ప‌ర‌కాల‌ను ఎప్పడో ప‌క్క‌న పెట్టేశారా?

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించడం, ఆయన వొద్దని వారించడం, అయినా పరకాల వెనక్కి తగ్గకపోవడం, రాజీనామా ఆమోదించడం….ఇదీ కథాక్రమం. బిజెపితో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ….కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను ఏ విధంగా సలహారుగా కొనసాగిస్తోందంటూ ప్రతిపక్షం వేస్తున్న ప్రశ్నలతో మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసినట్లు పరకాల ప్రకటించారు. అయితే…ఇక్కడ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. నిజంగానే పరకాల స్వతహాగా రాజీనామా చేశారా? లేక రాజీనామా చేయించారా? లేక రాజీనామా చేసేలా చేశారా? అనే అంశాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

ఒక కథనం ప్రకారం…బిజెపితో చెడిపోయినప్పటి నుండే పకరాలను చంద్రబాబు దూరంగా పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యమైన సమావేశాల్లో ఎక్కడా ప్రభాకర్‌కు భాగస్వామ్యం లేకుండా చేశారట. ఇక్కడి సమాచారం బిజెపికి చేరుతుందేమో అనే అనుమానంతోనే ఆయన్ను దూరంగా పెట్టినట్లు చెబుతున్నారు. ఎంతయినా…భార్య కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మోడీ అసాధ్యుడని చంద్రబాబే చెబుతున్నారు. అలాంటప్పుడు టిడిపి రహస్యాలు భర్త ద్వారా రాబట్టమని మంత్రి నిర్మలపై ఒత్తిడి తేకుండా ఉంటారా…అనేది ఎవరికైనా వచ్చే అనుమానం. ఈ అనుమానమే బాబుకూ వచ్చినట్లుంది…అందుకే ప్రభాకర్‌ను పక్కన పెట్టేశారట. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ప్రభాకర్‌ తనకు తానుగా వెళ్లిపోవాలని వేసి చూసినట్లున్నారు. తీరా ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న విమర్శల నెపంతో ప్రభాకర్‌తో రాజీనామా చేయించారని అంటున్నాయి. పైకి మాత్రం….ప్రభాకరే రాజీనామా చేసినట్లు, ముఖ్యమంత్రి ఆయన్ను సముదాయించినట్లు చెబుతున్నారు.

మోదీపై యుద్దం చేస్తున్నట్లు పెద్దగా గాండ్రిస్తూ వచ్చిన చంద్రబాబు…రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ప్రధానితో నవ్వుతూ కరచాలనం చేయడంతో….టిడిపి-బిజెపి రహస్య అనుబంధం కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగానే పరకాల విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపాయి. ఢిల్లీలో పోయిన విశ్వసనీయతను నిలబెట్టకునేందుకు పరకాల అంశాన్ని వాడుకునేందుకు టిడిపి సిద్ధపడింది. అందుకే ఆయనతో రాజీనామా చేయించి…తమకు బిజెపితో ఎలాంటి సంబంధాలూ లేవని చెప్పుకునే ప్రయత్యాన్ని టిడిపి చేస్తోంది. అయితే ఇదికాదు ప్రజలు కోరుకుంటున్నది….పరకాలతో రాజీనామా చేయించమని కాదు….రాష్ట్ర ప్రజలంతా తనతో ఉండాలని కోరుకుంటున్న బాబు….పరకాల సతీమణిని కూడా టిడిపితో ఉండేలా ప్రయత్నించివుండాల్సింది. అంటే బిజెపి నుంచి ఆమెను బటయకు తీసుకొచ్చివుంటే…పెద్ద సంచనలమే అయ్యేది. టిడిపి విశ్వసనీయత పెరిగేది. అయితే…రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల కంటే కేంద్ర మంత్రి పదవి పెద్దది, శక్తివంతమైనది కదా…! అందుకే సీతారామన్‌ బయటకు రాకుండా…పరకాలను బయటకు పంపారు. భవిష్యత్తులో ఈ పరకాల, ఆ నిర్మలా సీతారామన్‌ ఉపయోగపడొచ్చేమో! అక్కడే ఉండనీ…!

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*