సినిమావోళ్లు సిఎంను కలిస్తే పచ్చ మీడియా ఏడుపు ఎందుకు…!

కరోనా లాక్ డౌన్ అనంతరం చిత్రీకరణ ప్రారంభించడం, సినిమా టికెట్ల విధానంలో మార్పులు తీసుకురావడం వంటి అంశాలపై చర్చించేందుకు చిరంజీవి, నాగార్జున తదితర తెలుగు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. దీనిపైన తెలుగుదేశం అనుకూల మీడియా లబోదిబోమంటోంది. జగన్ ను కలిసిన వారంతా ఏదో నేరం చేసినట్లు, సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరించినట్లు విమర్శలు గుప్పిస్తోంది.

జగన్ను కలిసేందుకు చిరంజీవి తదితరులు అమరావతికి‌ వస్తున్న విషయం తెలుసుకున్న రాజధాని రైతులు (అమరావతిలోనే రాజధాని కొనసాగాలని ఆందోళనలు చేస్తున్నవారు)…వారిని కలిసి తమకు మద్దతు ఇవ్వాలని అడగాలని‌ అనుకున్నారట. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారట. వచ్చిన వాళ్లు జగన్ ను కలిసి తమ గోడు చెప్పుకుని వెళ్లిపోయారు.

దీంతో ఒకవర్గం మీడియా కుతకుత లాడిపోతోంది. మీరు రైతుల గురించి సినిమాలు తీస్తారు, మీ సినిమాల్లో రైతులుంటారు, రైతు కూలీలుంటారు, వ్యవసాయం ఉంటుంది…నిజ జీవితంలో మాత్రం రైతులను పట్టించుకోరా…అంటూ ఆగ్రహం, ఆక్రోశం కలగలిసిన గొంతులతో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇంతగా బాధపడిపోడానికి, విలవిల్లాడ టానికి కారణాలు లేకపోలేదు. ప్రభుత్వం పరిపాలా రాజధానిగా మార్చాలను కుంటున్న విశాఖపట్నంలో భూములు ఇస్తే అక్కడ స్టూడియోలు నిర్మిస్తామని చెప్పడమే. ఈమాట తెలుగుదేశం అనుకూల మీడియాకు ఏమాత్రం రుచించడం లేదు. అవసరమైతే అమరావతిలో 300 ఎకరాలు కాకుంటే 3,000 ఎకరాలు తీసుకోండి‌ అంతేగానీ విశాఖపట్నంలో భూములు అడగడం ఏమిటన్నది వారి వాదన. అందుకే రైతులు, సామాజిక బాధ్యత అంటూ సూక్తిముక్తావళి వల్లిస్తున్నారు.

అయినా…అమరావతి రైతుల‌ అందోళన రాజకీయ అంశంగా మారిపోయింది. అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని కోరుకునేవారు ఉన్నట్లే, మూడు రాజధానులు ఉండాలని కోరుకునేవారు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో…. అమరావతి రైతుల ఆందోళన ఏదో జాతీయోధ్యమం అయినట్లు, దానికి మద్దతు ప్రకటించక పోవడం సినీ ప్రముఖులు చేసిన ద్రోహం అన్నట్లు ఆ మీడియా దుమ్మెత్తి పోస్తోంది.

ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. అమరావతిలోనే సినీ స్టూడియోలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంటే…చంద్రబాబు పాలనలోనే వచ్చి భూములు అడిగేవారు. అమరావతి కంటే విశాఖనే అనుకూలమనే భావనలో సినీ పెద్దలున్నారు. ఆమాటనే సిఎం వద్ద బయటపెట్టారు. కానీ…అది ప్రభుత్వమైనా, ప్రయివేటు వ్యక్తులైనా తాము చెప్పిన అమరావతిలో తప్ప ఇంకోచోటికి వెళ్లకూడదన్నట్లు ఉంది పచ్చ మీడియా ధోరణి.

ఆ మీడియా ఏడుపు ఎలావున్నా…సినీ ప్రముఖులు సిఎంను కలవడం, విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించి కొన్ని నిర్ణయాలకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*