సీమ కంటిని సీమ వేలుతోనే పొడిచే సాహసం…!

ఒక్క రాష్ట్రం – ఒకటే రాజధాని పేరుతో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఉద్యమం అనేక చర్చలకు తావిస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనను తెలుగుదశం పార్టీ ప్రత్యక్షంగా నడిపిస్తోంది. ఈ ఉద్యమానికి మద్దుతు, నిధులు కూడగట్టేందుకు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకుని బయలుదేరారు. ముందుగా విజయవాడతో మొదలై, మచిలీపట్నం, రాజమండ్రిల్లో పర్యటించిన తరువాత తిరుపతికి వచ్చారు. అనంతపురం జిల్లాకూ వెళుతానని ప్రకటించారు.

చంద్రబాబు నాయుడు తీరు రాయలసీమ వాసులకు ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయి. ఎందుకంటే….ఆయన సీమవాసి అయినా సీమ ప్రజల కంటిని సీమ ప్రజల వేళ్లతోనే పొడవాలని చూస్తున్నారు. ఇది ఒకవిధంగా ఆయన చేస్తున్న దుస్సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే….ఇక్కడ కాస్త వివరంగా చెప్పుకోవాలి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయినపుడు కర్నూలులో రాజధాని ఏర్పాటయింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి, హైదరాబాద్‌ను ఏర్పాటు చేసుకోవడంతో రాజధాని రాయలసీమ నుంచి తరలిపోయింది. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాజధాని లేదా హైకోర్టు రాయలసీమ ప్రజల హక్కుగా ఉంది.

తెలంగాణ విడిపోయిన తరువాత, ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రం రూపురేఖల్లోకి నవ్యాంధ్రప్రదేశ్‌ వచ్చిన తరువాత మళ్లీ రాజధాని చర్చకు వచ్చింది. సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఇక్కడివారు కోరారు. అయితే….నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఎవరితోనూ చర్చించకుండా విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా ప్రకటించారు. కనీసం తమకు హైకోర్టు అయినా ఇవ్వాలని సీమవాసులు అనేక పర్యాయాలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. ఆయన ఖాతరు చేయలేదు. అసెంబ్లీ, సచివాలం, న్యాయవ్యవస్థ అన్నీ అమరావతిలోనే ఉంటాయని, అమరావతిలోనే నవ నగరాలు నిర్మిస్తామని తేగేసి చెప్పాశారు. అయినా చూస్తూవుండటం తప్ప సీమ ప్రజలు ఏమీ చేయలేకపోయారు.

ఈక్రమంలో….తెలుగుదేశం అధికారం కోల్పోయి వైసిపి అధికార పగ్గాలు చేపట్టింది. కారణాలు ఏవైనా….జగన్‌ మోహన్‌ రెడ్డి రాజధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలనను వికేంద్రీకరిస్తామంటూ మూడు రాజధానుల ఆలోచను బయటపెట్టారు. ఇందులో భాగంగా రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఒక విధంగా ఇది రాయలసీమ ప్రజలు ఊహించనిదనే అనుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు హైకోర్టు కోసం పోరాడినా ఫలితం లేకపోయింది. అటువంటిది ఎవరూ అడగక ముందే…కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తానని ప్రభుత్వం ప్రకటించడంతో ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా…రాజధాని అమరావతిలోనే ఉండాలన్న విధానాన్ని తీసుకున్న తెలుగుదేశం పార్టీ….ఆఖరికి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని కూడా వ్యతిరేకిస్తోంది. ఒక రాష్ట్రం – ఒకటే రాజధాని అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళుతూ…హైకోర్టునూ కూడా దక్కకుండా చేయడానికి ప్రయత్నిస్తోంది. అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుతున్న కాంగ్రెస్‌, సిపిఎం, బిజెపి వంటి పార్టీలు కూడా హైకోర్టు కర్నూలులో ఉన్నా ఫర్వాలేదుని చెప్పాయి. చంద్రబాబు నాయుడు మాత్రం హైకోర్టు కూడా అమరావతిలోనే ఉండాలని చెబుతున్నారు.

ఒకరాష్ట్రం – ఒక్కటే రాజధాని నినాదాన్ని సీమ ప్రజలకూ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టు వల్ల నాలుగు జిరాక్సు మిషన్లు తప్ప ఇంకేమీ రావని ముందుగా ప్రచారం మొదలుపెట్టి….సీమకు హైకోర్టు కూడా లేకున్నా ఫర్వాలేదు అని సీమ ప్రజలతోనే చెప్పించేందుకు కుతంత్రాలు చేస్తున్నారు. చంద్రబాబు నినాదంలోని మర్మాన్ని గమనించలేని సీమవాసులు (టిడిపి అనుకూలురైనా…) అందుకు జే కొడుతున్నారు.

తెలుగుదేశం వ్యవహారం చూస్తుంటే….సీమలో హైకోర్టు ఏర్పాటయితే ఆ ఖ్యాతి జగన్‌కు వస్తుందన్న భావన ఉన్నట్లుంది. అందుకే హైకోర్టు సీమలో ఉండటాన్ని అందరూ సమర్ధిస్తున్నా తెలుగుదేశం మాత్రం వ్యతిరేకిస్తోంది. రాజధాని కోసం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఎన్ని ఉద్యమాలైనా చేసుకోవచ్చు…అయితే, సీమకు హక్కుగా ఉన్న హైకోర్టును కూడా ఇక్కడ ఏర్పాటు కాకుండా అడ్డుకోవాలనుకుంటే ఆ పార్టీ భవిష్యత్తులో భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. సీమ కంటిని సీమ వేలితోనే చిదిమేయాలన్న ఆలోచనను ఇప్పటికైనా బాబు మార్చుకోవాలి.

ఆదిమూలం శేఖర్‌, సంపాదకలు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*