దేవుళ్లారా….ఏనుగులకు ఏమిటీ శిక్ష!

తమిళనాడులోని సేలం సుగవనేశ్వర్‌ ఆలయ ఏనుగు రాజేశ్వరిని కారుణ్య హత్య చేయడానికి మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఏనుగు కాలుకి బలమైన దెబ్బ తగలడంతో నిలబడటానికి సాధ్యంకాకుండా ఉంది. ఏనుగును అటూ ఇటూ తిప్పాలన్నా పొక్లయనర్‌తో తిప్పుతున్నారట. ఫలితంగా కాయాలు మరీ తీవ్రమయ్యాయి. చికిత్స ఫలించడం లేదు. రాజేశ్వరి నరక యాతన అనుభవిస్తోంది. దీంతో ఓ జంతు ప్రేమికుడు కోర్టును ఆశ్రయించి ఏనుగుకు కారుణ్య మరణం ప్రసాదించమని వేడుకున్నారు. దీనిపై స్పందించిన కోర్టు వైద్య నివేదికలు తెప్పించుకుని, రాజేశ్వరి ప్రాణాలను బలవంతంగా తీయడానికి అనుమతి ఇచ్చింది.

ఇది ఒక చిన్న వార్తగా కనిపిస్తున్నా….చాలా తీవ్రమైన సమస్యే. అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన ఏనుగులను… సంప్రదాయాల పేరుతో ఆలయాల వద్ద బంధిస్తున్నారు. ఉత్సవాల సమయంలో ఏనుగులను వాహన సేవల ముందు నడిపిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకుని అన్ని ప్రముఖ ఆలయాల్లోనూ ఏనుగులు ఉన్నాయి. ఏనుగులను ఆలయాల వద్ద బంధించడం వాటికి నరకమే చెప్పాలి. ఆలయాల్లోని ఏనుగులు తరచూ అనారోగ్యంపాలవుతున్నాయి. కొంతకాలం తరువాత పచ్చిపడుతోంది. ఇలాంటప్పుడు అవి రెచ్చిపోయి భక్తలపై దాడి చేస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. జనం ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఆలయాల వద్ద ఏనుగులను రోజుకు సగటున 16 గంటలకుపైగా కట్టేసి ఉంచుతున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ శాతం ఏనుగుల్లో పాదాలకు గాయాలవుతున్నాయి. సిమెంటు గచ్చు వేసిన నేలపైన గంటల తరబడి నిలబడటం వల్ల పాదాలకు గాయాలవుతున్నాయి. ఆలయాల్లో 90 శాతం ఏనుగులకు సరైన ఆహారం ఇవ్వడం లేదట. ఇలాంటి సమస్యలే ఏనుగులను అనారోగ్యంపాలు చేస్తున్నాయి.

ఏనుగులను సంరక్షణలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాస్తవంగా జంతువులకు వైద్యం చేసేవాళ్ల సంఖ్యే చాలా తక్కువ. అలాంటి వన్యప్రాణుల వైద్యల సంఖ్య మరీ తక్కువ. ఒక్క కేరళలో మినహా దక్షిణ భారత దేశంలో చెప్పుకోదగ్గ ఏనుగు వైద్యులు లేరు. కేరళలో 2015లో ఏనుగుల కోసం రూ.10 కోట్లతో ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారి ఆలయానికి చెందిన ఏనుగులకు తీవ్రమైన అనారోగ్యం వస్తే కేరళ నుంచి వైద్యులను పిలిపిస్తారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆలయాల వద్ద అత్యధికంగా ఏనుగులు ఉన్నాయి. ఏనుగుకు అనారోగ్యం చేస్తే వెంటనే చూపించే పరిస్థితి లేదు. స్థానికంగా పశువైద్యులకు చూపించడం లేదంటే…తమకు తెలిసిన వైద్యం చేయడం. దీంతో ఆలయాల వద్ద ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. ఇదీ ఆలయాల వద్ద అంబారీ ఏనుగుల విషాద గాథ. దేవుడా..ఏమిటీ శిక్ష?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*