60 వేలకుపైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన ఏకైక డాక్టర్‌

తిరుపతి రుయాసుపత్రి ఆర్‌ఎంఓగా పనిచేసి మొన్ననే ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్‌ టి.మునిరత్నంకు అరుదైన గుర్తింపు ఉంది. ఆయన బటన్‌ హోల్‌ పద్ధతిలో 60 వేలకుపైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. ఇన్ని ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్కరూ లేరు. బటన్‌ హోల్‌ ఆపరేషన్లు చేయడంలో ‘మాస్టర్‌’గా మారిన మునిరత్నం….ఇదే పనిలో రాత్రింబవళ్లూ గడిపారు. జిల్లా మొత్తం తిరిగారు. ఒకేరోజు వందల కొద్దీ ఆపరేషన్లు చేసిన ఉదంతాలున్నాయి.

డబుల్‌ ఫంక్షర్‌ లాప్రోస్కోపిక్‌ (డిపిఎల్‌) – దీన్నే బటన్‌ హోల్‌ ఆపరేషన్లు అంటారు. చాలా తక్కువ సమయంలో పూర్తయ్యే ఈ ఆపరేషన్లు చేయడానికి ఒకప్పుడు కొందరు వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అప్పటిదాకా కర్నాకటకు చెందిన గౌడ అనే డాక్టర్‌ మన రాష్ట్రానికి వచ్చి ఆపరేషన్లు చేసేశారు. డిపిఎల్‌ శిక్షణ కోసం గైనకాలజిస్టు లేదా సర్జన్‌ను ఎంపిక చేశారు. అయితే అప్పటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులుగా మాత్రమే ఉన్న డాక్టర్‌ మునిరత్నం…ప్రత్యేక ఆసక్తితో, వైద్య ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ను అభ్యర్థించి, తాను కూడా డిపిఎల్‌ శిక్షణ తీసుకున్నారు.

శిక్షణ పూర్తయినప్పటి నుంచి నిన్నమొన్నటి దాకా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ బటన్‌ హోల్‌ ఆపరేషన్లు నిర్వహించారు. ఒకేరోజు చిత్తూరులో 167 మందికి, మదనపపల్లిలో 72 మందికి…మొత్తం 239 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు మునిరత్నం. ఈ విధంగా 1998 నుంచి నిన్నమొన్నటి దాకా 60 వేలకుపైగా ఆపరేషన్లు చేశారు. మన రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇంత పెద్ద సంఖ్యలో బటన్‌ హోల్‌ ఆపరేషన్లు చేసిన డాక్టర్లు ఎవరూ లేరని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

డాక్టర్‌ మునిరత్నంతో పాటు శిక్షణ తీసుకున్న వైద్యులు మరికొందురున్నారు. వాళ్లెవరూ ఇంత విస్తృతంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఆపరేషన్లు చేయలేదు. ఇలా అన్ని ప్రాంతాలూ తిరుగుతూ పని చేయాలంటే….అందుకు ఎంతో అంకితభావం అవసరం. కాస్త సమయం దొరికితే…సొంత క్లినిక్‌లో ప్రాక్టీసు పెట్టుకుని, నలుగురు రోగులను చూస్తే…పది రూపాయలు వస్తాయని భావించే డాక్టర్లు ఉన్న ఈ రోజుల్లో… అటువంటి ఆలోచన లేకుండా…కు.ని ఆపరేషన్లకే అంకితమవడంలోనే డాక్టర్‌ మునిరత్నం అంకితభావం కనిపిస్తుంది.

తండ్రి మరణించిన దు:ఖంలోనూ…
బటన్‌ హోల్‌ ఆపరేషన్లు ముమ్మరంగా చేస్తున్న రోజుల్లో…ఒ రోజు మొలకలచెరువు క్యాంపు వేసుకున్నారు. ఉదయాన్నే తిరుపతి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. తొమ్మిది గంటల కల్లా అక్కడికి చేరుకున్నారు. ఆపరేషన్లు చేయించుకోడానికి 21 మంది సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపట్లో ఆపరేషన్లు మొదలుకావాల్సివుంది. ఇంతలో ఇంటి వద్ద నుంచి ఫోన్‌ వచ్చింది. ‘తాతయ్యకు హార్టటాక్‌ వచ్చంది’ అని కుమారుడు సమాచారం అందించారు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. ఫలితం లేదు. డాక్టర్‌ మునిరత్నం తండ్రి రంగయ్య మరణించారు. పది నిమిషాల్లో మళ్లీ ఫోన్‌ వచ్చింది. తండ్రి మరణ వార్తను చెప్పారు. కూలీనాలీ చేసి తనను చదివించి, డాక్టర్‌ను చేసిన తండ్రి మరణించడం… గుండెకోతతో సమానమైన బాధ కలిగించినా…ఉబికి వస్తున్న కన్నీళ్లను రెప్పల మధ్యే దాచిపెట్టి….ఆపరేషన్లకు ఉపక్రమించారు. 21 ఆపరేషన్లూ పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత తన తండ్రి మరణించిన సంగతి తనతో పాటు ఉన్న పారా మెడికల్‌ సిబ్బందికి చెప్పారు. ఆ తరువాత వెంటనే బయలుదేరి దారిపొడవునా ఏడ్చుకుంటూ ఇల్లు చేరారు.

వందలాది గ్రామాల్లో వైద్య సేవలు
ఎవరైనా అయివుంటే…తండ్రి మరణవార్త తెలియగానే ఆపరేషన్లు అన్నీ రద్దు చేసుకుని వెళ్లిపోయేవారు. ఆపరేషన్ల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని…నిరాశతో తిప్పి పంపడం ఇష్టలేక….ఆ పని చేర్తి చేసిన తరువాతే తండ్రిని కడచూపు చూసుకునేందుకు బయలుదేరారు మునిరత్నం. ఇది వృత్తిపట్ల ఆయన నిబద్ధతకు, రోగుల పట్ల ఆయనకున్న అంకితభావానికి ఒక నిదర్శనం.

ఇప్పుడు కొత్తగా వైద్య విద్యను అభ్యసించి, వృత్తిలోకి ప్రవేశిస్తున్న వారిని ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయమంటే…తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కోట్ల రూపాయలు వెచ్చింది ఎంబిబిఎస్‌ చదువుకున్నది గ్రామాల్లో సేవలు చేయడానికా…అనే ధోరణిలో ప్రశ్నిస్తున్నారు. అయితే…డాక్టర్‌ మునిరత్నం తన వృత్తి జీవితాన్నంతా గ్రామీణులకు వైద్య సేవలు అందించడానికే అంకితం చేశారు. ఉద్యోగ విరమణకు కొన్ని సంవత్సరాలు ముందు వరకు ఆయన గ్రామీణ వైద్యులుగానే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో కొన్ని వందల గ్రామాల్లో మునిరత్నం సేవలు అందించారు.

1992లో ఫిబ్రవరి 28న గుర్రంకొండ మండలం మహల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మునిరత్నం ఆ తరువాత పూతలపట్టు, కమ్మపల్లి, మళ్లీ పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేశారు. అసలు రెగ్యులర్‌ ఉద్యోగంలో చేరకమునుపు….గౌరవవేతకంపైన ‘హానరోరియం సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌’గా పులిచెర్ల, ఎన్‌ఆర్‌ పురం, గంగాధర నెల్లూరు, నాగలాపురం…అనేక ప్రాంతాల్లో పనిచేశారు. ఆ తరువాత బటన్‌హోల్‌ ఆపరేషన్ల నిపుణుడిగా ఇటు తూర్పున సత్యవేడు నుంచి అటు పశ్చిమాన కుప్పం దాకా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో సేవలు అందించారు.

మునిరత్నం ఎక్కడ పని చేసినా…అక్కడి ప్రజలతో మమేకమైపోతారు. ఆస్పత్రి వేళలతో నిమిత్తం లేకుండా పని చేస్తుంటారు. ఎవరైనా ఫోన్‌ చేస్తే ఇంటికి వెళ్లి చికిత్స చేసివస్తారు. ఆయన ఫోన్‌ నిరంతరం మోగుతూనే ఉంటుంది. జిల్లా శిక్షణా అధికారిగా ఉన్నా, రుయాస్పత్రి ఆర్‌ఎంఓగా ఉన్నా….జిల్లా నలుమూలల నుంచి… గతంలో ఆయన పని చేసిన ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్య సాయం కోసం ఫోన్లు చేస్తూనే ఉంటారు.

ఆయన గ్రామీణులకు ఎంతగా అండగా ఉంటారో చెప్పడానికి చక్కటి ఉదాహరణ…. ఎప్పుడో పని చేసిన పరిచయంతో పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లి చెందిన ఓ వృద్ధురాలు అస్వస్థతకు గురయిందని ఫోన్‌వస్తే….ఆర్థరాత్రి వేళ, జోరున వర్షం కురుస్తుండగా…ఇంజెక్షన్లు, సెలైన్లు తీసుకుని, తన ద్విచక్ర వాహనంలో… తిరుపతి నుంచి దాదాపు 50 – 60 కిలోమీటర్లు ప్రయాణించి వైద్యం అందించారు.

‘గ్రామీణ ప్రాంతాల్లోని వారికి డాక్టరంటే దేవునితో సమానం. అక్కడ వైద్య సదుపాయాలు పెద్దగా ఉండవు. మావంటి వైద్యులే వారికి ఆండ. డాక్టర్‌ వస్తే తమవారు ఎలాగైనా బతుకుతారన్నది నమ్మకం. అందుకేె ఎంత కష్టమైనా ఎంతో ఇష్టంగా గ్రామాల్లో పని చేశాను’ అని సంతోషంగా చెబుతారు మునిరత్నం.

2 Comments

  1. Having read your contribution to the needy, I sincerely felt to convey my gratitude to you for the dedication and relentless services rendered by you. May the Lord Almighty keep you live long with good health, happiness and prosperity. Thank you very much.
    Regards
    from
    An Indian Soldier

Leave a Reply

Your email address will not be published.


*