సిబిఐ విచారణకు నేను సిద్ధం…మీరు సిద్ధమా! రమణ దీక్షితులు సవాల్

శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు రమణదీక్షితులు మరోసారి మీడియా ముందుకొచ్చారు. టిటిడి మాజీ ఈవో లు, ఇతర అధికారులు తనపై చేసిన విమర్శలకు ఘాటైన సమాధానం ఇచ్చారు. తన ఆస్తిపాస్తులు పైన సిబిఐ విచారణకు సిద్ధమని, అదేవిధంగా తనపై విమర్శలు చేసిన అధికారులు రాజకీయ, నాయకులు సిబిఐ విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. గడచిన 24 ఏళ్ల కాలంలో తాను శ్రీవారి ఆలయంలోనే అనేక అవమానాలను ఎదుర్కొన్నానని రమణదీక్షితులు చెప్పారు. ప్రధానంగా జీవోలు బాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు తనను ఎంతగానో క్షోభ పెట్టారని ఆవేదన చెందారు. ఈ ముగ్గురు జీవోలు శ్రీవారి ఆలయంలో వంశపారంపర్య అర్చకులను లేకుండా చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. బాలసుబ్రమణ్యం దీర్ఘకాలం తిరుమలలో ఉంటూ అర్చకులను అవహేళన చేసేవారని చెప్పారు. తనకు రోజు కూలీ 50 రూపాయలు వంతున బాలసుబ్రమణ్యం ఇచ్చారని, దాన్ని ఆయన కూలీ గానే చెప్పేవారని వివరించారు. అర్చకులను పేరుపెట్టి పిలిచేవారని, ఒరే తరే అనేవారని పేర్కొన్నారు. ఎంత వారించినా వినకుండా వేయికాళ్ల మండపాన్ని కూల్ చేశారని చెప్పారు. వేయికాళ్ల మండపం కూల్చివేయడానికి అడ్డుకున్నందుకు తనపై ద్వేషం పెంచుకున్నారని చెప్పారు. బాలసుబ్రమణ్యం తిరుమలలో ఉండగానే అనేక బలహీనతలకు లోనయ్యారని ఆరోపించారు. అక్రమ పద్ధతుల్లో డబ్బులు సంపాదించాలని కూడా రమణదీక్షితులు విమర్శించారు.
ఆ తర్వాత వచ్చిన ధర్మారెడ్డి కూడా బాలసుబ్రమణ్యం లాగే బ్రాహ్మణ వ్యతిరేకి అని చెప్పారు. ఇక శ్రీనివాసరాజు అక్రమాలకు అంతే లేదన్నారు. ఆయన కూడా అర్చకులను ఏకవచనంతో సంబోధిస్తూ అవమానిస్తారు అని చెప్పారు. వీఐపీ దర్శనాల సమయంలో సన్నిధికి వచ్చి, హారతి ఇవ్వండి, శఠారి పెట్టండి, పండు ఇవ్వండి…. అంటూ అర్చకుల పై పెత్తనం చేసేస్తారని తెలిపారు. ఐఏఎస్ అధికారికి సన్నిధిలో ఏం పని ఉంటుందని ప్రశ్నించారు. టీటీడీలో అధికారులు రాజభోగాలు అనుభవిస్తున్నారని చెప్పారు. ప్రధానార్చకుడు కి 60000 జీతం ఇస్తుండగా అధికారులు లక్షల్లో తీసుకుంటున్నారని అన్నారు. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగడం లేదని, పోటులో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని , శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయని చెప్పినందుకు నన్ను శ్రీవారికి దూరంచేసి ఇంత పెద్ద శిక్ష వేస్తారా అని ప్రశ్నించారు. పోటులో తవ్వకాలు జరగడాన్ని తాను స్వయంగా చూశానని చెప్పారు. ఆలయంలో పూజాది కార్యక్రమాలని సవ్యంగా జరుగుతున్నాయా, వార్షిక ఉత్సవాలు జరగాల్సిన పద్ధతిలో జరుగుతున్నాయా, స్వామివారి అలంకరణ సక్రమంగా ఉందా అని ఆయన నిలదీశారు. శ్రీవారి ఆభరణాలు టిటిడి పరివేక్షణ లోకి వెళ్ళిన తర్వాత అన్ని సక్రమంగా ఉన్నాయోలేదో తేల్చడానికి సిబిఐ విచారణకు సిద్ధమా అని రమణదీక్షితులు ప్రశ్నించారు. శ్రీవారి సేవ కోసమే పుట్టి శ్రీవారి సేవలో ని కనుమూయాలని భావిస్తున్న తనను జైల్లో పెట్టి కొట్టాలని అంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు.

టిటిడి సంబంధించి రమణ దీక్ష చేసిన ఆరోపణలకు సరైన సమాధానం ఇవ్వకుండా… టిటిడి మాజీ ఈ వోలు, జేఈవోలు, సివిఎస్వోలతో రమణదీక్షితులు పై ఎదురుదాడి చేయించారు. రమణదీక్షితులు అవినీతిపరుడని, క్రమశిక్షణ పాటిించరని ఏవేవో విమర్శలు చేయించారు. ఈ నేపథ్యంలో రమణదీక్షితులు స్పందించారు. ఇదిలా ఉండగా దీక్షితులు చేస్తున్న విమర్శలు ఆధారంగా బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

2 Comments

  1. అర్చకులకు ఇంతగా క్షోభ పెడుతున్నవారు తప్పకుండా శిక్ష అనుభవించితీరతారు

Leave a Reply

Your email address will not be published.


*