స్థానిక పోరు…వైకాపా జోరు..!

  • గందరగోళంలో తెలుగు తమ్ముళ్లు
  • బిజెపి, జనసేన బలమెంత?

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

  స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో అన్ని స్థానాల్లో విజయం సాధించాలని  అధికార వైకాపా భావిస్తోంది. అయితే ప్రధాన ప్రతిపక్షం అయిన టిడిపి తెడ్డులేని నావలా ఉంది. పార్టీ ఇన్ ఛార్జ్ అందుబాటులో లేకపోవడం ఆపార్టీ నేతలను కలవరపెడుతోంది. మరోవైపు బిజెపి, జనసేన ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అయినా అధికార పార్టీని ఎంతవరకు ఎదుర్కొంటాయన్నది సందేహం. దీంతో స్థానిక ఎన్నికలు మున్సిపాలిటీలో మినహా ఏకపక్షమే అనే అభిప్రాయం వినపడుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్దే ప్రధాన ఎజెండాగా అధికార పార్టీ ముందు కెళుతోంది. ఇంటి వద్దకే ఫించన్లు, అమ్మ ఒడి , ఆసరా , సచివాలయాల ద్వారా ప్రజల ముందుకు పాలన, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలు అధికార పార్టీకి కలిసొచ్చే అంశంగా ఉంటోంది. మరోవైపు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆయన కుమార్తె పవిత్రారెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండటం కలిసొచ్చే అంశంగా ఉంటున్నాయి. నియోజకవర్గ పరిధిలో పల్లెపల్లెకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండటం, స్వర్ణముఖి సుందరీకరణ, రైతులకు సాగునీరు అందించడం వంటివి ఆ పార్టీకి అనుకూల అంశాలుగస ఉంటున్నాయి. మరోవైపు ఇతర పార్టీలు నుంచి బలమైన నేతలు వైకాపాలో చేరడంతో గెలుపుపై వైకాపా ధీమాగా ఉంటోంది. నియోజకవర్గ పరిధిలో అన్ని ఎంపిపి , జెడ్పీటీసీలతో పాటు మున్సిపాలిటీ లోనూ తిరుగులేని విజయం సాధించాలని భావిస్తోంది. ఇందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తున్నారు.

   గత అసెంబ్లీ ఎన్నికల వరకు కుప్పం తరువాత టీడీపీకి కంచుకోటగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉండేది. అయితే పరిస్థితి ప్రస్తుతం పూర్తి భిన్నంగా ఉంటోంది. పార్టీ ఇన్ ఛార్జ్ నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించడంతో నాయకులు, కార్యకర్తలు పరిస్థితి అయోమయంగా ఉంటోంది. గతంలో అన్నీతామై ముందుండి నడిపిన నేతలు నేడు మొఖం చాటేస్తున్నారు. కనీసం పార్టీ కార్యక్రమాలకూ సరిగా రాని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామాల్లో టిడిపికి కార్యకర్తలు ఉన్నా నేతలు మాత్రం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పట్టణంలో మాత్రం పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు నేతలు చురుగ్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఏమాత్రం పోటీ ఇస్తాదనేది వేచి చూడాల్సిందే.

  శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో టీడీపీ చతికిల పడటంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది బిజెపి పార్టీ అనే ప్రచారముంది. ఎంపిపి ,జెడ్పీటీసీ స్థానాలతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తుందని సమాచారం. అయితే పార్టీ ఇన్ ఛార్జ్ వ్యక్తి గత ఇమేజ్ తో పట్టణంలో కొంత బలమున్నా అది పార్టీ గెలుపు పై ఏమాత్రం ప్రభావం చూపుతుందనేది ప్రశ్న. ఇక పల్లెల్లో బిజెపి ప్రభావం పెద్దగా ఉండదనేది అంచనా. ఏదిఏమైనా స్థానిక పోరులో అధికార పార్టీ కి ఎంత వరకు అడ్డుకట్ట వేస్తారో వేచిచూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*