సందిట్లో సడేమియా…నాగబాబు!

సందిట్లో సడేమియా అంటే ఏమిటో సినినటుడు నాగబాబును చూస్తే అర్థమవుతుంది. ఆ మధ్య పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేశారన్న కోపంతో కత్తి మహేష్‌పైన మెగా అభిమానులు మాత్రమే కాదు…మెగా హీరోలూ విరుచుకుపడ్డారు. మహేష్‌ను చంపేస్తాం, నరికేస్తాం అంటూ పవన్‌ అభిమానులు బెదిరించారు. సోషల్‌ మీడియా వేదికగా పరమ బూతులతో దూషించారు. ఇదంతా రాజకీయంగా పవన్‌కు నష్టం కలిగిస్తుందని భావించి రాజీ చేసుకున్నారు. మహేష్‌-పవన్‌ అభిమానుల వివాదం సద్దుమణిగింది. తాజాగా కత్తి మహేష్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. టివి ఛానల్‌ చర్చల్లో రామాయణాన్ని ఒక పుస్తకం మాత్రమేనని అభివర్ణించిన మహేష్‌….శ్రీరాముడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కొన్ని హుందూ సంఘాలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. మహేష్‌ది తప్పా ఒప్పా అనేది వేరే అంశం. అందులోకి వెళ్లడం లేదు. ఏమైనా ఇది మత ఛాందసులకు, కత్తి మహేష్‌కు మధ్య జరుగుతున్న గొడవ. అయితే సందు దొరికింది కదా అని పాత కక్షలు, కోపంతో నాగబాబు ఇందులో తలదూర్చుతున్నారు. మహేష్‌ కత్తిని అరెస్టు చేయాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోకుంటే చారిత్రక తప్పిదం చేసిన వారవుతారని అన్నారు. ఈ విషయాన్ని పోలీసులు తేలిగ్గా తీసుకుంటే ప్రజలే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారంటూ రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు.

నాగబాబు చెబుతున్నట్లు మనోభావాలు, సెంటిమెంట్ల పేరుతో కేసులు పెట్టాల్సివస్తే…మొదటి కేసు ఆయనపైనే పెట్టాల్సివుంటుందన్నది ప్రజాస్వామికవాదుల అభిప్రాయం. ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్న జబర్ధస్‌ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో వ్యక్తులు, వ్యవస్థలను కించపరుస్తున్నారని, ప్రత్యేకించి మహిళలను అవహేళన చేస్తున్నారని పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన ఉదంతాలూ ఉన్నాయి. ఆ కార్యక్రమాన్ని వినోదం కోసమే రూపొందించినా….ప్రేక్షకులకు వెగటు పుట్టించే అనారోగ్యకర హాస్యమే ఆ షోకు ఆలంబనగా ఉంది. అయినా రామాయణ, మహాభారతాలను తార్కికంగా విశ్లేషించిన వారు అనేక మంది ఉన్నారు. రామయణ విషవృక్షం అని ప్రముఖ రచయిత్రి రంగనాయమ్మ పెద్ద గ్రంథమే రాశారు. అలాగని ఆమెమీద కేసులు పెట్టగలరా? ఇలాంటి విషయాలను మత ఛాందసులు పరిగణనలోకి తీసుకో కుండా మాట్లాడున్నారంటే అర్థముంది. నాగబాబు వంటి కళాకారుడు వాస్తవాలను పట్టించుకోకుండా, పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని మహేష్‌ను అరెస్టు చేయాలని, లేకుంటే ప్రజలే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటారని జనాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం విజ్ఞత అనిపించుకోదు. ఇలాంటి వ్యాఖ్యలకు భవిష్యత్తులో తన మెడకే చుట్టుకోవచ్చు. రేపు ఛాందసులు నాగబాబుపైనా ఇటువంటి కేసులే పెట్టరన్న గ్యారెంటీ ఏమీ లేదు. అందుకే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు అంతే ఉన్నతంగా, హుందాగా ఉండాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*