సిబిఐ కొత్త డైరెక్టర్‌ నాగేశ్వరరావు…చంద్రబాబు మనిషా..!

సిబిఐలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా తెలుగు అధికారి మన్నెం నాగేశ్వరరావు సిబిఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సిబిఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా, డైరెక్టర్‌ అలోక్‌ వర్మ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ ఇద్దరినీ సెలవుపై పంపింది. కొత్త డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించింది. ఈ నియామకం తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చకు దారితీసింది.

బిజెపితో విభేదించిన తరువాత తమపై మోడీ కక్ష సాధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సిఎం రమేష్‌ ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించినా దాన్ని కాక్షసాధింపు చర్యగా టిడిపి ప్రచారం చేసింది. తమ నాయకులపైన సిబిఐ కేసులు రావచ్చని కూడా తెలుగుదేశం నాయకులు గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఇంతోనే అనూహ్యంగా…సిబిఐ అధికారులే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని రచ్చకెక్కారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించకతప్పలేదు. సిబిఐని ప్రక్షాళన చేసే పేరుతో….రాకేశ్‌ ఆస్థానాను, అలోక్‌ వర్మను సెలవుపై పంపడంతో పాటు 13 మంది అధికారులను బదిలీ చేసింది. కొత్త డైరెక్టర్‌గా నాగేశ్వరావును నియమించింది.

ఈ నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రం జయశంకర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి. 1986 ఐపిఎస్‌ బ్యాచ్‌ అధికారి. నాగేశ్వరరావు తెలుగు వ్యక్తికావడం వల్ల ఆయనకు రెండు రాష్ట్రాల్లోని నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం నేతలకు మరింత సన్నిహితుడని అంటున్నారు. ఇదే నిజమైతే మోడీ ఆయన్ను సిబిఐ డైరెక్టర్‌గా ఎందుకు నియమిస్తారనేది ప్రశ్న. తెలుగుదేశం-బిజెపి ఉప్పు-నిప్పులా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో…టిడిపికి ఏమాత్రం అనుకూలించే నిర్ణయాన్ని మోడీ తీసుకోరనేది సుస్పష్టం. అందుకే తెలుగు వ్యక్తి నాగేశ్వరరావు డైరెక్టర్‌గా నియమితులైనా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండకపోవచ్చనేది కాస్త తర్కబద్ధంగా ఆలోచించేవారికి ఎవరికైనా అర్థమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*