సాంబశివరావుపై కోపం…భక్తులకు శాపం!

తిరుమలలో గత వారం రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దర్శనానికి 30 గంటలు – 40 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం తిరుమలలోనే వేచివుండే భక్తులు పడరానిపాట్లు పడుతున్నారు. కొందరు దర్శనం చేసుకోకుండానే అఖండం వద్ద టెంకాయ కొట్టుకుని తిరిగి వెళుతున్నారు.

అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ రాకమునుపు దొండపాటి సాంబశివరావు టిటిడి ఈవోగా ఉన్నారు. ఒక విధంగా ఆయన టిటిడి మొత్తాన్ని ప్రక్షాళన చేశారు. ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం ఎలా చేయించాలో శాస్త్రీయమైన కసరత్తు చేశారు. ఏ రోజు వచ్చే భక్తులకు ఆ రోజు అర్ధరాత్రిలోపు దర్శనం పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. సాంబశివరావు రాక మునుపు కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు కనిపించేవి. ఆయన కసరత్తు చేసి, కొన్ని విధానాలను రూపొందించిన తరువాత తిరుమలలో క్యూలైన్లు కనిపించకుండాపోయాయి. వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లోనూ క్యూలైన్లు రోడ్డుపైకి రాలేదు. అయితే….మళ్లీ ఇప్పుడు భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి?

శ్రీవారి దర్శనం విషయంలో సాంబశివరావు స్థిరపరచిన పద్ధతులను నామరూపాలు లేకుండా చేశారు. ఆయన స్థిరీకరించిన పద్ధతుల్లో రోజుకు లక్ష మందికిపైగా దర్శనం చేసుకునేవారు. ఇప్పుడు 70 వేలు – 80 వేలకు మించడం లేదు. ఎక్కడైనా మార్పులు చేయాల్సిందే. అయితే అవి గతం కంటే మెరుగ్గా ఉండాలి తప్ప….అంతకంటే బాధలు కలిగించేలా ఉండకూడదు. సాంబశివరావు ఉన్నప్పుడు ఒకటే ఆరోపణ ఉండేది. వెండి వాకిలి-బంగారు వాకిలి మధ్య కాస్త తోపులాటలు జరుగుతున్నాయని భక్తుల నుంచి ఫిర్యాదులు అందేవి. ఎంత తోపులాటలున్నా…..క్షణకాలం శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఆ బాధలన్నీ మరచిపోయి సంతోషంగా వెళ్లేవారు. తోపులాటలు ఉండకూడదనే పేరుతో చేసిన మార్పుల వల్ల రోజూ వేల మంది శ్రీవారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. అప్పుడు ఏరోజు భక్తులు ఆ రోజు దర్శనం చేసుకోవడం వల్ల విపరీతంగా రద్దీ పెరిగే అవకాశం లేకుండాపోయింది. ఇప్పుడు ఒకరోజు లక్ష మంది వచ్చారనుకుంటే…80 వేల మందికి మాత్రమే దర్శనం అవుతోంది. 20 మంది రెండో రోజుకు మిగిలిపోతున్నారు. ఆ రెండో రోజు కూడా అదే రీతిగా రద్దీవుంటే…మొత్తం 40 వేల మందికి దర్శనం కాకుండపోతోంది. ఇలా రద్దీ పెరిగిపోతూ….భక్తులు అవస్థలపాలవుతున్నారు.

సాంబశివరావుపై ఉన్న కోపంతో…ఆయన పెట్టిన విధానాలు ఏవీ అమల్లో ఉండకూడదన్న భావనతో కొందరు అధికారులు ప్రస్తుత ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను తప్పుదారి పట్టించి, కొత్తపద్ధతులు తీసుకొచ్చారన్న విమర్శలున్నాయి. టిటిడిలో ప్రతిదానికీ రికార్డులుంటాయి. గతంలో రోజుకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు, క్యూలైన్లు ఎన్నిసార్లు వైకుంఠం దాటి బయటకు వచ్చింది వంటి వివరాలను పరిశీలిస్తే….ప్రస్తుతం భక్తులు పడుతున్న బాధలకు బాధ్యత ఎవరిదో అర్థమవుతుంది.

2 Comments

  1. Some one’s comment is correct. The comparision is true and the present EO deserves an immediate replacement.

Leave a Reply

Your email address will not be published.


*