తిరుమ‌ల గ‌దుల కేటాయింపులో ఇదో మోసం!

తిరుమలలో ఎక్కడ ఏరూపంలో అక్రమాలు జరుగుతాయో చెప్పలేం. చీమలు దూరేంత సందు దొరికినా అక్రమార్కులు సునాయాసంగా పాగావేసేస్తారు. ఈ మార్గాన్ని సంపాదనకు రాచమార్గంగా మార్చుకునేస్తారు. గదుల అడ్వాన్డ్స్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ అక్రమార్కులకు అడ్డాగా మారింది. సిఆర్‌వోలో కేటాయించిన గదులను ఏఆర్‌పి పరిధిలోని కాటేజీల్లోకి మార్పుచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. దర్జాగా సాగిపోతున్న ఈ అక్రమాలకు సంబధించి ధర్మచక్రం సేకరించిన వివరాల్లోకి వెళితే…

ముందుగా గదుల కేటాయింపు గురించి తెలుసుకుందాం…
****************************************
సెంట్రల్‌ రిపెప్షన్‌ ఆఫీర్‌ (సిఆర్‌వో)లో సాధారణ భక్తులకు గదులు కేటాయిస్తారు. ముందుగా వెళ్లి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే గదులు ఖాళీ అవగానే మెసేజ్‌ ద్వారా పిలిపించి గది కేటాయిస్తారు. ప్రధానంగా సుదర్శన్‌, గోవర్ధన్‌, కల్యాణి సత్రాల్లో గదులు కేటాయిస్తారు. ఇంకా హెచ్‌విసి, యజిఎన్‌సి, ఎఎన్‌సి, ఎస్‌ఎంసి ప్రాంతాల్లోని గదుల కేటాయింపులూ ఇక్కడే జరుగుతాయి. ముందస్తుగా బుక్‌ చేసుకున్న వారికి, దాతలకు ఏఆర్‌పి (అడ్వాన్డ్స్‌ రిజర్వేషన్‌ ప్రోగ్రాం) కౌంటర్లలో గదులు కేటాయిస్తారు. ఆలయానికి అతి దగ్గరగా ఉన్న వరాహస్వామి, రాంబగీచా విశ్రాంతి గృహాల్లో ఈ గదులు ఉంటాయి. ఇక విఐపిలకు పద్మావతి రిసెప్షన్‌లో గదులు ఇస్తుంటారు.

అక్రమాలు ఎలా జరుగుతున్నాయి?
**********************
సిఆర్‌వో కేటాయించే గదులు ఆలయానికి దూరంగా ఉంటాయి. అద్దె కూడా తక్కువగా ఉంటుంది. ఆలయానికి దూరంగా ఉండటమే దళారులకు వరంగా మారుతోంది. ఇక్కడ గదులు తీసుకుని బయటకు వచ్చేటప్పుడు…కాస్త సంపన్నులుగా కపించిన వారిని దళారులు బుట్టలో వేసుకుంటారు. ఆలయానికి దగ్గర్లో గది తీసిస్తామంటూ….వారి వద్ద నుంచి గది కేటాయింపు స్లిప్పు తీసుకుంటారు. దాన్ని ఏఆర్‌పి కౌంటర్లకు తీసుకెళతారు. నిమిషాల్లో గదిని వరాహస్వామి, రాంబగీచా విశ్రాంతి గృహాల్లో ఏదో ఒకదానికి మార్పించుకుంటారు. గది అద్దె పేరుతో వెయ్యి నుంచి రెండు వేల దాకా తీసి జేబులో వేసుకుంటారు. ఈ విధంగా సాధారణ రోజుల్లో 100 గదలదాకా, సెలవు రోజుల్లో 130-150 గదుల దాకా ‘మార్పిడి’ జరుగుతోంది. సాధారణంగా సిఆర్‌వోలో కేటాయించిన గదిని మార్పు చేయాలంటే….ఏ కాటేజీలో / ఏ సత్రంలోనైతే గది వచ్చిందో అక్కడికి వెళ్లాలి. అక్కడ ఆ గది మరమ్మతుల్లో ఉండటం వల్లనో, శుభ్రం చేయకపోవడం వల్లనో గదిని కేటాయించలేని పరిస్థితుల్లో ఉన్నామని, అక్కడి సిబ్బంది అలాట్‌మెంట్‌ స్లిప్పుపై రాసి పంపాలి. దాన్ని తీసుకుని ఎఆర్‌వోకు వెళితే…అక్కడ ఇంకో గది కేటాయిస్తారు. సాధారణంగా మరమ్మతుల్లో ఉన్న గదిని అలాట్‌మెంట్‌ కోసం పెట్టరు. ఇక గది శుభ్రం చేయడంలో ఆలస్యమైతే…గంటో అర్థ గంటో ఆలస్యమైతే నిరీక్షించి గది తీసుకుంటారు. సాధారణ భక్తులు ఎవరూ స్లిప్పుపై రాయించుకుని, మళ్లీ వెనక్కి వెళ్లి, ఇంకోచోట ఎక్కడో కేటాయిస్తే అక్కడికి పిల్లాపాపలను ఎగేసుకుని వెళ్లి, ఆ గదిలో దిగే పరిస్థితి ఉండదు. ఇదంతా ఎందుకులే అని నిరీక్షించి తమకు కేటాయించిన గదినే తీసుకుంటారు. వాస్తవంగా గది శుభ్రం చేయడం కూడా అర్థ గంటకు మించి ఆలస్యమవదు. గదులు మార్పిడి చేస్తున్నది తిరుమలలో తిష్టవేసిన దళారులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు మాత్రమే.

ఏఆర్‌పి సిబ్బంది సాయంతోనే…
************************
గదుల మార్పిడి అక్రమాలు ఏఆర్‌పి సిబ్బంది సాయంతోనే జరుగుతున్నాయని చెబుతున్నారు. అలాట్‌మెంట్‌ స్లిప్పుపైన ఎలాంటి రికమెండేషన్‌ లేకున్నా గదుల మార్పిడి జరుగుతున్నదంటే సిఆర్‌ఓ సిబ్బంది సహకారమే కారణమని ఈ వ్యవహారం గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఇక్కడో ఇంకో విషయం కూడా పరిశీలించాలి. నిజంగా ఎవరైనా భక్తులు గది బాగోలేదని వెనక్కి వస్తే…సిఆర్‌వో పరిధిలో ఉన్న సత్రాలు, కాటేజీల్లోనే ఇంకో గదిని కేటాయించవచ్చు. అలాకాకుండా ఏఆర్‌వో పరిధిలోని కాటేజీలలో గదులు కేటాయించాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్న. మరో ఆసక్తికరమైన విషయమూ ఇందులో కనిపిస్తుంది. ఏ గది అయితే బాగోలేని ఏఆర్‌వోలో మరో గది కేటాయించారో…మొదట కేటాయించిన ఆ గది మరుక్షణంలో ఇంకో భక్తునికి అలాట్‌ అవుతోంది. ఆ భక్తులు వెంటనే అక్కడ దిగుతున్నారు కూడా. నిజంగా మరమ్మతులైతే ఆ గదిని మధ్యాహ్నం దాకానో, సాయంత్రం దాకానో బ్లాక్‌ చేయాలి. అలా చేయరు. మళ్లీ అలాట్‌మెంట్‌ కోసం సిఆర్‌వో కంప్యూటర్లలోకి వెళ్లిపోతుంది. అంటే గది బాగోలేదన్నది సాకు మాత్రమే. దళారులు తమ జేబులు నింపుకోడానికి వేస్తున్న ఎత్తుగడ మాత్రమే.

విజిలెన్స్‌ విచారిస్తే అన్నీ బయటికొస్తాయి…
*******************************
ఏఆర్‌ఓలో జరుగుతున్న అక్రమాలపై టిటిడి విజిలెన్స్‌ అధికారులు ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నతాధికారులు చొరవ తీసుకుని లోతైన విచారణ జరిపిస్తే ఇప్పటిదాకా జరిగిన అక్రమాలు బయటపడతాయి. ఏరోజు ఎన్ని గదులు మార్పిడి చేశారు, ఆ సమయంలో డ్యూటీలో ఎవరున్నారు, మొదట అలాట్‌ అయిన గది నిర్వాహకుల నుంచి సిఫార్సు తీసుకొచ్చారా, తీసుకొచ్చినా నిజంగానే ఆ గది కేటాయించలేని స్థితిలో ఉందా, మళ్లీ ఎంత సేపటికి ఆ గదిని మరొకరికి కేటాయించారు….తదితర అంశాలపై అధ్యయనం చేస్తే అక్రమార్కులు ఇట్టే దొరికిపోతారు.

జెఈవోగారూ మీరూ స్పందించండి…
**************************
సిఆర్‌వో జరుగుతున్న వేలిముద్రల అవకతవకలపై జెఈవో శ్రీనివాసరాజు స్పందించిన తరువాత…దాదాపు అక్కడ అక్రమాలకు బ్రేక్‌పడింది. గతంలో రోజూ దాదాపు వందదాకా వేలి ముద్రలు మిస్‌ మ్యాచ్‌ పేరుతో గదుల అక్రమాలు జరిగేవి. ప్రస్తుతం వేలి ముద్రల మిస్‌ మ్యాచ్‌ అనేమాటే లేకుండాపోయింది. నిజంగా ఒకరిద్దరు భక్తుల వేలి ముద్రలను పరికరాలు గుర్తించలేని పరిస్థితివున్నా…అతని కుటుంబ సభ్యుల్లో ఎవరినో ఒకరిని పిలిపించి, వారి వేలిముద్రలు తీసుకుని గదులు కేటాయిస్తున్నారు. ఏఆర్‌పిపైనా జెఈవో దృష్టిసారించి, విజిలెన్స్‌తో విచారణ చేయిస్తే ఒక్కరోజులో అక్కడా పరిస్థితి మారిపోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*