సుప్రీం దేవునికి వివాదానికి సుప్రీం ప‌రిష్కారమే!

తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై సిబిఐ విచారణ కోసం సుప్రీం కోర్టుకు వెళతానని బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి చెబుతున్నారు. గతంలో ‘అనంత స్వర్ణమయం’ పేరుతో పురాతనమైన శ్రీవారి ఆలయ గోడలకు బంగారు రేకులు అమర్చాలని అప్పటి ఛైర్మన్‌ ఆదికేశవులు నాయుడు ప్రయత్నిస్తే….సుబ్రమణ్యస్వామి సుప్రీంలో కేసువేశారు. కోర్టు తీర్పుతో ఆ ప్రయత్నాలకు బ్రేకులుపడ్డాయి. దీన్ని గుర్తు చేస్తూ…ప్రస్తుతం వేయబోయే కేసులూనే విజయం సాధిస్తానని ఆయన చెబుతున్నారు.

ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాగుతున్న తిరుమల వివాదానికి తెర వేయగలిగేది సుప్రీం కోర్టు మాత్రమే. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కోర్టు జోక్యం అనివార్యం అనిపిస్తోంది. తిరుమల ఆలయ ఆచార వ్యవహారాలు, శ్రీవారి ఆభరణాలకు సంబంధించిన అంశంగా కనిపిస్తున్నా…ఇది పూర్తిగా రాజకీయ వివాదంగా మారిపోయింది. అధికార తెలుగుదేశం పార్టీ బిజెపి, వైసిపిలను విమర్శిస్తుంటే…ఈ రెండు పార్టీలూ టిడిపిపై విరుచుకుపుడుతున్నాయి. దేవుడితో రాజకీయాలు చేస్తున్నారని టిడిపి అంటుంటే….దేవుడి నగలను చంద్రబాబు ఇంటికి తరలించారని వైసిపి ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఒక కమిటీ వేసి విచారణ జరిపించినా నమ్మే పరిస్థితి బిజెపి, వైసిపిల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం విచారణ కమిటీని నియమిస్తూ…కక్ష సాధింపు అని టిడిపి గగ్గోలుపెడుతుంది. ఈ పరిస్థితుల్లో దీనికి పరిష్కారం చూపగలిగేది సుప్రీం కోర్టు మాత్రమే.

రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయని సుప్రీం కోర్టు భావిస్తే….విచారణ కోసం సిబిఐనో, ఇంకో సంస్థనో నియమించే అవకాశాలున్నాయి. ప్రాథమికంగానే ఆధారణాలు లేవనుకుంటే, ఆరోపణల్లో పస లేదని భావిసే విచారణకు నిరాకరించవచ్చు. ఏది జరిగినా తిరుమల వివాదానికి ఎంతోకొంత పరిష్కారం లభిస్తుంది. విచారణ జరిగితే…ఏదో ఒకటి తేలేదాకా రమణ దీక్షితులు ఏమీ మాట్లాడే అవకాశం ఉండదు. అసలు విచారణే అవసరం లేదని కోర్టు భావించినా….రమణ దీక్షితులు చేసే ఆరోపణలకు అసలు విలువ ఉండదు.

ఇందులో ఇంకో అంశానికి కూడా అవకాశం ఉంది. పోటులో తవ్వకాలు, ఆభరణాల మాయం వంటి అంశాలను పక్కనపెట్టినా….రమణ దీక్షితుల తొలగింపు వ్యవహారం వరకే పరిమితమైన కోర్టు విచారణ జరిపి, ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలూ లేకపోలేదు. ఎందుకంటే మిరాశీ రద్దు, వంశపారంపర్య అర్చకత్వం కొనసాగింపుపై గతంలోనే సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పుడు రమణ దీక్షితులు తొలగింపు దానికి లోపబడి ఉన్నదీ లేనిదీ కోర్టు పరిశీలిస్తుంది. దానికి విరుద్ధంగా ఉంటే కొనసాగించమని ఆదేశాలు ఇవ్వవచ్చు. లేదంటే టిటిడి నిర్ణయాని సమర్థింవచ్చు. సుప్రీం తీర్పు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఈ వివాదానికి తెరపడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*