3,800 మంది రైతులకు విద్యుత్‌ సరఫరా చేసిన టిటిడి చరిత్ర తెలుసా..?

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎన్నో సమాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా విద్య, వైద్య రంగాలలో విశిష్టమైన సేవలు అందిస్తోంది. టిటిడి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలల నుంచి డిగ్రీ, పిజి కాలేజీల దాకా నడుస్తున్నాయి. స్విమ్స్‌, బర్డ్‌ వంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థలనూ నిర్వహిస్తోంది. ఇవన్నీ అందరికీ తెలిసిన కార్యక్రమాలే. అయితే…ఒకప్పుడు రైతుల కోసం విద్యుత్‌ సరఫరా చేసే బృహత్తర బాధ్యతనూ నెరవేర్చిందని తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేయడమేకాదు…. తిరుపతి చుట్టుపక్కలున్న గ్రామాల్లో విద్యుత్‌ వెలుగులు నింపింది టిటిడినే.

1957కు మునుపు టిటిడికి విద్యుత్‌ లైసెన్సు ఉండేది. ఇలాంటి లైసెన్సు కలిగిన సంస్థలు ప్రభుత్వం నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసి, తనకు కేటాయించిన పరిధిలోని వినియోగదారులకు సరఫరా చేసేవి. టిటిడి కూడా ఇటువంటి లైసెన్సు తీసుకుని, తిరుమలతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా చేసేది. ఆ తరువాత ప్రభుత్వం విద్యుత్‌ వ్యవస్థను జాతీయకరణ చేసింది. అంటే విద్యుత్‌ వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఇది జరిగిన 22.05.1957 నాటికి టిటిడి 34 గ్రామాల్లో 3,800 మంది రైతుల పంపుసెట్లకు విద్యుత్‌ సరఫరా చేస్తోంది. మరో 27 గ్రామాల్లోని రైతులకూ విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడం కోసం డిపాజిట్లు వసూలు చేసింది. విద్యుత్‌ వ్యవస్థ జాతీయకరణతో….తన పరిధిలోని 3,800 విద్యుత్‌ కనెన్షన్లతో పాటు….అప్పటిదాకా కొత్త కనెక్షన్ల కోసం వసూలు చేసిన డిపాజిట్లు 3 లక్షల రూపాయలనూ విద్యుత్‌ శాఖకు జమ చేసింది.

టిటిడి అటు రేణిగుంట నుంచి ఇటు చంద్రగిరి వరకు మొత్తం 440 చదరపు మైళ్ల విస్తీర్ణంలోని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా చేసేది. వ్యవసాయానికి విద్యుత్‌ అందించడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దేవస్థానం ఈ బృహత్తర కార్యాన్ని భుజానికెత్తుకుంది. తనకు కేటాయించిన పరిధిలో విద్యుత్‌ లైన్ల నిర్మాణ బాధ్యతనూ టిటిడి నిర్వర్తించింది. అదేవిధంగా గ్రామాల్లో విద్యుత్‌ దీపాల ఏర్పాటు బాధ్యతనూ టిటిడి చేపట్టింది. 1954న జరిగిన టిటిడి పాలక మండలి సమావేశంలో…’విద్యుత్‌ లైన్లను చెర్లోపల్లి గ్రామం వరకు విస్తరించడంతో పాటు రేణిగుంట, పేరూరు, తొండవాడ పంచాయతీల్లో మరిన్ని ఎక్కువ విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలి’ అని తీర్మానించారు. 1954-1957 మధ్య పలుచోట్ల ఇలాంటి తీర్మానాలు కనిపిస్తాయి. తన ఆధీనంలోని విద్యుత్‌ లైన్లు, కనెక్షన్లను ప్రభుత్వానికి అప్పగించే సమయానికి టిటిడి నెలకు 3 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేది.

విద్యుత్‌ శాఖకు తన కనెక్షన్లను అప్పగించడంతో పాటు కొత్త కనెక్షన్ల కోసం వసూలు చేసిన రూ.3 లక్షల డిపాజిట్‌నూ అప్పగించిన టిటిడి…అప్పటికే కొంత మొత్తాన్ని అప్పుగానూ విద్యుత్‌ శాఖకు ఇచ్చింది. 22.05.1954 నాటికి ఆ అప్పు మొత్తం రూ.6.89 లక్షలుగా టిటిడి రికార్డుల్లో కనిపిస్తోంది. ఈ మొత్తాన్ని 1963లో తిరిగి టిటిడికి చెల్లించాలన్న షరతు విధించారు. అయితే…ఆ తరువాత ఆ మొత్తాన్ని ప్రభుత్వం టిటిడికి ఇచ్చిన దాఖలాలు లేవు. అప్పట్లో ఎలక్ట్రికల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఇ) అనంతపురంలో ఉండేవారు. తిరుపతిలో డివిజనల్‌ ఇంజినీరు కార్యాలయం మాత్రమే ఉండేది. అప్పట్లో టిటిడి జరిపిన లావాదేవీలన్నీ అనంతపురం ఎస్‌ఈ కార్యాలయంతోనే జరిగాయి.

విద్యుత్‌ సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడంతో టిటిడికీ ఇబ్బంది ఎదరయింది. దీంతో అప్పట్లో ప్రభుత్వంతో చర్చలు జరిపారు. నెలకు రూ.3000 ఆదా అయ్యే విధంగా రాయితీపై తిరుమలకు విద్యుత్‌ సరఫరా చేసేలాగా ప్రభుత్వం అంగీకరించింది. కొత్తగా వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడానికి డిపాజిట్టుగా వసూలు చేసిన డబ్బును విద్యుత్‌ శాఖకు ఇచ్చేటప్పుడు….ఊరకే ఇచ్చేయలేదు. కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ ప్రాంత రైతులకు విద్యుత్‌ కనక్షన్ల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని విద్యుత్‌ శాఖ అధికారులపై ఒత్తిడి చేసింది.

ఇప్పుడైతే…చుట్టూ గిరి గీసుకుని సామాజిక కార్యక్రమాలను పరిమితం చేసుకున్న టిటిడి….అప్పట్లో ప్రదర్శించిన చొరవ చూస్తుంటే….’టిటిడిని శెభాష్‌’ అనకుండా ఉండలేం. ప్రతిదాన్నీ ప్రైవేట్‌కు అప్పగించి బాధ్యతల నుంచి తప్పుకోజూస్తున్న టిటిడి…ఆనాడు రైతులకు విద్యుత్‌ సరఫరా వంటి బాధ్యతను నెత్తికెత్తుకుందంటే ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*