హీరోలు తన్నుకుంటుంటే..విలన్ పేదలను ఆదుకుంటున్నారు..!

  • ఎందుకయ్యా సోనూసూద్…మా హీరోలను తలదించుకునేలా చేస్తున్నావూ..!

ఆయన సినిమాల్లో హీరో కాదు… దుష్టపాత్రలు పోషించే విలన్. హిందీ నటుడు. మన తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. సోనూసూద్ అని చెబితే తెలియకపోవచ్చుగానీ… ‘నున్ను వదల బొమ్మాళీ’ అంటూ అరుంధతి చిత్రంలో నటించాడని గుర్తు చేస్తే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఆ తరువాత కూడా చాలా తెలుగు చిత్రాల్లో విలన్ వేషాలు వేశారు.

సినిమాల్లో విలన్ అంటేనే హీరో దగ్గర తన్నులు తినడం, తలవంచడం సహజమే. అయితే నిజ జీవితంలో సోనూ సూద్ హీరో అనిపించుకుంటున్నారు. సినిమాల్లో హీరోలుగా నటించిన చాలామంది ఆయన్ను చూసి నామూషాతో తల దించుకుంటున్నారు.

వలస కూలీలకు భోజనం వడ్డిస్తున్న సోనూ సూద్

ఇంతకీ విషయం ఏమంటే…కరోనా కష్టకాలంలో వలస కూలీలను‌ ఆదుకోవడం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు సోనూ సూద్. కార్మికుల కష్టాలు విని, చూసి చలించిపోయిన ఆయన…వారిని‌ ఆదుకునేందుకు నడుం బిగించారు. ముందుగా ముంబయిలోని తన హోటల్ ను…కరోనాతో పోరాడుతున్న వైద్యుల బస కోసం కేటాయించారు. ఇక వలస కూలీల కోసం రోజూ 45 వేల మందికి ఆహారం సరఫరా చేస్తున్నారు. అంతటితో ఆగిపోలేదు. స్వస్థలాలకు వెళ్లడానికి అవస్థపడుతున్న కూలీల కోసం బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో‌ 13 వేల మంది దాకా ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒరిస్సా, కర్నాటక తదితర రాష్ట్రాలకు తరలివెళ్లారు.

సోనూ సూద్ చూపుతున్న ఔదార్యం చూసి‌ దేశం మొత్తం ముచ్చటపడుతున్న వేళ…ఆయన చేసిన మరో చర్య ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతోంది. కూలీలను స్వస్థలాలకు చేర్చడం కోసం ఏకంగా విమానమే బుక్ చేశారు. ఒరిస్సాకు చెందిన మహిళలు కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలోని దుస్తుల పరిశ్రమలో పని చేస్తున్నారు. లాక్ డౌన్ వేళ ఇళ్లకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. సోనూసూద్ చేస్తున్న సాయం గురించి తెలుసుకుని ఆయన్ను సంప్రదించారు.

ఎవరూ ఊహింనట్లుగా స్పందించారు సోనూ. ఒరిస్సా మహిళల కోసం ప్రత్యేక విమానమే బుక్ చేసారు. ఒరిస్సా, కేరళ ప్రభుత్వాలతో మాట్లాడి…177 మంది మహిళలను ఇళ్లకు చేర్చారు. ఈ విమానం మహిళా కార్మికులను శుక్రవారం ఒరిస్సాలో దింపింది. అక్కడి ప్రభుత్వం స్వస్థలాలకు చేర్చింది. కూలీల పట్ల సోనూ సూద్ చూపుతున్న ఔదార్యం అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రభుత్వాలు చేయలేని పనిని ఆయన చేస్తున్నారంటూ నెటిజన్లు సోనూసూద్ ను అభినందిస్తున్నారు.

ఇక మన నటుల విషయానికొస్తే…కోట్లకు కోట్లు వెనకేసుకున్నారు. ఒక్కో హీరో తలచుకు‌న్నా వేల మంది కార్మికుల కష్టం తీరేది. అయినా పట్టించుకున్న పాపాన పోలేదు. సిఎం సహాయ నిధికి కొంత, సినీ కార్మికుల కోసం కొంత ఇచ్చి అంతే‌‌ అని చేతులు దులుపుకున్నారు. కరోనా కష్టాలు కొనసాగుతున్నా…ఎప్పుడెప్పుడు షూటింగులు మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నారు. దాని చుట్టూ ‌రాజకీయాలు చేస్తూ ఒకరినొకరు దూషించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇదీ హీరోలు, ఒక విలన్ కథ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*