంఎల్ఎ బియ్యపు మధుసూధన్ రెడ్డి ప్రారంభించారు. త్వరలోనే ఏర్పేడులో పొట్టేళ్ళ సంతను ప్రారంభించనున్నారు. ఈ మండలంలో సంతల ఏర్పాటు లో వైకాపా మండల ఇన్ చార్జ్, ఎయిర్ పోర్టు అభివృద్ధి సలహా మండలి కమిటీ సభ్యులు గున్నేరి కిషోర్ రెడ్డి ప్రధాన పాత్రపోషిస్తున్నారు. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో వారమంతా సంతలు జరుగుతుండటం గమనార్హం.

    శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో వారంలో అధికరోజులు సంతలు జరుగుతుండటం రైతులకు ఎంతగానో ఉపయోగప డుతున్నాయి. వర్షాభావం కారణంగా రైతులు కూరగాయలు పండించడంపై ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతున్నారు. గతంలో... రైతులు తాము పండించిన కూరగాయలు మార్కెట్ కు తీసుకెళ్లి విక్రయించేవారు. కొందరు రైతులు చెన్నై కూడా సరుకులు తీసుకెళ్లేవారు. అక్కడ మార్కెట్ దళారులు చెప్పిందే రేటు. విధిలేని పరిస్థితి లో కష్టించి పండించిన కూరగాయలు వారికి అమ్మి ఒక్కోసారి చార్జీల కు కూడా లేక ఇబ్బందులు పడుతూ వచ్చేవారు. దీంతో స్థానికంగా కూరగాయలు పండించాలన్నా ఆలోశించేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. సంతలు అధికంగా ఉండటంతో పండించిన సరుకులు రైతులే నేరుగా సంతలో విక్రయిస్తున్నారు. ఫలితంగా రైతులు నష్టపోయే పరిస్థితి పెద్దగా రావడంలేదు. ఇటు ప్రజలు సైతం తాజా కూరగాయలు అనువైన రేటుకు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఇటు రైతులు, ప్రజలు ఇద్దరూ లాభ పడుతున్నారు. కూరగాయలు పండించేందుకు రైతులు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. అన్ని ప్రాంతాల్లో నూ సంతలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*