సీమ ఎంఎల్ఏలూ మేల్కొనండి…నీళ్లు తెచ్చుకోండి..!

  • పోతురెడ్డిపాడు నుండి 5 వేల క్యూసెక్కులేనా? ఎక్కడికి చాలుతాయి?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది నానుడి. పుణ్యకాలం గడచిపోయిన తర్వాత వగచి ప్రయోజనం లేదు. కేంద్రం జలసంఘం అంచనా మేరకు శ్రీ శైలం కు భారీ వరద రానున్నది. పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో జలాశయం నిండి పోవచ్చని భావిస్తున్నారు. 7వ తేది ఉదయానికి
29,3802 క్యూసెక్కుల నీరు జలాశయం చేరుతుండగా 82,857 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇందులో పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 5 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేస్తున్నారు. అంటే అర్ధ టియంసిల నీరు వస్తోంది. అదే విధంగా హంద్రీనీవాకు 1,013 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ 4,2378 క్యూసెక్కుల నీరు కిందకు విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేస్తున్నది. ఎపి ప్రభుత్వం కూడా 32,444 క్యూసెక్కుల నీరు కిందకు విడుదలచేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. గొంతెండిపోతున్న సీమకు కేవలం 5 వేల క్యూసెక్కులు అంటే అర్ధ టియంసి కూడా విడుదల చేయక పోవడం గమనార్హం.

గత సంవత్సరం పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 24 వేల క్యూసెక్కులు విడుదల చేస్తే మొత్తం 112 టియంసిలు మాత్రమే నీటి సంవత్సరంలో ఇచ్చారు. మరి జలాశయంలో నీరు పుష్కలంగా వున్న ఈ సమయంలో తొలుతనే 5 వేల క్యూసెక్కులే విడుదల చేస్తే మున్ముందు పరిస్థితులు ఏలా వుంటాయో? సీమ శాసనసభ్యులు గేట్లు ఎత్తించడం వరకే పరిమితం కాకుండా కనీసం‌రోజుకు రెండు టిఎంసిల నీరు అంటే 25 క్యూసెక్కులు విడుదల చేసేలా కృషి చేయవలసివుంది. ఇటీవల ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో గండికోటలో ఈ ఏడు 20 టియంసిల నీరు నిల్వ చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా శ్రీ శైలంలో కుడికాలువ (నికర జలాలు 19 టియంసిల కేటాయింపులు వుంది) భాగమైన గోరకల్లులో కనీసం 10 టియంసిలు, అవుకులో కనీసం 4 టియంసిల నీరు నిల్వ చేయమని రైతులు డిమాండ్ చేయవచ్చు. ఈ అంశంపై గత ఏడాది రైతులు పెద్ద ఆందోళన చేశారు. ఇది కాకుండా తెలుగుగంగకు కనీసం 25 టియంసిలు, కెసి కెనాల్ కు చట్టబద్దంగా 10 టియంసిలు-ఇవి కాకుండా సోమశిల వుండనే వుంది. గత ఏడాది సోమశిలకు 50 టియంసిలు ఇచ్చారు. ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రి నెల్లూరు జిల్లా నుండి వున్నారు. గత ఏడాది కన్నా తగ్గితే తీవ్ర ఇబ్బందులు ఎదురౌతాయి. ఒక వేళ ఇస్తే గిస్తే చెన్నయ్ కి 15 టియంసిలు ఇవ్వాలి. ఇదంతా కాకుండా తెలుగుగంగ కాలువ ద్వారా చిత్తూరు జిల్లా అవసరాలు తీర్చడమే కాకుండా పుణ్య క్షేత్రం తిరుపతి తాగునీటి అవసరాలు తీర్చాలి.

ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే ఈ ఏడాది రెగ్యులేటర్ నుండి కనీసం 120 నుండి 150 టియంసిలు విడుదల చేస్తేనే గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా పని చేశామని సీమ వాసులను మెప్పించ వచ్చు. జలాశయంలో పుష్కలంగా నీరు వుండి పై నుండి వరద వస్తుందని భావించే సమయంలో గత ఏడాది లాగానైనా 25 వేల క్యూసెక్కుల నీరు ఇప్పటి నుండి విడుదల కాకపోతే మున్ముందు కనీస అవసరాలు తీర్చడం సాధ్యం కాదు.

గత ఏడాది హంద్రీ నీవా తొలి నుండి 2,320 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రస్తుతం1,013 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేస్తున్నారు . గత ఏడాది ఏడు పంపులు పని చేశాయి. ప్రస్తుతం రెండు పంపులతో పని ప్రారంభించారు.12 పంపులు పనిచేసే విధంగా ఈ పథకం వుంది. మున్ముందు ఈ ఏడు ఎన్ని పంపులు పని చేస్తాయో తెలియదు. పైగా మల్యాల నుండి జీడిపల్లి వరకు గల ప్రధాన కాలువ ఎంత వరకు విస్తరణ జరిగిందో తెలియదు. కనీసం 3 వేల క్యూసెక్కులు నైనా తరలించక పోతే కర్నూలు, అనంతపురం జిల్లాల అవసరాలు తీర్చి…చిత్తూరు జిల్లాకు ఒకటి రెండు టిఎంసిలు అయినా ఇవ్వలేరు. సీమ శాసనసభ్యులు గాని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుండే యుద్ధ ప్రాతిపదికన చక చక కదిలితేనే కొంత మేరకైనా సీమ అవసరాలు తీర్చ గలరు.

  • వి.శంకరయ్య 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*