సెంటి మెంట్ రాజకీయం బాబును బతికి బట్టకట్ట నిస్తుందా?

పోలింగ్ సమీపించే కొద్ది ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగాల తీరు తెన్నులు పూర్తిగా మార్చి వేస్తున్నారు. ఓటమి భయంతో ఏదేదో మాట్లాడుతున్నారు. తుదకు” సెంట్ మెంట్” అయినా తనను గెలుపు గుర్రాన్ని ఎక్కిస్తుందన్న భ్రమలోపడ్డారు. ఫలితంగా మెయిన్ విలన్ కెసిఆర్ ను చేస్తూ వైసిపికి ఓట్లు వేస్తే కెసిఆర్ రాజ్యం వస్తుందని, జగన్ సామంతరాజుగా మారి పోయి దాస్యం అనుభవించాలసి వస్తుందని సెంట్ మెంట్ పండించేందుకు నానా తంటాలు పడుతున్నారు. గత అయిదు ఏళ్ల టిడిపి పాలన గురించి ప్రజలు తర్జనభర్జన పడుతుంటే అందుకు సమాధానం చెప్పడం పక్కన బెట్టి ఊహాజనితమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇందుకు ముఖ్యమంత్రి చూపే కారణాలేమంటే తెలంగాణలో ఆస్తులు గల తమ పార్టీ నేతలను భయ పెట్టడం ఉదాహరణకు చూపెడు తున్నారు. ఇది ప్రజలకు సంబంధించిన అంశం కానే కాదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తే జాలి వేయక మానదు. ఎప్పటి కప్పుడు ఏది దొరికితే దానిని ప్రతి పక్షంపై విసురుతున్నారు. ఎందుకంటే ఇది వరలో తన పార్టీ నేతలపై సిబిఐ ఆదాయపు పన్ను అధికారులు దాడులు జరిగి నపుడు వైసిపికి ఓటు వేస్తే మోదీ కి వేసినట్లుగా ప్రసంగాలు సాగించారు. ఈ ధోరణి పెద్దగా పని చేయక పోయే సరికి ప్రస్తుతం కెసిఆర్ ను పట్టుకున్నారు. సిబిఐ అధికారులు టార్గెట్ చేసిన టిడిపి నేతలు పతివ్రతలు కాకపోవడం, అందరి ముడ్డి కింద బోలెడు కథ కమామీసు వుండటంతో కేంద్రంకు వ్యతిరేకంగా చేసిన ప్రసంగాలు బొత్తిగా పనిచేయ లేదు. ఇక గత్యంతరం లేక
ప్రస్తుతం కెసిఆర్ పైకి మళ్ళి సెంట్ మెంట్ రెచ్చగొట్టేందుకు సిద్ధ మైనారు.

మొన్నటి ఎన్నికల్లో సెంట్ మెంట్ రాజకీయాలు కెసిఆర్ కు తెలంగాణాలో ఉపయోగపడి వుండవచ్చు. గాని ఎపిలో ఎంత మాత్రం ఆ పప్పులు ఉడికే అవకాశం లేదు. తెలంగాణలో సుధీర్ఘ కాలం ఉద్యమం సాగినందున ఆంధ్రుల పెత్తనం ఒక ఆయుధంగా అచ్చట పని చేసింది. కానీ ఎపిలో ఆలాంటి భావజాలమే లేనప్పుడు ముఖ్యమంత్రి ఎంత అరచి ఘీ పెట్టినా పెద్దగా ఫలితం దక్కే అవకాశం వుండదు.

తెలంగాణలో తప్పుడు వ్యాపారాలు సాగించే టిడిపి నేతలు భయ పడి తోక ముడిస్తే దానిని బూత అద్దంలో చూపెట్టి లబ్ద పొందాలని చూడటం వెర్రి తనమే అవుతుంది- తప్ప వేరు కాదు. ఆ మాట కొస్తే ఈ అయిదు ఏళ్లు తెలంగాణలో టిడిపి పార్టీని కాపాడుకునేందుకు శ్రీ శైలం జలాశయం ఎగువ భాగంలో తెలంగాణ ప్రభుత్వం ఎట్టి అనుమతి లేకుండా పాలమూరు దిండి ఎత్తిపోతల పథకం 150 టియంసిలతో నిర్మించుతుంటే ఎపి ప్రభుత్వం కళ్లు అప్పగించి చూడటం రాయలసీమ ప్రజలు జీర్ణించుకోలేకునారు. అదే సమయంలో సీమకు ఉపయోగ పడే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ అనుమతి కావాలని ముఖ్యమంత్రి చెప్పడం సీమ ప్రజలు ఇంకా మరచిపోలేదు. వాస్తవం ఇదైతే వైసిపికి ఓట్లు వేసితే కెసిఆర్ నీళ్లు మళ్లించుతారని ముఖ్యమంత్రి ప్రసంగాలకు సీమ జిల్లాల్లో ఎటువంటి స్పందన వుండదు.

ముఖ్యమంత్రి ఈ ధోరణి చేపట్ట డానికి నేపథ్యంలేక పోలేదు. ఎవరైనా సరే ఎన్నికలు ఎదుర్కొంటున్న సమయంలో చేసిన వాగ్దానాలు
ఎంత వరకు అధికారంలో వున్న కాలంలో అమలు జరిగాయి? తిరిగి అధికారం ఇస్తే ఏమేమి చేస్తారు?
అనే అంశాలు ప్రధానంగా ప్రజలకు వివరించాలి.
పాదయాత్రలో గాని 2014 ఎన్నికల సందర్భంలో గాని చేసిన వాగ్దానాలు గాలికి పోయాయి. పసుపు కుంకుమ ఫించను తప్ప మరే పథకాలు పెద్దగా అమలు చేసిన సందర్భం లేదు. మిగిలిన పథకాలు నీరు చెట్టు లాంటివి అవినీతి వరదలో కొట్టుకు పోయాయి. పట్టిసీమ తప్ప రాయలసీమలోగాని ఉత్తరాంధ్ర జిల్లాలలో సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు. పోలవరం అమరావతి రాజధాని అర చేతిలో స్వర్గంగా మిగిలాయి.‌ ఇవన్నీ ప్రజలకు చెప్పి మెప్పించలేక అడ్డ దారిలో సెంట్ మెంట్ రాజకీయాలు సాగిస్తున్నారు.

వి.శంకరయ్య

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*