సిఎం సింగపూర్‌ పర్యటన – జెఈవో పర్యటనకు బ్రేక్‌!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల (జులై) 8, 9 తేదీల్లో సింగపూర్‌లో పర్యటించనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే తిరుమల జెఈవో శ్రీనివాసరాజు సింగపూర్‌ పర్యటనకు ప్రభుత్వం బ్రేక్‌ వేసిందా? ఇద్దరూ ఒకే సమయంలో సింగపూర్‌లో ఉండటం వల్ల లేనిపోని అపోహలు తలెత్తుతాయని ప్రభుత్వం భావించిందా?

సింగపూర్‌లో జరిగే ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 08.07.2018, 09.07.2018 తేదీల్లో సింగపూర్‌లో ఉంటారు. వ్యక్తిగత పనుల నిమిత్తం సింగపూర్‌ వెళ్లడానికి తనకు 02.07.2018 నుంచి 10.7.2018 దాకా సెలవు మంజూరు చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీనివసరాజు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. సెలవు మంజూరు చేస్తూ 19.06.2018న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యలో చంద్రబాబు సింగపూర్‌ పర్యటన ఖరారయింది. ఇటీవల అమరావతికి వచ్చిన సింగపూర్‌ మంత్రులు….తమ దేశంలో జరిగే ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. దీనికి బాబు అంగీకరించారు. పర్యటన ఖరారయింది. శ్రీనివాసరాజు సెలవు రద్దు చేయకుండా ఉంటే…బాబు సింగపూర్‌ వెళ్లే సమయానికి శ్రీనివాసరాజు అక్కడే ఉండే అవకాశాలున్నాయి.

శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయంటూ రమణ దీక్షితులు కొంతకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. సింగపూర్‌లోనే పురాతన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసే ఏజెంట్లు ఉంటారని, శ్రీనివాసరాజు తరచూ సింగపూర్‌ వెళుతుంటారని దీక్షితులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా శ్రీనివాసరాజుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ…ఆయన్ను టిటిడిలోనే కొనసాగిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలున్నాయి. ఈ పరిస్థితుల్లో శ్రీనివాసరాజు సింగపూర్‌ పర్యటనలో ఉన్న సమయంలోనూ ముఖ్యమంత్రి కూడా వెళ్లడం వల్ల లేనిపోని అపోహలకు తావిచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావించింది. అందుకే శ్రీనివాసరాజు సెలవు రద్దు చేస్తూ, ఆయన సింగపూర్‌ పర్యటనకు బ్రేకులు వేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*