స్వర్ణముఖి ప్రక్షాళన సరే…పారిశుద్ధ్యం మాటేమిటి..!

  • నదిలో కలుస్తున్న డ్రైనేజీ నీరు…అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆనుకుని ఉన్న స్వర్ణముఖి నది ప్రక్షాళనకు అధికారులు పూనుకుని నదిలో ఉన్న చెత్తా చెదారాలను తొలగిస్తుండటంపై భక్తులతోపాటు స్థానికులు హర్షిస్తున్నారు. అయితే ఆలయం సమీపంలోనే డ్రైనేజీ నీరు నదిలో కలుస్తుండటం, దీని గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవడంపై విమర్శల వినిపిస్తున్నాయి.

స్వర్ణముఖి ప్రక్షాళన కు శ్రీకారం..
స్వర్ణముఖి నది అనేక సంవత్సరాలుగా రాళ్ళు రప్పలు, చెత్తా చెదారాలతో, పిచ్చి మొక్కలుతో అందవిహీనంగా ఉండేది. నది శుభ్రత గురించి గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో స్పందించిన పాలకులు, అధికారులు నదిని శుభ్రపరిచేందుకు పూనుకున్నారు. ముక్కంటి ఆలయం సమీపం నుంచి అర్థ నారీశ్వరాలయం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర నదిలో మొక్కలు తొలగించి, శుభ్రపరిచేందుకు పనులు చేపడుతున్నారు. దీంతో నదిశుభ్రంగా కనిపిస్తుండటంపై భక్తులతో పాటు స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీ నీటితో స్వర్ణముఖి కలుషితం..
స్వర్ణముఖి నదికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. పూర్వకాలంలో మునులు, రుషులు నదిలో స్నానం చేసి వెళ్లి శివున్ని పూజించేవారని చెబుతారు. భక్తులు సైతం ఉత్సవాలు సందర్భంగా నదిలో స్నానం చేసి శివాలయానికి వెళుతుంటారు. అంతటి ఖ్యాతి ఉన్న నదిలో ప్రస్తుతం భక్తులు దిగాలంటేనే భయపడుతున్నారు. ఆలయానికి సమీపంలో పలు ప్రయివేటు లాడ్జీలు వెలసిఉన్నాయి. ఈ లాడ్జీలు నుంచి వచ్చే మురికినీళ్లు నదిలోకి వదిలేస్తున్నారు. దీనికి తోడు సన్నిధివీధి , ఇసుక దిబ్బ ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు స్వర్ణముఖిలో కలుస్తోంది. దీంతో నదిలో నీరు పూర్తిగా కలుషితమవుతోంది. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో అయితే సరే. ఆలయానికి ఎదురుగానే నదిలో కలుస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.అయితే నదిలో స్నానం చేయలేకపోవడం భక్తులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ముక్కంటి ఆలయ అధికారులు ఇకనైనా స్పంధించి స్వర్ణముఖి నదిలో డ్రైనేజీ నీరు కలవకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*