సీమ ఉద్యమకారులూ జర జాగ్రత్త..!

ఏ ఉద్యమానికైనా దీర్ఘకాలిక లక్ష్యాలు తాత్కాలిక కర్తవ్యాలు రెండు రకాల ఆశయాలుంటాయి. ప్రభుత్వానికి చెంది ఇదే సూత్రం అన్వయింప బడుతుంది. కాని రాయలసీమ విషయంలో ఈ సూత్రం ఇద్దరి అంశంలోనూ రివర్స లో వుంది. గత కొన్నేళ్లుగా సీమ ఉద్యమకారులు తరతరాలుగా సీమకు జరిగిన అన్యాయం పై గళమెత్తి పోరాటాలు సాగిస్తున్నారు. తుంగభద్ర ఎగువ కాలువకు సమానాంతర కాలువ తవ్వాలని, వేదవతి పై నాలుగు టిఎంసిల సామర్థ్యంతో రెండు పథకాలు అమలు చేయాలని, ఆర్డీయస్ కుడి కాలువ నిర్మాణం చేపట్టాలని, కెసి కెనాల్ కు అవసరమైన గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని, కృష్ణ నదిపై అలుగు నిర్మించాలని, వీటన్నింటి మించి సీమకు నికర జలాలు కేటాయించాలని వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. కాని తక్షణ కర్తవ్యాల అంశంలో అంతగా శ్రద్ధ చూపడం లేదని పిస్తోంది. పోనీ కొత్తగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైసిపి ప్రభుత్వం కూడా గోదావరి కృష్ణ నదులు అను సంధానం లాంటి దీర్ఘకాలిక పథకాలపై చూపుతున్న శ్రద్ధ తక్షణ కర్తవ్యాలపై కన్పర్చడం లేదు. గత ఏడాది కన్నా మెరుగ్గా సీమకు సాగు నీరు అందించాలనే భావన కనిపించడం లేదు.

ఓ మోస్తరుగా నైనా చర్యలు చేపడితే గత సంవత్సరం కంటే ఎక్కువగా సాగు నీరు అందించే అవకాశం వున్నా ఆ దిశగా చర్యలు లేవు. అధికారం చేపట్టి నెల రోజులే అయినా ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి పై విచారణ పెద్ద పెద్ద పథకాల గురించి తప్ప వున్నంతలో మెరుగ్గా నీటి సరఫరాకు అను గుణంగా ఎట్టి చర్యలు లేవు.

సీమకు సాగు నీరు అందించే వనరులు మూడు. 1)తుంగభద్ర రిజర్వాయర్. దాని నుండి ఆశించిన మేర నీరు రావడం లేదు. గత ఏడాది దిగువ కాలువ కు మన కోటా ప్రకారం 29.50 టియంసిల రావలసి వుండగా రిజర్వాయర్ పూడి పోయిందని 17.10 టియంసిల విడుదల చేస్తే కేవలం 10 టియంసిల మన సరిహద్దుల వద్ద చేరాయి. కర్నాటక ప్రభుత్వం తుంగభద్ర రిజర్వాయర్ పూడి పోయిందని ఎగువ భాగంలో 50 టియంసిలు ఉపయోగించు విధంగా మరో రిజర్వాయర్ వరద కాలువ నిర్మాణానికి సిద్ధం అవుతోంది. ఇదే జరిగితే సీమ ఎడారికాక తప్పదు. ఈ అంశంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఏ మాత్రం స్పందించడం లేదు. సీమ ఉద్యమకారులు ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి అనుసంధానం పైన చూపెడు తున్న శ్రద్ధ మెడ మీద కత్తి లాగా వున్న ఈ అంశం పట్టించుకోవడం లేదు.

2)గత నీటి సంవత్సరం పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 116 టియంసిల నీరు విడుదల చేశారు. ఆగస్టు 15 నాటికి కృష్ణకు వరద వస్తే 16 వ తేదీ నుండి నీరు వదిలారు. వాస్తవంలో హెడ్ రేగులేటర్ 44 వేల క్యూసెక్కుల విడుదల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టినా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసే విధంగా లేదు. దీనికి తోడు శ్రీ శైలం కుడి ప్రధాన కాలువ విస్తరణ పనులు పూర్తి కాలేదు. ఫలితంగా గత ఏడాది శ్రీ శైలంలో నీళ్లు వున్నా 24 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేశారు. ఫలితంగా ఆశించిన మేరకు నీరు ఇవ్వలేక పోయారు. దీనికి తోడు సీమలో నిర్మాణంలో వున్న రిజర్వాయర్ లు పూర్తి స్థాయిలో నీరు నింపే విధంగా లేవు. గత ఏడాది గోరకల్లు రిజర్వాయర్ లో రైతులు బలవంతం మీద కాస్తా ఎక్కువగా నీరు నింపితే సీపేజ్ మొదలైంది. ఇక నెల నెలన్నర రోజుల్లో కృష్ణ కు వరద వస్తే పోతురెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గత సంవత్సరం కంటే ఎక్కువగా నీరు ఇచ్చే అవకాశం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం సీమ యెడల సీతకన్ను చూపిన ఫలితంగా దాని ఫలితం అనుభవిస్తోంది. పైగా మరో ముఖ్య మైన అంశం అందరి మనసులను తొలుస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఎపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగించిన చర్చల్లోనూ రాష్ట్ర స్థాయిలో అధికారులతో జరిగే చర్చల్లో పోతురెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నీటి నిల్వ కనీస మట్టం 854 అడుగులుగా వుండాలని సీమ వాసులు కోరే కోర్కెపై ఎట్టి స్పష్టత లేదు. కనీసం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ వైఖరి వెల్లడి కాలేదు.

ప్రస్తుతం ప్రభుత్వం అధికారం చేపట్టి మాసం రోజులే అయినా సాగు నీటి రంగంలో తక్షణ కర్తవ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. భారీ పథకాలపై చర్చలు సాగుతున్నాయి. కాని 52 శాసన సభా స్థానాలకు 49 స్థానాలు గెలిపించిన సీమ సాగు నీటి తక్షణ అంశాలు పట్టించు కోక పోవడం గమనార్హం. గత ఏడాది కన్నా అధికంగాహెడ్ రెగ్యులేటర్ నుండి నీరు వచ్చే విధంగా అధికారంలోని కొచ్చి నెల రోజుల అయినా ప్రభుత్వం పట్టించు కున్నపుడే సీమ ప్రజల రుణం తీర్చు కున్న ట్లు అవుతుంది. ఈ అంశంలో సీమ వైసిపి నేతలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసు కెల్ల లేదు.

3)మరో పథకం హంద్రీనీవా ప్రాజెక్టు. మల్యాల నుండి జీడి పల్లి రిజర్వాయర్ వరకు గల 216 కిలోమీటర్ల ప్రధాన కాలువ 3820 క్యూసెక్కుల నీరు ప్రవహించే విధంగానే నిర్మాణం జరిగినా రెండు వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లనందున గతంలోనే 1200 కోట్ల రూపాయలతో విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఎక్కడ పనులు అక్కడే ఆగి పోయాయి. కొత్త గా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని మొత్తం ప్రాజెక్టుల పనులు ఆపేశారు. అంతే కాదు. ఇది వరలో ఎన్నికల ప్రకటన రాగానే దాదాపు అన్ని పథకాలు నిర్మాణం నిలిచి పోయాయి. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ పేరుతో అదే కొస సాగు తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి పై విచారణ జరగ వలసినదే. దాని పేరుతో గొంతెండి పోతున్న రాయలసీమలో కృష్ణ కు వరద వచ్చే లోపు మరమ్మతులు కోసం ఎదురు చూస్తున్న పథకాలను పట్టించు కోక పోవడం సీమ నుండే ముఖ్యమంత్రిగా వెళ్లిన జగన్మోహన్ రెడ్డి వాస్తవంలో అన్యాయం చేసిన వారౌతారు.
ఈ అంశంలో సీమ ఉద్యమ కారులు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు రావలసి వుంది.

విచారణల పేరుతో మరో నెలన్నర గడిస్తే ఒకవేళ కృష్ణకు ఈ ఏడు భారీ వరద వచ్చినా గత సంవత్సరం కంటే ఎక్కువగా నీరు అందే అవకాశాలు ఏ మాత్రం లేవు.

– వి. శంకరయ్య, విశ్రాంతి పాత్రికేయులు 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*