హైదరాబాద్‌లో బాబు ఆశలు ఫలిస్తాయా…!

హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓటర్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారనడంలో సందేహం లేదు. సెటిలర్లను దృష్టిలో ఉంచుకునే పత్రికలూ హైదరాబాద్‌కు ఒక ఎడిషన్‌, మిగతా తెలంగాణకు ఇంకో ఎడిషన్‌ తీసుకొస్తున్న సంగతి తెలసిందే.

ప్రస్తుత ఎన్నికల్లో హైదరాబాద్‌లోని సీమాంధ్ర సెటిటర్లు ఎవరి పక్షాన ఉంటారనేదానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. తెలంగాణ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఓట్లేస్తారా లేక ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌తో ప్రభావితమై ఓట్లు వేస్తారా అనేది ఇప్పుడు చర్చించాల్సిన అంశం.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌లోని సీమాంధ్రులు పార్టీలకు అతీతంగా స్పందించిన మాట వాస్తవం. తాము నివశిస్తున ప్రాంతం, తాము జన్మించిన ప్రాంతంతో కలిసే ఉండాలని కోరుకున్నారు. అందుకే ఆ రోజు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్న టిఆర్‌ఎస్‌ పట్ల కాస్త ఆవేదనతో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా…?

ప్రత్కేక రాష్ట్రం కోసం ఉద్యమ సమయంలో సీమాంధ్ర నాయకులపై తీవ్రమైన విమర్శలు చేశారు. సీమాంధ్రులను దోపిడీదారులన్నారు. ఈ మాటలను చూసి…ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఉండగలరా..? అనే భయాందోళనలూ అప్పట్లో వ్యాపించాయి.

అయితే…ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత టిఆర్‌ఎస్‌ వైఖరి పూర్తి భిన్నంగా కనిపించింది. కొత్త రాష్ట్రంలో సెటిలర్స్‌ ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్లయినా తెలంగాణ ప్రజలేనని కెసిఆర్‌ పదేపదే చెప్పారు. అంతేకాదు హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజలకు కాళ్లో ముల్లు గుర్చుకుంటే పంటితో తీస్తానని కెసిఆర్‌ ప్రకటించారు. ఇవన్నీ మాటకే పరిమితం కాలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత సీమాంధ్రులకు చిమ కుట్టినంత బాధ కూడా టిఆర్‌ఎస్‌ కలిగించలేదు. అందుకే హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టంగట్టారు సీమాంధ్రులు.

ఇప్పుడు అసలు చర్చలోకి వస్తే…ఉద్యమ సమయంలో లాగా సీమాంధ్రులు పార్టీలకు అతీతంగా టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించినట్లు….ఇప్పుడూ వ్యతిరేకిస్తారా? అదే భావనతో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేస్తారా? ఉద్యమకాలం నాటి పరిస్థితి కచ్చితంగా ఇప్పుడు లేదు. అలావుండివుంటే కార్పొరేషన్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు అంతటి ఘన విజయం చేకూర్చేవారు కాదు. అయితే….ఎటూ వైసిపి పోటీలో లేదు కనుక….సీమాంధ్రులంతా టిఆర్‌ఎస్‌పై కోపంతో, తమకు ఓట్లు వేస్తారని టిడిపి ఆశలు పెట్టుకుంది. సీమాంధ్రకు తెలుగుదేశం పార్టీని ప్రతినిధిగా చూస్తారని ఆ పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారు.

తాజా పరిణామాలను టిడిపి విస్మరించిందో లేక గమనించలేదోగానీ… తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ల ఓటుపై అక్కడి రాజకీయాల కంటే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల ప్రభావమే ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు బలమైన సామాజిక వర్గాలు మూడు పార్టీలకు ప్రాతినథ్యం వహిస్తూ అధికారం కోసం పోరాడుతున్నాయి. జనం మధ్య కూడా ఇటువంటి స్పష్టమైన విభజన అమరావతి నుంచి అమెరికా దాకా వచ్చేసింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణలోనూ టిడిపిని ఓడించడానికి వైసిపి, జనసేన అభిమానులు, ఆ పార్టీల వెనుక ఉన్న కులాలు భావిస్తాయనడంలో సందేహం లేదు.

చంద్రబాబు నాయుడి సామాజికవర్గం ఎలాగైనా మహాకూటమిని గెలిపించడానికి ప్రయత్నిస్తుంటే…జగన్‌, పవన్‌ సామాజికవర్గాలు టిఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నాయి. టిడిపిని ఓడించమని పోలింగ్‌కు ఒకటి రెండు రోజుల ముందు ఆ పార్టీలు బహిరంగంగా పిలుపునిచ్చినా ఆశ్చర్యం లేదు. తెలంగాణలోనే కాదు…ఇటీవల కర్నాటక ఎన్నికల్లోనూ ఆంధ్ర పాలిటెక్స్‌ను దృష్టిలో ఉంచుకునే అక్కడి సీమాంధ్రులు ఓట్లేశారు.

సారాంశంగా చెప్పగలిగేది ఏమంటే…సీమాంధ్రులంతా తమకు వ్యతిరేకంగా ఓట్లేస్తారన్న భయం కెసిఆర్‌కు లేదు. తెలుగు ప్రజలంతా టిడిపికే పట్టంగడతారన్న ఆశలు చంద్రబాబు పెట్టుకోవాల్సిన పనిలేదు. హైదరాబాద్‌ వరకు ఆంధ్రరాజకీయాలు ప్రభావం చూపతాయనడంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*