టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద…వెయ్యి మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది శాంతియుత నిరసన…టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డికి విన‌తిప‌త్రం

     ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌(APCOS)లో త‌మ‌ను క‌ల‌ప‌రాద‌ని, శ్రీ‌వారినే న‌మ్ముకుని జీవ‌నం సాగిస్తున్న త‌మ‌కు టైమ్‌స్కేల్ వ‌ర్తింప‌చేయాల‌ని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది టిటిడి యాజ‌మాన్యానికి విజ్ఞ‌ప్తి చేశారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద బుధ‌వారం టిటిడి కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో వివిధ విభాగాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది శాంతియుతంగా నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. సిఐటియుతోపాటు టిటిడిలోని ప‌లువురు ఉద్యోగ సంఘాల నాయ‌కులు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

     ఈ సంద‌ర్భంగా సిఐటియు జిల్లా అధ్య‌క్షుడు ఎం.నాగార్జున మాట్లాడుతూ APCOSలో విలీనం చేయాల‌ని నిర్ణ‌యిస్తూ టిటిడి బోర్డు చేసిన తీర్మానాన్ని వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. టిటిడిలో సుమారు 14,300 మంది ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వ‌హిస్తున్నార‌ని, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన హామీ మేర‌కు అంద‌రికీ టైంస్కేల్ వ‌ర్తింప చేయాల‌ని డిమాండ్ చేశారు. చాలీచాల‌ని జీతాల‌తో జీవ‌నం సాగిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు అన్యాయం చేయ‌డం త‌గ‌ద‌న్నారు.
    సిఐటియు జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కందార‌పు ముర‌ళి మాట్లాడుతూ టిటిడిలో భ‌క్తుల‌కు ఎన‌లేని సేవ‌లందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని కోరారు. టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు సిఐటియు మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని తెలిపారు. 

      టిటిడి స్టాఫ్ అండ్ వ‌ర్క‌ర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయ‌కులు, ఎంప్లాయిస్ బ్యాంక్ డైరెక్ట‌ర్ జి.వెంక‌టేశం మాట్లాడుతూ టిటిడిలో ఎలాంటి నిధుల కొర‌త లేద‌ని,  APCOSలో విలీనం చేయ‌కుండా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు టైంస్కేల్ వ‌ర్తింప‌చేయాల‌ని కోరారు.

     టిటిడి జెఏసి ఛైర్మ‌న్ జి.వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, మ‌హిళా ఉద్యోగ సంఘం నాయ‌కురాలు ఎస్‌.క‌ల్ప‌న‌ మాట్లాడుతూ టిటిడి సంస్థ అభివృద్ధి కోసం శాశ్వ‌త ఉద్యోగుల‌కు స‌మానంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వ‌హిస్తున్నార‌ని, అలాంటి వారికి న్యాయం చేయాల‌ని, వారికి పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని తెలిపారు. 


     టిటిడి కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ అధ్య‌క్షుడు గోపి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి.సుబ్ర‌మ‌ణ్యం మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాల‌ని వేత‌నాల‌తో కుటుంబ పోష‌ణ‌కు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీని నెర‌వేర్చేలా టిటిడి యాజ‌మాన్యం ముందుకు సాగాల‌ని, ఇందుకోసం యూనియ‌న్ త‌ర‌ఫున పోరాటం చేస్తామ‌ని వెల్ల‌డించారు.

     టిటిడిలోని ప‌లువురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ APCOSలో విలీనం చేయ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. APCOSలో విలీనం చేస్తూ బోర్డు చేసిన తీర్మానాన్ని ర‌ద్దు చేయాల‌ని, టైంస్కేల్ వ‌ర్తింప‌చేయాల‌ని కోరారు.

     ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకురాలు లక్ష్మి, టిటిడి స్టాఫ్ అండ్ వ‌ర్క‌ర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి నాగ‌ర‌త్నం, ఎంప్లాయిస్ బ్యాంక్ డైరెక్ట‌ర్‌, కాటా గుణ‌శేఖ‌ర్‌, క‌ల్యాణ‌క‌ట్ట యూనియ‌న్ నాయ‌కులు పెరుమాళ్లు, వెంక‌ట‌సుబ్బ‌య్య‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంఘం నాయ‌కులు గంగుల‌ప్ప‌, చంద్ర‌శేఖ‌ర్‌, గార్డెన్ ఎంప్లాయిస్ యూనియ‌న్ కార్య‌ద‌ర్శి ఎ.చ‌ల‌ప‌తి, వినియోగ‌దారుల ఫోరం జిల్లా నాయ‌కులు డిఎంసి.భాస్క‌ర్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు హరిప్రసాద్, నవీన్, రూప్ కుమార్, హరి, నిరంజన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ఛైర్మ‌న్‌కు విన‌తిప‌త్రం

ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని APCOSలో విలీనం చేస్తూ బోర్డు చేసిన తీర్మానాన్ని ర‌ద్దు చేయాల‌ని, టైంస్కేల్ వ‌ర్తింప‌చేయాల‌ని కోరుతూ బుధ‌వారం తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డికి విన‌తి‌పత్రం స‌మ‌ర్పించారు. సిఐటియు జిల్లా అధ్య‌క్షుడు ఎం.నాగార్జున, టిటిడి జెఏసి ఛైర్మ‌న్ జి.వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, ఉద్యోగ సంఘం నాయ‌కురాలు క‌ల్ప‌న‌, టిటిడి కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి.సుబ్ర‌మ‌ణ్యం, ప‌లువురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు ఛైర్మ‌న్‌ను క‌లిసి స‌మ‌స్య‌ను వివ‌రించారు. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు.

టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి వినతిపత్రం ఇస్తున్న నాయకులు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*