టిటిడిపై 19న సుప్రీంలో సుబ్రమణ్యస్వామి కేసు!

టిటిడిపై ప్రభుత్వ పెత్తనం తొలగించాలంటూ ఎంపి సుబ్రమణ్యస్వామి వేయనున్న పిటిషన్‌ ఈనెల 19న సుప్రీం కోర్టు ముందుకు రానున్నట్లు సమాచారం. శ్రీవారి నగలు మాయమవుతున్నాయని, పోటులో తవ్వకాలు జరిగాయని, స్వామివారికి కైంకర్యాలు సరిగా జరగడం లేదని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను 24 గంటల్లో ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారు. రిటైర్‌మెంట్‌ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి టిటిడి జాతీయ స్థాయిలో వార్తల్లో ఉంది. ఇదిలావుండగా….టిటిడిలో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఎక్కువగా ఉందంటూ, దీన్ని తొలగించాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేస్తానని సుబ్రమణ్యస్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పిటిషన్‌ను సుబ్రమణ్యస్వామి బృందం తయారుచేస్తోంది. పిటిషన్‌ సిద్ధమయిందని, త్వరలో కోర్టు ముందుకు తీసుకెళుతానని ఆయన చెబుతూ వస్తున్నారు. దానికి ఈనెల 19న (జులై19, 2018) ముమూర్త నిర్ణయించినట్లు సమాచారం.

సుబ్రమణ్యస్వామి వేయబోయే పిటిషన్‌ అత్యంత కీలకం కాబోతోంది. ఎందుకంటే దేవాలయాలకు సంబంధించిన అనేక అంశాలు ఇందులో చర్చకు రాబోతున్నాయి. పురాతన కట్టడాల పరిరక్షణ, వంశపారంపర్య అర్చకత్వం, ఇతర సేవలు; దేవుళ్ల ఆస్తులు-ఆభరణాల పరిరక్షణ, ప్రభుత్వాల జోక్యం, ఆలయ సంప్రదాయాలు వంటి అంశాలపైన విచారణ జరగనుంది. దేవాలయాలకు సంబంధించి అనేక చట్టాలున్నాయి. వాటి ఆధారంగానే స్వామి పిటిషన్‌ దాఖలు చేస్తున్నారు. సుప్రీంలో వేసే పిటిషన్‌ అంటే అత్యంత పకడ్బందీగా ఉండాలి. అందుకే సుబ్రమణ్యస్వామి ఇందుకోసం దాదాపు రెండు నెలల సమయం తీసుకున్నారు. రమణ దీక్షితులు సహకారంతో టిటిడి వ్యవహారాలను తెలుసుకున్నారు. రమణ దీక్షితులును పదవిలో కొనసాగించడం అనేది ఇందులో చివరి అంశమే కానుంది. అంతకు మించి, అన్ని ఆలయాలకు వర్తించే అంశాలే కీలకం కానున్నాయి. సుబ్రమణ్యస్వామికి న్యాయవాదిగా ఉన్న పేరు ప్రఖ్యాతలను దృష్టిలో ఉంచుకుని ఆయన పిటిషన్‌ ఎలావుండబోతోంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలావుండగా ఇప్పటికే ఈ వ్యవహారం రాష్ట్ర హైకోర్టులో ఉంది. ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ప్రాథమిక వాదనలు జరిగాయి. పూర్తి వివరాలతో అపిడవిట్‌ దాఖలు చేయాలని టిటిడిని న్యాయస్థానం ఆదేశించించింది. మరోవైపు శ్రీవారి ఆభరణాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా హైకోర్టుకు లేఖ రాసింది. దీనిపైన ఇప్పటిదాకా న్యాయస్థానం ఏమీ చెప్పలేదు. సుప్రీంలో దాఖలయ్యే కేసును బట్టే హైకోర్టు కేసు విచారణ ఎలా సాగుతుందో తెలుస్తుంది. అన్నింటికీ సుప్రీంకు రానున్న కేసు పరిష్కారం చూపనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*