ప‌ట్టిసీమ నీళ్లు…రాయ‌ల‌సీమ‌కు ఇచ్చారా..? ఎప్పుడు..ఎక్క‌డ‌..? సీమకు సీమ నేతలే బద్ద శత్రువులా?

తెలుగు దేశం ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేత పత్రాలు అబద్దాల పుట్టగా వున్నాయి. తొలి శ్వేత పత్రంలో 24 వేల కోట్లు రైతులకు రుణ మాఫీ చేసినట్లు పచ్చి అబద్ధం చెప్పారు. తర్వాత నెమ్మదిగా రెండు మూడు కంతులు జనవరి లో రైతుల ఖాతాల్లో వేస్తున్నామని చెప్పారు.  డిసెంబర్ 27 వ తేదీ విడుదల చేసిన సహజ వనరుల నిర్వహణ శ్వేత పత్రం మరీ అబద్దాలతో వుండటమే కాకుండా రాయలసీమ ప్రజలకు కృష్ణా నది జలాలపై హక్కు లేనట్టు తేల్చింది.  ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టి సీమ పథకం పూర్తి చేసినందున డెల్టాలో మిగిలిన నీరు సీమ కు ఇచ్చినట్లు చెప్పి…. మొదలే అగ్గిలో గుగ్గిలంలాగా వున్న సీమ ప్రజలకు పుండుపై కారం రాశారు.

పట్టి సీమతో కృష్ణా డెల్టాకు నీటి మళ్లింపు వలన ఆ మేరకు శ్రీ శైలం నుండి రాయలసీమకు నీటి మళ్ళింపు వీలైనది. అని ఈ శ్వేత పత్రం లో చెప్పారు.  శ్వేత పత్రంలో ఇంత పచ్చి అబద్ధం ఏలా చెబుతారు? అందుకే సీమ నేతలే సీమ కు శత్రువులు గా వున్నారు. ముఖ్యమంత్రి రాజకీయ అవసరం కొద్దీ ఎన్ని మాటలు అయనా మాట్లాడ వచ్చు. కాని సీమలో ప్రజల మధ్య తిరగవలసిన సీమ టిడిపి నేతలు కూడా నోరు ఎందుకు మెదపడం లేదు? శ్వేత పత్రం వివరణ ప్రకారం పోతు రెడ్డి పాడు రెగులేటర్ ద్వారా ఈ యేడాది 115 టియంసిలు జలాలు తరలించినట్లు చెప్పారు. అయితే ఇందులో నుండి నెల్లూరు జిల్లా అవసరాలకు సోమశిల కు 50 టియంసిలు జలాలు తరలించారు.

వాస్తవంగా సీమ కు పోతు రెడ్డి పాడు రెగులేటర్ ద్వారా కేవలం 65 టియంసిలు నీరు మాత్రమే ఇచ్చారు. ఇందులో ఆవిరి పారుదల నష్టం పది శాతం పోగా మిగిలింది-కేవలం 55 టియంసిలు మాత్రమే. అంతేకాదు. శ్రీ శైలం కుడి కాలువకు 19 టియంసిలు కెసికెనాల్ కు 10 టియంసిలు నికర జలాలు ఇవ్వాలి. అంటే సీమ కు వరద జలాలు అనండి లేదా మిగులు జలాలు అనండి లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నటు పట్టి సీమ జలాలు అయినా పోతు రెడ్డి పాడు రెగులేటర్ ద్వారా పాతిక టియంసిలు కు మించి ఇవ్వ లేదు. అయినా ప్రభుత్వం గొబెల్స్ ప్రచారం ముమ్మరం చేస్తోంది.

పోతు రెడ్డిపాడు రెగులేటర్ 44 వేల క్యూసెక్కుల నీరు విడుదల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టినా కాంగ్రెస్ కాలం పక్కన పెడితే ఈ నాలుగేళ్లుగా టిడిపి ప్రభుత్వం కూడా ఏ మాత్రం శ్రద్ధ చూపనందున ఈ ఏడు శ్రీ శైలం కు వరద వచ్చినా కేవలం 24 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే తరలించారు. పూర్తి సామర్థ్యం తో నీరు తరలించి వుంటే ఈ దుస్థితి ఏర్పడేదికాదు? ఇందుకు టిడిపి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఆగష్టు 16 వతేదీ నుండి నీరు వదిలినా 115 టియంసిలు రాగా అందులో 50 టియంసిలు నెల్లూరు కు తరలించారు. వాస్తవాలు దుమ్ములో కలిపి పచ్చి అబద్ధాలతో శ్వేత పత్రం విడుదల చేసి సీమ ప్రజలకు పుండుపై కారం రాయడం తగునా? గోర కళ్లు లో నింపిన 8 టియంసిలు అవుకు లో నింపిన 3.5 టియంసిలు శ్రీ శైలం కుడి కాలువ కింద రావలసిన చట్ట బద్ద హక్కులు గల నికర జలాలు గాని బిచ్చగా వచ్చిన నీరుకాదు.

హంద్రీనీవా ముచ్చుమర్రి రెండు పథకాల ద్వారా 31 టియంసిలు ఇచ్చినట్టు చెప్పు కొచ్చారు. మల్యాల నుండి జీడి పల్లి రిజర్వాయర్ వరకు 216 కిలోమీటర్ల కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి వుంటే 12 పంపులు పని చేసి వుంటే ఈ పాటికే 40 టియంసిలు తరలించి వుండ వచ్చు. ఈ బాధ్యత రాహిత్యం ప్రభుత్వానిది కాదా?

డిసెంబర్ 25 వతేది శ్రీ శైలం నీటి మట్టం 841.80 అడుగులు వుంటే 28 తేదికి 840 అడుగులకు పడిపోయింది. రోజు రోజుకు నీటి మట్టం పడి పోతుంటే హంద్రీనీవా ద్వారానే కాదు. ముచ్చు మర్రి ద్వారా కూడా ఈ వేసవిలో సీమ కు కృష్ణ జలాలు అందే మార్గం లేదు.                                                                                                                    –  వి. శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*