స్వీయ తప్పిదాల వల్లే చావుదాకా తెచ్చుకుంటున్నాం..!

కరోనా జబ్బు వచ్చిన వారికందరికీ వెంటిలేటర్ల అవసరం ఉండదు. కరోనా వచ్చిన వారిలో ఒక శాతం వారికి ఒక్కటంటే ఒక్క శాతం వారికి మాత్రమే వెంటిలేటర్లు అవసరమౌతాయి.

దాదాపు మూడు నుంచి నాలుగు శాతం వారికి వెంటిలేటర్లు అవసరం లేకున్నా ఆక్సిజన్ అవసరమౌతుంది.

ఆక్సిజన్ అవసరమైన పేషంట్లను మధ్యస్త తీవ్రత ఉన్నవారిగా అనుకుంటే, వెంటిలేటర్ అవసరమైన పేషంట్లను ఎక్కువ తీవ్రత ఉన్న వారిగా అనుకోవాలి.

పై రెండు వర్గాల వారికి మాత్రమే హాస్పిటల్ అడ్మిషన్ అవసరమౌతుంది.

పై రెండూ అవసరం లేని వారికి హాస్పిటల్ అడ్మిషన్లు అవసరమే ఉండదు.

ఇక రెండవ పాయింటు.

అసలు ఆక్సిజన్ అవసరం గానీ, వెంటిలేటర్ల అవసరం వచ్చే పరిస్థితి దాకా కరోనా పాజిటివ్ వ్యక్తులు ఎందుకు తెచ్చుకుంటున్నారు?. అప్పటిదాకా ఏం చేస్తున్నారు?.
ఒకసారి ఆలోచించండి.

“కరోనా వ్యాధి ఒక్కరోజులో సీరియస్ కావడమనేది ఉండదు”.
ఈ ఒక్క ముక్క అర్థం చేసుకుంటే అసలు కరోనా మరణాలే ఉండవు.
అంటే ఈ రోజు ఒక వ్యక్తికి జ్వరము దగ్గు వచ్చాయనుకుందాం. రేపే అతనికి ఆయాసం ఎక్కువైపోయి ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ పెట్టవలసిన పరిస్థితి ఉండదు.

జ్వరము దగ్గు స్టేజి నుండి ఆయాసం స్టేజి దాకా వెళ్ళడానికి మధ్యలో ఎనిమిది నుంచి పది రోజుల వ్యవధి ఉంటుంది.

ఒక పేషంటు ఆయాసంతో హాస్పిటల్ కు వచ్చాడంటే ఏమని అర్థం?.
A. అతడు జబ్బు సోకాక దాదాపు పదోరోజుల తరువాత హాస్పిటల్ కి వస్తున్నాడన్నమాట.
B. ఈ పది రోజులూ డాక్టర్ దగ్గరికి పోకుండా, మందులు వేసుకోకుండా కషాయాలు, నిమ్మకాయలు అంటూ సమయం వృథా చేశాడన్నమాట.

కాబట్టి ఈ నిర్లక్ష్యం ఎవరిదో ఒకసారి ఆలోచించండి. రోగులను ఇలా నిర్లక్ష్యంగా ఉండేలా చేస్తున్నదేమిటో ఒకసారి ఆలోచించండి.

మరేం చేయాలి?.
జ్వరం దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే అదే రోజు లేదా ఆ తరువాత రోజు ఒక MBBS డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి. అందుకని ఏదో పెద్ద ఆసుపత్రికి తీసికెళ్ళనవసరం లేదు. పక్కనే ఉన్న పీహెచ్సీ కో లేక క్లినిక్ కో వెళ్ళవచ్చు. తెలిసిన డాక్టర్ ఉంటే ఫోన్ కన్సలటేషన్ ఐనా తీసుకోవచ్చు.

వాళ్ళు అవసరమనుకుంటే కరోనా టెస్టు అదే రోజో లేక కొంత వేచి చూచి మరో రెండు రోజులకో రికమెండ్ చేస్తారు. అది రిపోర్ట్ వచ్చే లోపే కొన్ని మందులు ఆయా వ్యక్తి అవసరాన్ని బట్టి లక్షణాలను బట్టి మొదలు పెడతారు. నిజంగా ఒకవేళ అది కరోనా అయివున్నా…డాక్టర్ ఇచ్చిన మందులకు నూటికి నూరు శాతం కంట్రోల్ కి వస్తుంది.

ఎందుకంటే… జబ్బు మొదటి స్టేజ్ లోనే డాక్టర్ దగ్గరికి పోయారు కనుక సులువుగా లొంగుతుంది. ఏం మందులిస్తారు అనేది అనవసరం. ట్రీట్మెంట్ ని ఆయా వ్యక్తిని బట్టి అతడు డాక్టర్ ముందు ప్రెజెంట్ చేసిన లక్షణాలను బట్టి డోసులను మందులను నిర్ణయిస్తారు. సరైన క్వారెంటైన్ కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా అందుతుంది. అవి చక్కగా పాటిస్తే రోగికి తగ్గడమే కాక రోగినుంచి మరొకరికి పాకే అవకాశం పూర్తిగా తగ్గిపోతుంది. ఆ పదిహేను రోజులూ డాక్టర్ తో ఆన్లైన్ పర్యవేక్షణలో ఉండటం ఎంతో మార్పును తీసుకుని వస్తుంది.

ఇలా డాక్టర్ పర్యవేక్షణలో ఉన్న వ్యక్తులలో నూటికి తొంభైతొమ్మంది పదోరోజుకల్లా కోలుకుంటారు. చాలా కొద్దిమందికి మాత్రం ఆ ఎనిమిది నుంచి పదో రోజప్పడు ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది.( ఇలా జరగడానికి వారి వారి శరీర ధర్మాలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులూ, చెడు అలవాట్లు వంటివి ముఖ్య భూమిక వహిస్తాయి) ఇంట్లో ట్రీట్మెంట్ ఇచ్చినా ఆయాసం తగ్గకపోతే డాక్టర్లు మందులు మారుస్తారు. ఐనా, కంట్రోల్ కి రాకుంటే ఏదైనా హాస్పిటల్ లో అడ్మిట్ అయి డైరెక్టు పర్యవేక్షణలో ఉండమని సలహా ఇస్తారు. అంటే ఏమిటి..mild stage నుంచి మధ్యస్త తీవ్రతకు చేరిందన్నమాట. వీళ్ళు వెంటనే ఒక ఆసుపత్రిలో అడ్మిట్ కాగలిగితే ఐదు రోజులలో చక్కగా బయటకు రాగలరు.

అసలు ఆక్సిజన్, వెంటిలేటర్లు అనే అంశాలు వ్యాధిలో చాలా తరువాత వచ్చే అంశాలు. అంతదాకా సమయాన్ని వేస్ట్ చేసి ఎమర్జెన్సీ లో అన్ని హాస్పిటల్స్ తిరిగితే ట్రీట్మెంట్ దొరకదు. స్వీయ తప్పిదాలు ఎక్కడ జరుగుతున్నాయో ఎవరికి వారు జాగ్రత్తగా పరిశీలించుకుని అవగాహన చేసుకోగలగాలి.

-డాక్టర్ విరించి విరివింటి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*