బాబుతో సిపిఎం కలుస్తుందా…ఇది సాధ్యమా..!

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిపి ఓ కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బిజెపిని వ్యతిరేకించే అన్ని పార్టీలూ ఈ కూటమిలోకి వస్తాయని చెబుతున్నారు. ఆయన పలు పార్టీల నేతలను ఢిల్లీలో కలిశారు. వామపక్షాల నేతలనూ కలిశారు.

బిజెపిపై తొలి నుంచీ పోరాడుతున్న వామపక్షాలు చంద్రబాబు చెబుతున్న ‘బిజెపి వ్యతిరేక కూటమి’లో చేరుతాయా…చేరవా అనేది ఇప్పుడు ఆసక్తికలిగిస్తున్న అంశం. ఈ దేశంలో ఇటువంటి కూటములు ఎప్పుడు ఏర్పాటైనా అందులో వామపక్షాలు కీలక భూమిక పోషించాయి. కమ్యూనిస్టులు లేకుండా కూటములు లేవంటే అతిశయోక్తికాదు. అటువంటిది బాబు చెబుతున్న కూటమికి సంబంధించి ఎర్రజెండా పార్టీలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయనేది సహజంగానే ఆసక్తి కలిగించే అంశం.

వామపక్షాల్లో సిపిఐ సంగతి ఇంకా స్పష్టంకాలేదుగానీ…సిపిఎం విధానం మాత్రం ఎప్పుడో స్పష్టమైపోయింది. చంద్రబాబు నిర్ణయంతో సంబంధం లేకుండా సిపిఎం చాలాకాలం క్రితమే ఓ నిర్ణయం తీసుకుంది. తమ రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసే ఏ కూటమిలోనూ చేరకూడదన్నది ఆ నిర్ణయ సారాంశం. విధానపరమైన అంశాల ఆధారంగా కాకుండా…అప్పటి ఆ పార్టీల రాజకీయ అవసరాల కోసం ఏదో కూటమి పేరుతో హడావుడి చేయడం…ఆపై అందుకు విరుద్ధమైన కూటమిలో చేరడం వంటివి దేశంలోని బూర్జువా పార్టీలకు అత్యంత సహజమైన అంశంగా మారిపోయింది.

ఒకప్పుడు మతోన్మాద బిజెపితో కలిసే ప్రసక్తే లేదన్న చంద్రబాబు ఆ తరువాత అదే పార్టీతో జతకట్టారు. ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలుస్తానంటున్నారు. ఒకప్పుడు బిజెపి, కాంగ్రెపేతర కూటమి (మూడో కూటమి) ఏర్పాటులో పాల్గొన్న బాబు…ఆ తరువాత ఆ రెండు పార్టీలతోనూ కలిశారు. ఇటువంటి అవకాశవాదన్నే దేశ వ్యాపితంగా ఉన్న పార్టీలు అవలంబిస్తున్నాయి. అందుకే ఇటువంటి కూటముల వల్ల దేశానికి ప్రయోజనం లేదన్న నిర్ణయానికి సిపిఎం వచ్చింది. ఇకపై అటువంటి కూటములు ఏర్పాటు చేయడంగానీ, చేరడంగానీ చేయకూడదన్న ఆ పార్టీ జాతీయ మహాసభ తీర్మానించింది. విధానపరమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే తెలంగాణలో బహుజన లెఫ్‌ ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) ఏర్పాటయింది. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా జనసేన, లోక్‌సత్తా, సిపిఐ తదితర పార్టీలతో కొత్త కూటమి ఏర్పాటు చేసింది.

ఈ పూర్వరంగంలో చూస్తే…బాబు చెబుతున్న కాంగ్రెస్‌తో కలిసిన కూటమిలో సిపిఎం భాగస్వామి అయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పేయవచ్చు. ఇదే అంశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఓ టివి ఛానల్‌ చర్చలో మాట్లాడుతూ….’మేము చంద్రబాబు నాయుడి కూటమిలో చేరే అవకాశమే లేదు…నాలుగేళ్లు బిజెపికి అన్ని విధాలా సహకరించి ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతామంటే జనం నమ్మరు. వామపక్షాలు మొదటి నుంచి బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయి. మా పోరాటం మేం కొనసాగిస్తాం.’ అని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల తరువాతే కూటములు కట్టే అవకాశం ఉంటుది తప్ప, ఎన్నికలకు ముందు కూటములు ఏర్పాటయ్యే అవకాశం లేదని, చంద్రబాబు చెబుతున్న కాంగ్రెస్‌తో కూడిన కూటమి కూడా నిలబడబోదని, అదంతా వృథా ప్రయాసేని మధు తేల్చేశారు.

బిజెపి వ్యతిరేకత పేరు చెప్పగానే….సిపిఎం వచ్చి తమ ఒడిలో వాలిపోతుందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్న వామపక్షాలు….ఆ ప్రయత్నాలను విడిచిపెట్టి తమతో కలుస్తాయని టిడిపి ఆశిస్తోంది. ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ జరగబోదనేది ఇప్పటికే తేలిపోయింది.

1 Comment

  1. నేను అన్ని యాడ్స్ ఓపెన్ చేసి చూస్తున్నాను.
    అంతకంటే ముందుగా మిమ్మల్ని అభినందించాలి. మీ కథనాలు విశ్లేషణలు కొత్త కోణాల్లో వెళుతున్నాయి.ఆసక్తికరంగా, వాస్తవానికి దగ్గరగా ఉంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published.


*