సుప్రీంపై కాంగ్రెస్‌కు కోపం తగ్గినట్లేనా?

ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ పార్టీ సుప్రీం కోర్టుపై తీవ్రమైన కోపంతో ఉంది. అందుకే ఆ మధ్య ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన కూడా ప్రయత్నించింది. ఉపరాష్ట్రపతి నిరాకరించడంతో ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సందర్బంలో కాంగ్రెస్‌ పార్టీ న్యాయ వ్యవస్థపైన అసహనం వ్యక్తం చేసింది. అయితే…కర్నాటక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సుప్రీం కోర్టు ద్వారానే పరువునిలబెట్టుకుంది. కర్నాకటలో బిజెపికి 104 స్థానాలు వచ్చి ఏకైన పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కాంగ్రెస్‌కు 78, జెడిఎస్‌కు 38 స్థానాలు మాత్రమే వచ్చాయి. బిజెపిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోనీకుండా అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌ కీలకమైన నిర్ణయం తీసుకుంది. జెడిఎస్‌కు బేషరతుగా మద్దతు ఇస్తానని ప్రకటించింది. దీంతో జెడిఎస్‌, కాంగ్రెస్‌ కూటమి బలం 116కు పెరిగింది. అయినా ఈ కూటమికి గవర్నర్‌ అవకాశం ఇవ్వలేదు. బిజెపికే అవకాశం ఇచ్చారు. యడ్యూరప్పతో ఆగమేఘాలపై ప్రమాణ స్వీకారం చేయించారు.

దీన్నింతా చూస్తూ చేతులు ముడుచుకోని కూర్చోకుండా వేగంగా వ్యూహం రచించి అమలు చేసింది కాంగ్రెస్‌. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించడం, అదీ అర్ధరాత్రి వెళ్లి ప్రధాన న్యాయమూర్తి ఇంటి తలుపులు తట్టడం గమనార్హం. కాంగ్రెస్‌ పిటిషన్‌పై తెల్లవారి 5 గంటల దాకా చర్చించిన ధర్మాసనం….యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఎలాంటి కీలక నిర్ణయాలు చేయకూడదని ఆదేశించింది. అదేవిధంగా గవర్నర్‌ అవకాశం ఇచ్చినట్లు 15 రోజులు కాకుండా 24 గంటల్లో బల నిరూపణ చేసుకోవాలని యడ్యూరప్పను ఆదేశించింది. అదే 15 గడువు ఉండివుంటే బిజెపి ప్రలోభాల నుంచి తమ సభ్యులను కాపాడుకోవడం అసాధ్యమయ్యేది. సుప్రీం ఇచ్చిన ఈ తీర్పు కాంగ్రెస్‌కు కొండంత బలాన్ని ఇచ్చింది. ఇక ప్రోటెం స్పీకర్‌ వ్యవహారంలోనూ సుప్రీం నుంచి అద్భుతమైన ఉత్తర్వులు అందాయి. ప్రోటెం స్పీకర్‌గా యడ్యూరప్ప తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని నియమించున్నా….ఆయన ఎలాంటి అవక్రమాలకూ పాల్పడలేనంతగా బిగించింది న్యాయస్థానం. సభలో జరిగే వ్యవహారం మొత్తం టివి ఛానళ్ల ద్వారా లైవ్‌ ఇవ్వాలని ఆదేశించడం అత్యంత కీలకమైనది. ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారం లేకుంటే…సభ లోపల బిజెపి సభ్యులు అలజడి సృష్టించి, బల నిరూపణను గందరగోళం చేసి, ఏకపక్షంగా చేసుకోవడమో, వాయిదా వేయడమో చేసేవాళ్లు. దేశం మొత్తం టివిల్లో చూస్తుండటంతో బిజెపి ఏమీ చేయలేకపోయింది. ఓటింగ్‌కు మునుపు ఓటమిని అంగీకరించి యడ్యూరప్ప రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ – జెడిఎస్‌ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయింది.

ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీం కోర్టు ప్రమేయం లేకుండా…ఈ రోజు ప్రజాస్వామ్యం ఈ విధంగా నిలబడేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సుప్రీం కోర్టు దేశంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించిందంటూ జనం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కర్నాటక వ్యవహారంలో సుప్రీం జోక్యం చేసుకునేలా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం రచించడంపై ఆ పార్టీపైనా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా కాంగ్రెస్‌ పార్టీకి ఇదో గొప్ప విజయం. ఇది ఊరకే సొంతం కాలేదు. తాను ఏ కోర్టుపైనైతే ఆగ్రహంతో ఉందో ఆ కోర్టు సహకారంతోనే సాధ్యమయింది. దీంతో కాంగ్రెస్‌కు సుప్రీంపై ఉన్న కోపమంతా తగ్గిపోయివుంటుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*