స్థానిక సమరానికి రాజకీయ పార్టీలు సమాయత్తం..!

  • అభ్యర్థుల వేటలో పార్టీలు
  • నేతల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు
  • మహిళలుకే అధిక ప్రాధాన్యం

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

   స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం జోరందుకుంది. ఈ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటుకోవాలని అధికార పార్టీ భావిస్తుండగా, టిడిపితో పాటు ఈసారి బిజెపి కూడా పోటీకి సై అంటోంది. దీంతో బలమైన అభ్యర్థుల కోసం మూడు పార్టీలూ అన్వేషిస్తున్నాయి. అయితే ఆశావహులు మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని నేతలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఆధిపత్యంపై వైకాపా ధీమా…
నియోజకవర్గ
పరిధిలో జరిగే సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపి, జెడ్పీటీసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమనే ధీమాలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండటంతో స్థానిక ఎన్నికల్లో కూడా తమకు ఎదురుండదనే ధీమాలో ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో విజయం సాధించి గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలనే ధోరణిలో ఉన్నారు.

టిడిపిలో గందరగోళం….
స్థానిక
సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రకటించి మరో పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నా ప్రతిపక్ష టిడిపిలో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొని వున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇన్ చార్జి అందుబాటులో లేకపోవడం , ఒకటి అర మినహా మిగిలిన మండలాల్లో నాయకులు చురుగ్గా పనిచేయకపోవడం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. లక్షల రూపాయల ఖర్చు చేసి పోటీ చేసినా భరోసా ఇచ్చే నేతలు లేకపోవడం టీడీపీ కేడరును ఆందోళనకు గురిచేస్తోంది.

పోటీకి సై అంటున్న బిజెపి….
స్థానిక సంస్థల
ఎన్నికల్లో తమసత్తా చాటాలని బిజెపి భావిస్తోంది. ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలాఆనంద్ పార్టీ కి ఎంతో కొంత ఊపు తెచ్చారు. గెలుపు ఓటములు ఎలావున్నా అన్ని స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

నేతలు చుట్టూ ఆశావహులు…
ఎంపిటిసి,
జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ముఖ్యంగా అధికార పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన శ్రీకాళహస్తి మండలంలో ఎంపిపి ఎస్టీ మహిళకు, జెడ్పీటీసీ ఎస్సీ మహిళకు కేటాయించారు. ఎంపిపి గురించి పెద్దగా పట్టించుకోకున్నా జెడ్పీటీసీ కోసం పలువురు పోటీ పడుతున్నట్టు సమాచారం. కాపుగున్నేరి మాజీ ఎంపిటిసి బావులూరు నీలిమకు టికెట్ కోసం ఆమె భర్త అంకయ్య ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొదటి నుంచి వైకాపా నేతగా ఉన్న అంకయ్య తన భార్యకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గంగలపూడికి చెందిన దళిత నాయకుడు సురేష్ కూడా తమ కుటుంబ సభ్యులను పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మండలం లో పలువురు ఎస్సీ నాయకులు జెడ్పీటీసీ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.

మహిళలు కే అధిక ప్రాధాన్యత…
నియోజకవర్గ పరిధిలో ఎంపిపి , జెడ్పీటీసీ స్థానాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత లభించింది. శ్రీకాళహస్తి మండల ఎంపిపిగా ఎస్టీ మహిళ, జెడ్పీటీసీ గా ఎస్సీ మహిళ పోటీ చేయనున్నారు. అలాగే తొట్టంబేడు మండల ఎంపీపీగా జనరల్ మహిళ, జెడ్పీటీసీ గా ఎస్సీ జనరల్ పోటీ చేయనున్నారు. ఏర్పేడు ఎంపిపిగా, జెడ్పీటీసీగా బిసి మహిళ పోటీ చేయనున్నారు. రేణిగుంట ఎంపిపిగా జనరల్, జెడ్పీటీసీ గా జనరల్ మహిళ పోటీ చేయనున్నారు. ఏదిఏమైనా గ్రామాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*