140 కిలోల బరువు ఎత్తగలరట ఈ దేవదాసు!

నవ మన్మధుడు అక్కినేని నాగార్జున ఫిట్‌నెస్‌ రహస్యం ఏమిటో చెప్పారు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడుతూ….ఫిట్‌నెస్‌ అనేది శివ సినిమాతో మొదలయింది. అది నాజీవితంలో దినచర్యగా మారిపోయింది. స్నానం ఎలా చేస్తామో..వ్యాయామమూ అంతే. అమల కూడా నాతోపాటు రోజూ వ్యాయామం చేస్తారు. ఎవరైనా తన శరీర బరువుకు మించిన బరువు ఎత్తగలిగితే…ఫిట్‌గా ఉన్నట్లు. నా బరువు 80 కిలోలు. నేను 140 కిలోల బరువు ఎత్తుగలను. అమలు 70 కిలోల దాకా ఎత్తుతుంది….అంటూ రోజూ తాను వ్యాయామానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో వివరించారు నాగార్జున. 30 ఏళ్లుగా నిర్విరామంగా వ్యాయామం చేస్తున్నాను. నా జీర్ణ వ్యవస్థ చాలా బాగా పని చేస్తుంది. 30 ఏళ్ల యువకుడిలో ఉన్న స్థాయిలో ఉంటుంది. సాధన చేస్తే ఎవరికైనా ఇది సాధ్యమే అని చెప్పారు.

నటనలో కొడుకు చైతన్య, కోడలు సమంతలో ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ….కోడలివైపే నిలబడ్డారు. ఇద్దరూ కష్టపడేవాళ్లే. క్రమశిక్షణగా పని చేస్తారు. చైతన్యతో పోల్చితే అమ్మాయిగా సమంత ఈ స్థాయికి చేరుకోవడం, స్టార్‌డమ్‌ తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకే సమంతకే ఎక్కువ మార్కులు వేస్తా….అని నాగార్జున విశ్లేషణాత్మక సమాధానం ఇచ్చారు. సమంత తనకు కూతురువంటిదన్నారు.

ప్రస్తుతం కొత్తదనంతో కూడిన కథలు తెరకెక్కుతున్నా…కుటుంబంతో కలిసి చూడగల చిత్రాలు రావడం లేదనే విమర్శపై స్పందిస్తూ…కుటుంబంతో కలిసి చూడలేని సినిమాలకు పిల్లల్ని తీసుకెళ్లండి. కుటుంబ కథలొచ్చినపుడే అందరూ కలిసి వెళ్లండి. అయినా ఇంటర్నెట్‌లో అన్నీ ఓపెన్‌గా ఉన్నాయి. దాన్ని ఎవరూ ఏమీ చేయలేకున్నారు. పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారు. సినిమా వద్దకు వచ్చే సరికే హడావుడి చేస్తున్నారు. ఇదెక్కడి గొడవో నాకర్థం కావడం లేదని సూటిగా మాట్లాడారు.

అక్కినేని నాగేశ్వర్‌ రావు బయోపిక్‌ గురించి చెబుతూ…సావిత్రి జీవితమే సినిమాలో ఉంటుంది. అదేవిధంగా ఎన్‌టిఆర్‌ సినీనటుడిగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఫ్యాక్షన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చిన రాజశేఖర్‌ రెడ్డి…ఆ మనస్తత్వం నుంచి బయటకొచ్చి, పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కథలన్నీ బయోపిక్‌ తీయడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ మా నాన్నగారి జీవితం చాలా సరళంగా సాగిపోయింది. ఆయన జీవితాన్ని తెరకెక్కిస్తే…అదే డాక్యుమెంటరీ అవుతుంది…బయోపిక్‌ కాదేమో అనిపిస్తుంది…అని చెప్పుకొచ్చారు.

నాని, నాగార్జున కలిసి నటించిన దావదాస్‌ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆ నాటి దేవదాసు చిత్రం గురించి చెబుతూ…నా 11వ ఏట దేవదాసు చూశాను. నచ్చలేదు. ఆ వయసులో అటువంటి సినిమా ఏం నచ్చుతుంది. మళ్లీ సినిమాల్లోకి వచ్చాక చూశాను. బాగా నచ్చింది. మజ్ను సినిమా చేస్తున్నప్పుడు దేవదాసు చూడమని దాసరిగారు ప్రత్యేకంగా చెప్పారు…అంటూ ఆనాటి దేవదాసుతో అనుబంధాన్ని చెప్పారు ఈ దేవదాసు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*