సోనూసూద్ ట్రాక్టర్ వివాదం…తప్పెవరిది..!

మదనపల్లి రైతు…సోనూసూద్ ట్రాక్టర్…ఊహించని మలుపులు…జర్నలిస్టు ఆదిమూలం శేఖర్ దృష్టి కోణం..!


మదనపల్లి సమీపంలోని కెవి పల్లెకు‌ చెందిన నాగేశ్వరరావు… తన భార్య, ఇద్దరు కుమార్తెల‌ సాయంతో నాగలి దున్నుతూ, వేరుశెనగ విత్తుతుండగా…ఆయన అల్లుడే వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అది వైరల్ అయింది. ఆ వీడియో చూసిన సినీ‌ నటుడు సోనూ సూద్…ఆ రైతును‌ ఆదుకునేందుకు ట్రాక్టర్ కొని పంపించారు.

సోనూసూద్ దాతృత్వాన్ని అందరూ అభినందించారు. ఇంతలోనే అసలు కథ మొదలయింది. రైతు నిజంగా ఎద్దుల మడకను కూలికి మాట్లాడుకుని సేద్యం చేయలేని దుస్థితిలో ఉన్నారా…అని ప్రభుత్వం ఆరా తీసింది.

సంబంధిత కుటుంబానికి రైతు భరోసా కింద రూ.20 వేలు, అమ్మ ఒడి కింద రూ.10 వేలు జమ చేసినట్లు తేలింది. ఈ నగదు‌ అందినట్లు నాగేశ్వరరావు కూడా ధ్రువీకరించారు.

ఈ ఉదంతం పై హిందూ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.‌ సదరు నాగేశ్వరరావు రైతు కాదని, ఆయన చాలా ఏళ్ల క్రితమే మదనపల్లిలో స్థిరపడ్డారని, పట్టణంలో టీ దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడని, ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్నాడని కథనంలో రాశారు.

కరోనా లాక్ డౌన్ వేళ స్వగ్రామంలోని‌ తల్లిదండ్రుల ఇంటికి వచ్చారని, ఆయన కూతుళ్లు ఇద్దరూ సరదాగా మడక లాగారని…నాగేశ్వరరావు చెప్పినట్లు ‌ఆ కథనంలో రాశారు. ఆయన గత ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ తరపున పోటీ చేసినట్లు కూడా వెల్లడయింది.

బిబిసి రాసిన ఓ కథనంలో…రైతు భరోసా నిధులు వచ్చిన మాట నిజమేగానీ, ఎంత వచ్చిందో తెలియదని, ఆ మొత్తం తన తండ్రి అకౌంట్ లో జమయిందని చెప్పారు. భూమి కూడా తనది కాదని, తన తండ్రిదని వివరించారు.

ఇక్కడ సోనూ సూద్ సహృదయాన్ని తప్పుపట్టలేం. నాగేశ్వరరావునూ విమర్శించలేం. సాయం చేయమని‌ ఆయన‌ అడగలేదు. తాను పేదరికంలో ఉన్నానని చెప్పుకోలేదు. ఆశించకుండా వచ్చిన ట్రాక్టర్ ను పంచాయతీకి ఇచ్చేస్తానని ఆయన చెప్పినట్లు వార్తలొచ్చాయి.

ఇక ప్రభుత్వం స్పందించిన తీరు కూడా సమంజసంగానే ఉంది. రైతు ఇబ్బంది పడకూడదని, పెట్టుబడికి ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇచ్చింది. అయినా…ఆడబిడ్డలను కాడికి కట్టి మడక దున్నే దృశ్యం కనిపించినపుడు…ప్రభుత్వం స్పందించడం సహజమే. ఆ రైతుకు ఎటువంటి సాయం అందిందో ప్రకటించడంలో తపఅసత్యాలతో,

సమస్యంతా ఎక్కడంటే…ఆడబిడ్డలు మడక దున్నుతున్న దృశ్యం కంటపడినపుడు…దాని వెనుక‌ ఉన్న కథను పూర్తిగా తెలుసుకోకపోవడం. ఆయన వ్యవసాయం చేయరని, మదనపల్లిలో టీ దుకాణం నడుపుతారని, పల్లెలో ఉన్న భూమికి రైతు భరోసా నిధులు వచ్చాయని, ఆ కుటుంబం కూలి మడకను పెట్టుకోలేనంత పేదరికంలో లేదని… తెలుసుకోకుండా, ఎక్కడో సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలను ప్రధాన స్రవంతి మీడియా వార్తలు ప్రసారం చేయడం…ఇదీ అసలు సమస్య.

అయితే… అన్ని విషయాలు బయటికొచ్చాక ఇప్పుడు కొత్త వాదనలు తెస్తున్నారు. ఆయనేమీ ధనిక రైతు కాదని, సోనూ సూద్ సాయం తీసుకోవడంలో తప్పులేదని అంటున్నారు. తప్పులేదుగానీ… సోనూసూద్ లక్ష్యం ఇటువంటి రైతులను ఆదుకోవడం కాదు. నిరుపేద రైతులను ఆదుకోవడం. ఆయన దాతృత్వాన్ని దుర్వినియోగం చేయకూడదు. మీడియా అత్యుత్సాహంతో, అసత్యాలతో, అర్థ సత్యాలతో కథనాలు వండి వార్చకూడదు. ఒక్కమాటలో చెప్పాలంటే…ఈ గందరగోళానికి పూర్తి బాధ్యత మీడియాదే.
– ఆదిమూలం శేఖర్, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*