హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించిన టిటిడి

సనాతన ధర్మాన్ని విస్తృత ప్రచారం చేసేందుకు టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉద్ఘాటించారు. హెచ్‌డిపిపి అధ్వర్యంలో నూతనంగా రూపొందించిన www.hdpp.tirumala.org వెబ్‌సైట్‌ను తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి టిటిడి ఈవో గురువారం ఉదయం టిటిడి పరిపాలన భవనంలోని తమ కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ టిటిడి ధర్మ ప్రచారం కోసం చేపడుతున్న ప్రతి కార్యక్రమాలను భక్తులు సులభంగా తెలుసుకునేందుకు డిపిపి వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో ధర్మ ప్రచారకులు, భజన మండలి సభ్యులు, యువత, మహిళలు, ఔత్సాహికులు తమ సభ్యత్వాన్ని సులభంగా నమోదు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో డిపిపి కార్యక్రమల వార్షిక క్యాలెండర్లు, కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశం, వాటి విశిష్టత, ఆయా ప్రాంతాల్లోని ధర్మ ప్రచార మండళ్లు వివరాలు పొందుపర్చాపున్నారు. అదేవిధంగా పండుగలు – వాటి విశిష్టత, టిటిడి పంచాంగం, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అనుబంధ ఆలయాలలో నిర్వహించే ఉత్సవాల వివరాలు, ఫోటోలు పొందుపర్చాలన్నారు.
ధార్మిక, స్పూర్తిదాయక గ్రంథాలు, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను ఈ-బుక్స్‌ను భక్తులు సులభంగా అన్‌లైన్‌లో చదువుకునేలా, డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. అన్నమాచార్య సంకీిర్తనలు, ఇతర వాగ్గేయకారుల భక్తి సంకీర్తనలు భక్తులకు అందుబాటు ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులందరికి ధర్మప్రచార కార్యక్రమాలు చేరేందుకు ఈ వెబ్‌సైట్‌ ఉపయోగ పడుతుందన్నారు. హెచ్‌డిపిపి కార్యక్రమాలకు మొబైల్‌ యాప్‌ రూపొందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఈవో టిటిడి ఐటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం, తిరుమలలో శ్రీవారిసదన్‌ ప్రాంతాలలో భక్తులకు ఉన్న లాకర్ల సదుపాయాన్ని అనుసంధానం చేసేందుకు తయారు చేసిన అప్లికేషన్‌ను త్వరితగతిన భక్తులకు అందుబాటులోనికి తీసుకురావాలన్నారు. తద్వారా భక్తులు ఎంచుకున్న ప్రాంతంలో లాకర్లు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. టిటిడి గత ఏడాది రూపొందించిన గోవింద మొబైల్‌యాప్‌ ద్వారా భక్తులకు అందుతున్న సమాచారం, సౌకర్యాలు, అందులోని సాంకేతిక సమస్యలను ఐటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని టిటిడి కల్యాణమండపాలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను వేగవంతంగా పూర్తిచేయాలని, అదేవిధంగా తెలంగాణ, ఇతర రాష్ట్రాలలోని కల్యాణ మండపాలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
టిటిడిలో చెల్లింపులు, వివిధ శాఖలకు చెందిన టెండర్లు, వేలంలను ఆన్‌లైన్‌లోనే జరిగేవిధంగా అప్లికేషన్‌ రూపొందించాని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం టిటిడి విద్యాసంస్థలలో ప్రవేశాల కొరకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునేలా అప్లికేషన్‌ రూపొందించాలన్నారు. తద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లోనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్‌ జెట్టి, న్యాయాధికారి శ్రీ వెంకట రమణ నాయుడు, సిఈ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, డిపిపి కార్యదర్శి డా|| రమణ ప్రసాద్‌, డిఈవో శ్రీ రామచంద్ర, ఎస్టేట్‌ అధికారి శ్రీ విజయ సారధి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*