30 ఏళ్లు గడిచినా తట్టెడు మట్టి తీయని గాలేరు నగరి రెండవ దశ..

సాగునీటిలో చిత్తూరు జిల్లా భవిష్యత్తు ఏమిటి ?-1వ భాగం.

వి. శంకరయ్య, విశ్రాంత పాత్రికేయులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాగా వెనుకబడిన ఆదిలాబాద్ అనంతపురం జిల్లాలో కూడా కొద్దో గొప్పో శాశ్వత సాగునీటి వసతి వుండేది. కాని చిత్తూరు జిల్లాలో సెంట్ భూమికి శాశ్వత సాగు నీటి వసతి లేదు. వర్షాధారం భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం సాగుతోంది. ఈ దుస్థితి ఈ రోజుకూ కొన సాగుతోంది. ఎవరు అధికారంలోని కొచ్చినా ఎన్ని వాగ్దానాలు హామీలు ఇచ్చినా భవిష్యత్తులో కూడా శాశ్వత సాగు నీటి వసతి లభ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. దురదృష్టం ఏమంటే చిత్తూరు జిల్లా నుండే వెళ్లిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం అధికారంలో వున్నా సాగునీటి రంగంలోనే కాదు. ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు.

1988 లో ఎన్టీఆర్ చొరవతో గాలేరు నగరి పథకం రూపొందించిన శ్రీ రామ కృష్ణయ్య శ్రీ శైలం జలాశయం నుండి ప్రత్యేక కాలువ ద్వారా మైలవరం రిజర్వాయర్ వద్దకు తీసుకు వచ్చి కడప జిల్లాలో తొమ్మిది జలాశయాలు నెల్లూరులో రెండు జలాశయాలు చిత్తూరు జిల్లాలో ఏడు రిజర్వాయర్లు ఆఫ్ లైన్ పద్దతిలో రూపొందించారు.అంటే ప్రధాన కాలువ నుండి ఆయా రిజర్వాయర్లకు నీరు నింపే పద్దతి ప్రతి పాదించారు. . ఆ రోజుల్లో కడప జిల్లాలో సాగు తుండిన ఉద్యమంతో తుదకు శ్రీ శైలం కుడి కాలువతో గాలేరు నగరి పథకం అనుసంధానం చేశారు.

1989 తర్వాత డాక్టర్ మైసూరారెడ్డి చొరవతో శ్రీ రామారెడ్డి అనే ఇంజనీర్ గాలేరు నగరి పథకం స్వరూప స్వభావాలనే మార్చి వేశారు. ఆన్ లైన్ పద్దతి ప్రవేశ పెట్టారు.ఒక జలాశయం నిండిన తర్వాత మరొక జలాశయానికి నీరు వదిలే పద్దతి రూపొందించారు. ఈ విధానం సుదూరంలో వుండే చిత్తూరు జిల్లాకు ఉరి తాడుగా మారింది.. పైగా మూడు జిల్లాలోకూడా రిజర్వాయర్లను తగ్గించారు. ఆన్ లైన్ పద్దతి- రిజర్వాయర్ల కుదింపు శ్రీ శైలం కుడి కాలువతో అనుసంధానం అన్నీ కలగలసి చిత్తూరు నెల్లూరు జిల్లాలో గాలేరు నగరి పథకంపై తొలి సమ్మెట దెబ్బ వేసింది. చిట్ట చివరి జిల్లా కావడం దానికి తోడు రాజకీయ ప్రభావం లేక పోవడం ఏ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం శాపంగా మిగిలింది.

పోనీ 1995 లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు 2004 వరకు తొమ్మిది ఏళ్ల కాలంలో అన్నిసీమ పథకాలతో పాటు గాలేరు నగరి పథకం కాగితాలకే పరిమితం చేశారు. మిగులు జలాలు ఉపయోగించుకొనే పుణ్య కాలం గడచి పోయింది.
2004 లో అధికారం చేపట్టిన వైయస్ రాజశేఖర రెడ్డి అన్ని ప్రాజెక్టులతో పాటు గాలేరు నగరి పథకం నిర్మాణం మొదలు పెట్టినా తొలి దశకు ఇచ్చిన ప్రాధాన్యం రెండవ దశ కు ఇవ్వలేదు. రెండవ దశ పునాది రాళ్లకే పరిమితమైంది. 2006 జూన్ 4 వ తేదీ గాలేరు నగరి పధకానికి చిత్తూరు జిల్లాలో నగరి వద్ద వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గా పునాది రాయి వేసిన సందర్భంలో ప్రభుత్వం ప్రకటించిన బుక్ లెట్ లో కడప జిల్లాలో గండికోట వామికొండ సర్వారాయ సాగర్ ఉద్ది మడుగు నాలుగు రిజర్వాయర్లకు లక్షా50 వేల ఎకరాల ఆయకట్టుకు 22.183 టియంసిల నీరు కేటాయించారు. అందులో గండి కోట నిల్వ సామర్థ్యం 16 టియంసిలని చూపెట్టారు..

చిత్తూరు జిల్లాకు వచ్చే సరికి బాలాజీ రిజర్వాయర్ మల్లిమడుగు కలుపుకుని ఏడు రిజర్వాయర్ చూపెట్టి లక్ష 15 వేల ఎకరాలకు కేవలం 10.80 టియంసిల నీరు కేటాయించారు. ఇందులో ఒక టియంసి తిరుమల తాగునీటికి చూపెట్టారు.

గాలేరు నగరి పథకం నీటి కేటాయింపులు 32.955 టియంసిలుగా చూపెట్టారు. అయితే గాలేరు నగరి తొలి డిపిఆర్ తో నిమిత్తం లేకుండా గండికోట నిల్వ సామర్థ్యం 26 టియంసిలకు పెంచి పైడి పాలెం రిజర్వాయర్ యుద్ద ప్రాతిపదికన నిర్మించి తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టుకు గాలేరు నగరి జలాలు ఎత్తిపోతలు సాగించడంతో చిత్తూరు జిల్లాకు చెందిన రెండవ దశకు గ్రహణం పట్టింది. నీటి కేటాయింపుల్లో అదనంగా, 10 టియంసిలు గండికోటకు పెరిగాయి. మొదలే మిగులు జలాలు డిపిఆర్ లో లేకుండా పది టీఎంసీలు కడప జిల్లాలో పెరగడంతో చిత్తూరు జిల్లా కోటాపై ఈ ప్రభావం పడక తప్పదు.ఈ పథకం ప్రతి పాదించి 30 ఏళ్లు గడచి పోయినా ఇంత వరకు తట్టెడు మట్టి వేసిన పాపాన పోలేదు. తుదకు 2014 లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు కూడా ఒక్క రూపాయి అయిదు ఏళ్ల కాలంలో కేటాయించలేదు.వ్యయం చేసిన కొద్ది నిధుల గండికోట తదితర పథకాలకే పరిమితమైంది.
అంత కన్నా మరో ఘోర మేమంటే ఇంత సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ టిడిపిలు అధికారంలో వున్నా అధికార ప్రతి పక్షాలు ఎమ్మెల్యేలు తుదకు ఏ రాజకీయ పార్టీకి చెందని రైతు సంఘాల నేతలు కూడా ఎప్పుడు ఈ పథకం నత్త నడక గురించి ఉద్యమం చేపట్టిన సందర్భంలేదు.
ప్రస్తుతం గాలేరు నగరి పథకం కడప జిల్లాలో సర్వారాయ సాగర్ వరకు వచ్చి ఆగిపోయింది. కడప జిల్లాలో ఉద్దిమడుగు జలాశయం కూడా మూలన పడింది. అచ్చట నుండి చిత్తూరు జిల్లాల్లోనికి ప్రధాన కాలువ రావాలంటే భూసేకరణ ముఖ్యంగా అటవీ భూమి సేకరణ అడ్డంకిగా ఏర్పడి రెండవ దశ ఆగి పోయింది.. ఇప్పుడే కాదు. భవిష్యత్తులో కూడా ఈ అలైన్ మెంట్ తో గాలేరు నగరి రెండవ దశ ప్రధాన కాలువ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు.

అందుకే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఉద్దేశం ఏదైనా కావచ్చు. గాలేరు నగరి పథకంలో భాగంగా వుండే మల్లి మడుగు 2. 85 టియంసిలు బాలాజీ జలాశయం 3 టియంసిల నిల్వ సామర్థ్యంతో అర కొరగా పనులు సాగిస్తూ సోమశిల స్వర్ణ ముఖి లింక్ కెనాల్ లో భాగ మైన మేర్ల పాక జలాశయం నుండి మల్లి మడుగు జలాశయానికి ఎత్తిపోతల పథకం టెండరు పిలిచి అధికారం నుండి దిగి పోయారు.ఈ దశలో .చిత్తూరు జిల్లాలో గాలేరు నగరి రెండవ దశ పథకం అమలు కావాలంటే మేర్ల పాక జలాశయం నుండి మల్లి మడుగుకు టెండరు పిలిచిన ఎత్తిపోతలు ఒక్కటే మార్గం.సర్వా రాయ సాగర్ నుండి ప్రధాన కాలువ వచ్చే అవకాశం లేదు.అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి టిడిపి హయాంలో అమలు చేసిన టెండర్లు పరిశీలనకు ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ పరిశీలనకు వచ్చిన సందర్భంలో ఈ ఎత్తిపోతల పథకం టెండరు రద్దు చేయమని దీనికి తోడు మల్లి మడుగు బాలాజీ జలాశయాలు ఒక్కో టియంసికి పరిమితం చేయమని అంటే వాటి క్యాచ్ మెంట్ ఏరియాకే పరిమితం చేయమని సూచనలు ఇచ్చినట్ల మీడియాలో వార్తలు వచ్చాయి. ఎత్తిపోతల పథకం టెండరు రద్దు చేసినట్లు సంబంధిత చీఫ్ ఇంజనీర్ ప్రకటించారు.

మల్లి మడుగు బాలాజీ రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం ఒక్కో టియంసికి తగ్గించి మేర్లపాక ఎత్తిపోతల పథకం రద్దు చేస్తే చిత్తూరు జిల్లాకు చెంది రెండవ దశ గాలేరు నగరి పథకానికి మంగళం పాడినట్లే. అంతేకాదు. సోమశిల – స్వర్ణ ముఖి లింక్ కెనాల్ కూడా అనువైన మార్గం కాదు.తొలుత ఈ లింక్ కెనాల్ సోమశిల జలాశయం నుండి ప్రారంభం కావాలని ప్రతిపాదనలు జరిగినా
ఆఖరున సోమశిల కండలేరు వరద కాలువ నుండి మొదలు పెట్టారు. మార్గ మధ్యలో దీనికీ అటవీ భూమి సేకరణ అడ్డురావడంతో అలైన్ మెంట్ మార్పుచేశారు. వెంకటగిరి వద్ద కండలేరు పూండి కాలువ నుండి నీరు తీసుకోవాలని మార్పుచేశారు. వాస్తవంలో సోమశిల కండలేరు వరద కాలువ నిర్మాణం 12వేల క్యూసెక్కులు నీటి ప్రవాహంతో వున్నా ప్రస్తుతం 10 వేల క్యూసెక్కులు కూడా రావడం కష్టంగా వుంది. మరో వేపు కండలేరు పూండి కాలువ నాలుగు వేల క్యూసెక్కులు ప్రవాహ సామర్ధ్యంతో నిర్మించారు. ప్రస్తుతం రెండు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇంత తక్కువ నీటి సామర్థ్యం గల కాలువ నుండి దానికి కేటాయించిన నీరు విడుదల చేస్తూ అదనంగా సోమశిల స్వర్ణ ముఖి కెనాల్ కు కేటాయించిన అయిదు టియంసిలు గాలేరు నగరి రెండవ దశకు కేటాయించిన పది టియంసిలు అంద జేయడం సాధ్యం కాదు.
.ఈ నేపథ్యంలో గాలేరు నగరి రెండవ దశకు కేటాయించిన 10 టియంసిలు నీరు సోమశిల నుండి లీన్ ఇయర్స్ లో తీసుకు రావడం మరీ కుదరదు. ఈ ఏడు భారీ వర్షాలు పడ్డాయి కాబట్టి సోమశిల నిండింది. కండలేరుకు నీళ్లు వచ్చాయి. లేకుంటే ఈ మార్గంలో కూడా చిత్తూరు జిల్లాకు గాలేరు నగరి రెండవ దశకు నీళ్లు తీసుకు రావడం ఆచరణలో అసాధ్యం. అందుకే గాలేరు నగరి రెండవ దశ పథకం గాలిలో దీపంగా వుంది.

(హంద్రీనీవా తర్వాత భాగంలో)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*