సీమకు బాబు మరో ద్రోహం… టిటిడి ఉద్యోగాలకు రాష్ట్రమంతా అర్హులేనట..! –

– గతంలో పద్మావతి మెడికల్‌ కాలేజీ విషయంలో ఇదే ధోరణి

– సీమ ప్రజా ఉద్యమంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం

– ఉద్యోగాల విషయంలో ద్రోహం చేసే ధోరణి

– రాష్ట్రపతి ఉత్తర్వులు టిటిడికి వర్తించవట

తానూ రాయలసీమ బిడ్డనే అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సొంత గడ్డకు ద్రోహంచేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు రాయలసీ ప్రాంత నిరుద్యోగులకు ఏకైక దిక్కుగా ఉన్న టిటిడిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికీ ఉద్యోగాలు ఇవ్వవచ్చునట. ఇక్కడ జోనల్‌ వ్యవస్థ (రాష్ట్రపతి ఉత్తర్వులు) వర్తించవట. ఇది రాయలసీమకు తీరని అన్యాయం చేసే నిర్ణయమే. వివరాల్లోకి వెళితే….

టిటిడిలో 8000కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలని సీమలోని నిరుద్యోగులు, ప్రజాసంఘాల నేతలు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్‌ విధానంలోని అనుమానాలను నివృత్తి చేసుకోడానికి టిటిడి ఈవో అనీల్‌ కుమార్‌ సింఘాల్‌ 11.12.2017లో ఓ లేఖను ప్రభుత్వానికి రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తరపున ఎండోమెంట్‌ విభాగం 05.10.2018న వివరణ ఇస్తూ మెమో నె.49479ను జారీ చేసింది. టిటిడిలో నియామకాలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించబోవని, రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి నియామకాలు జరపాలని ఆ మెమోలో పేర్కొన్నారు.

ఇది కచ్చితంగా రాయలసీమకు ద్రోహం చేయడమే అవుతుంది. నాలుగేళ్ల క్రితం పరుపతి పద్మావతి ఉమెన్స్‌ మెడికల్‌ కాలేజీ వ్యవహారంలో ఇలాగే జరిగింది. పద్మావతి వైద్య కళాశాలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికీ సీట్లు ఇస్తూ జీవో నెం.120ని జారీ చేసింది. దీనిపైన రాయలసీమలోని విద్యార్థులు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. దీంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. పద్మావతి మెడికల్‌ కాలేజీ రాష్ట్ర స్థాయి సంస్థగా కాకుండా, రాయలసీమ ప్రాంతానికి చెందిన సంస్థగా గుర్తిస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. దీంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని వారికి మాత్రమే సీట్లు కేటాయించే పరిస్థితి వచ్చింది.

ఈ అనుభవం తరువాత కూడా ప్రభుత్వం ఆలోచించిన పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందన్న భావన ఇక్కడి ప్రజల్లో ఉంది. నవ్యాంధ్రలోనైనా సీమకు న్యాయం జరుగుతుందని భావించారు. అయితే…రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారు. కనీసం హైకోర్టు అయినా సీమలో ఏర్పాటు చేస్తారనుకుంటే….దాన్ని కూడా గుంటూరులో పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వంపై సీమ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితిల్లో టిటిడి వంటి సంస్థలోనూ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసే ఉత్తర్వులను ప్రభుత్వం ఇచ్చింది. ఇది సీమలోని నిరుద్యోగుల పాలిట ఉరితాడు అనడంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*