సీమ గుండెల్లో గున‌పం…మన్నవరం ఆశలు గల్లంతు…ఈ పాపం ఎవరిది?

రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు ఆశా కిరణంలా కనిపించిన మన్నవరం పరిశ్రమ పూర్తిగా మూతపడనుంది. ఇప్పటికే 50 మంది లోపు ఉద్యోగులతో సాగుతున్న పరిశ్రమకు క్రమంగా తాళాలు పడనున్నాయి.

రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు…అప్పటి ప్రధాన మంత్రి నన్మోహన్‌ సింగ్‌ రెండు ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో మన్నవరంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఎన్‌టిపిసి, బిహెచ్‌ఈఎల్‌ ఆధ్వర్యంలో 10 వేల కోట్లతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ ద్వారా ఏడు వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. వైఎస్‌ మరణానంతరం రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి ఏర్పడటం, కేంద్రం పట్టించుకోకపోవడం, రాష్ట్రం విడిపోవడం, ఇంతలో కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం…తదితర పరిణామాల నేపథ్యంలో మన్నవరం ఊసేలేకుండాపోయింది. ఏవేవో సాకులు చూపి, మన్నవరం పరిశ్రమను గుజరాత్‌కు మోడీ ప్రభుత్వం తరలించింది.

మన్నవరంలో 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాల్సివుండగా….వంద కోట్ల పెట్టుబడికి పరిమితమై..చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు పూర్తిగా ఫ్యాక్టరీ మూసేయాలని నిర్ణయించారు. పార్లమెంటులో కెవిపి రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇస్తూ….మన్నవరం పరిశ్రమను కొనసాగించడానికి అటు బిహెచ్‌ఇఎల్‌గానీ, ఇటు ఎన్‌టిపిసిగానీ ఆసక్తి చూపడం లేదని, ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగాలని ఆ రెండు సంస్థలూ నిర్ణయించుకున్నట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ వెల్లడించారు.

రాయలసీమ ప్రజల ఆశలు అడియాశలవడానికి కేంద్రంలోని బిజెపితో పాటు రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్న టిడిపి కూడా ప్రధాన కారణంగా చెప్పాలి. నాలుగేళ్లపాటు కేంద్రంలో బిజెపితో అధికారం పంచుకున్న టిడిపి మన్నవరం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారం చేపట్టిన వెంటనే తొలి ప్రాధాన్యత మన్నవరానికి ఇచ్చివుంటే…ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించేది కాదు. అది వైఎస్‌ చొరవతో వచ్చిన పరిశ్రమ అవడంతో….అది పూర్తయితే వైసిపికి మంచి పేరు వస్తుందన్న రాజకీయ దురుద్దేశంతో టిడిపి ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టిడిపి మంత్రులుగానీ, నేతలుగానీ ఏనాడూ మన్నవరం గురించి మాట్లాడిన పాపానపోలేదు.

రాజకీయ కారణాలతో బిజెపితో తెగదెంపులు చేసుకున్న తరువాత కూడా ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌ గురించి మాట్లాడినంతగా మన్నవరం పరిశ్రమ గురించి మాట్లాడటం లేదు. అసలు రాయలసీమ గురించి కేంద్ర ప్రభుత్వానికి కాదు…రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వానికీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పడానికి మన్నవరం పరిశ్రమే పెద్ద తార్కాణం. మన్నవరం పరిశ్రమ కోసం రాయలసీమలోని టిడిపి నేతలు ఇప్పటిదాకా చిన్నపాటి ఆందోళనైనా చేశారా? కమ్యూనిస్టులు, సీమ ఉద్యమకారులు తప్ప మన్నవరం గురించి మాట్లాడినవారు లేరు. ఎవరూ అడగడం లేదన్న ధైర్యంతో కేంద్రం ఈ పరిశ్రమకు పూర్తిగా పంగనామాలు పెట్టింది.

ఇప్పటికైనా రాయలసీమలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మన్నవరంపై గళం విప్పాల్సిన అవసరం ఉంది. కడప ఉక్కుకంటే ముందుగా దీన్ని సాధించుకోవాల్సిన ఆవశ్యత కనిపిస్తోంది. మన్నవరం కేంద్రంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అనివార్యత కనిపిస్తోంది. అధికారంలో ఉన్న టిడిపినే ఇందుకు చొరవ తీసుకోవాలి. లేకుంటే సీమ ద్రోహులుగా మిగిలిపోతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*