సిని’మా’ పెద్దలకు ఐమాక్స్‌ సినిమానే!

తెలుగు సిని’మా’ పెద్దలు తాము ఏమి చేసినా చెల్లిపోతుందనుకున్నారు. సినిమా అవకాశాల కోసం వెళితే లైంగికంగా వేధించారని శ్రీరెడ్డి సినీరంగ పెద్దలపైన ఆధారాలతో సహా మాట్లాడుతుంటే….పట్టించుకుని సమస్యను పరిష్కరించాల్సిన మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్‌ పెద్దలు శ్రీరెడ్డిని తక్కువ అంచనా వేశారు. ఆఖరికి ఆమె అర్ధనగ్నంగా ఆందోళనకు దిగినప్పుడు కూడా సానుకూలంగా స్పందించలేదు. ‘ఇలా బెదిరిస్తే బెదరం…నీతో మా అసోసియేషన్‌లోని నటులు ఎవరూ నటించరు. నిన్ను బహిష్కరిస్తున్నాం’ అని మా తరపున శివాజీరాజా శ్రీరెడ్డిని పూచికపుల్లలా తీసేస్తూ మాట్లాడారు. దీంతో శ్రీరెడ్డి తన వద్ద ఉన్న సినిమా పెద్దల బాగోతాలను బయటపెట్టింది. ఇంకా ఫొటోలు, ఇతర ఆధారాలు ఉన్నాయని బయటపెడుతానని ప్రకటించింది. ఇంతలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. శ్రీరెడ్డి కేసును సుమోటాగా స్వీకరించింది. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై విచారణ జరిపేందుకు సిద్ధపడి ‘మా’ నాయకులతో పాటు ప్రభుత్వ అధికారులకూ నోటీసులు జారీ చేసింది. దీంతో కంగుతున్న సినిమా పెద్దలు హడావుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టారు. శ్రీరెడ్డిని అసోసియేషన్‌లో చేర్చుకుంటామని చెప్పారు. పరిశ్రమలో నటీమణులకు ఎదురవుతున్న లైంగికపరమైన వేధింపులపై విచారణ జరిపేందుకు 10 మందితో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీరెడ్డితో నటించడానికి ఎలాంటి ఆంక్షలూ లేవని చెప్పారు.

తనపై వరాల జల్లు కురిపించడంతో శ్రీరెడ్డి పరవశించిపోతారని సినిమా పెద్దలు భావించారుగానీ….శ్రీరెడ్డి మాత్రం చాలా డిమాండ్లను ముందుకు తెచ్చింది. తన పోరాటాన్ని చట్టపరంగా కొనసాగిస్తానని ప్రకటించింది. తనలాంటి బాధితులు రేపటి నుంచి బయటకు వస్తారని కూడా ఆమె వెల్లడించారు. శ్రీరెడ్డికి మహిళా సంఘాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రేపు జాతీయ మహిళా హక్కుల కమిషన్‌ కూడా స్పందించే అవకాశం ఉంది. ఇవన్నీ శ్రీరెడ్డికి మాత్రమే కాదు…అటువంటి బాధితులందరికీ కొండంత ధైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. కచ్చితంగా ఆమె ప్రకటించినట్లు బాధితులు ఒకొక్కరే బయటకు వచ్చే అవకాశముంది.

ఇక్కడో ఇంకో అంశం కూడా చర్చనీయాంశం అయింది. మా అసోసియేషన్‌ వేసిన కమిటీ వల్ల ఉపయోగం లేదని, సిట్టింగ్‌ జడ్జితోగానీ; రిటైర్డ్‌ జడ్డితో గానీ విచారణ జరిపించాలని కొందరు సామాజిక కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండే ప్రధానంగా ముందుకు వచ్చేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే సినిమా పెద్దలకు ఐమాక్స్‌ సినిమానే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*