స్వాములపైన మాట్లాడే ధైర్యమూ వచ్చింది!

బిజెపితో విడిపోయిన తరువాత తెలుగుదేశం నాయకులు గట్టిగానే మాట్లాడుతున్నారు. కాషాయం కట్టుకున్న స్వామీజీలనూ బహిరంగంగా విమర్శించి మాట్లాడగలుగుతున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో, ప్రత్యేకించి టిటిడి వ్యవహారాలలో స్వామీజీలా ఇష్టారాజ్యంగా సాగింది. అధికారులే కాదు ప్రభుత్వమూ గట్టిగా మాట్లాడిన పరిస్థితి లేదు. స్వామీజీలు చెప్పిన దానికల్లా తల ఊపేలా తయారయ్యారు. టిటిడి పాలక మండలిలోకి బిజెపి సభ్యులను తీసుకోవడంతో మొదలైన ఈ వ్యవహారం ఇటీవల దాకా సాగింది.

టిటిడి ఛైర్మన్‌టా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను నియమించడంపై శివస్వామి శివాలెత్తుతున్నారు. క్రైస్తవ సభలకు వెళ్లిన ఆయన టిటిడి ఛైర్మన్‌గా ఉండటానికి వీల్లేదన్న వివాదాన్ని లేవనెత్తారు. అయితే…టిడిపి నాయకులూ గట్టిగానే స్పందిస్తున్నారు. స్వయంగా సిఎం రమేష్‌ ఓ టివి ఛానల్‌ చర్చలో కూర్చుని శివస్వామిని తీవ్రస్థాయిలో మాట్లాడారు. (ఆ భాషను, తీరును ధర్మచక్రం అంగీకరించదు). నువ్వు….నువ్వు అని ఏక వచనంతోనూ మాట్లాడారు. ఇదే స్వామీజీలు అడ్డు చెప్పడం వల్ల ఇటీవల దాకా సుధాకర్‌ యాదవ్‌ నియామకం వాయిదా పడుతూ వచ్చింది. వాస్తవంగా ఐదారు నెలలకు మునుపే సుధాకర్‌ యాదవ్‌ నియామకం జరిగి ఉండాల్సింది. ఆయన పేరు ఖరారైనట్లు పేరు బయటకూ వచ్చింది. అయితే….శివస్వామి వంటి వారి అభ్యంతరంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. నియామకం వాయిదా వేశారు. ‘సుధాకర్‌ యాదవ్‌ పేరు నేను ప్రకటించామా’ విలేకరులతో వ్యాఖ్యానించారు కూడా. అప్పటి పరిస్థితి అది. బిజెపితో సంబంధాల రీత్యా…సుధాకర్‌ యాదవ్‌ను ఛైర్మన్‌గా నియమించడానికి కూడా చంద్రబాబు వెనుకాడారు. సంబంధాలు తెగిపోయాగ అలాంటి స్వాములకు గట్టి సమాధానమే చెబుతున్నారు.

ఈ నాలుగేళ్లలో టిటిడిలో స్వామీజీలు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ఒక స్వామీజీ వచ్చారు…వకుళామాత ఆలయం కట్టాల్సిందే అన్నారు. టిటిడి సరే అంది. ఇంకో ఆయన వచ్చారు…హిందూ ధర్మప్రచారం పేరుతో నెలకు రూ.50 లక్షలు, ఏడాదికి రూ.6 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇంకో ఆయన వచ్చారు…టిటిడిలో అన్యమత ఉద్యోగులున్నారంటూ రాద్దాంతం చేశారు. టిటిడి నోటీసులు ఇచ్చి కొత్త వివాదానికి పురుడుపోసింది. కాషాయ వస్త్రాలు కట్టుకుని వచ్చి…ఏది చెప్పినా అది చేయాల్సిందే అనే పరిస్థితి టిటిడిలో నెలకొంది. దీనికి కారణం ప్రభుత్వమే మెతగ్గా ఉండటం. ప్రభుత్వంలో వచ్చిన మార్పును చూసిన తరువాత తిరుపతిలో హడావుడి చేస్తున్న స్వాములు ప్రస్తుతానికి మౌనవ్రతం పాటిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*