పురావస్తు శాఖ తిరుమల ఆలయాన్ని పరిశీలిస్తే… టిటిడి అధికారులకు గుబులెందుకు?

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టిటిడి ఆధ్వర్యంలో ఉన్న పురాతన ఆలయాలను పరిశీలించడానికి, ఫొటోలు తీసుకోడానికి తమ అధికారులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులు టిటిడి ఈవోకు లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి ఆలయాన్ని స్వాధీనం చేసుకోడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని ప్రచారం జరుగుతోంది. ఇది రాజకీయ కోణం. ఆ విధంగా బిజెపిని ఇబ్బందిపెట్టాలని రాజకీయ పార్టీల నాయకులు భావించొచ్చు. అయితే…టిటిడి అధికారులు ఈ విషయమై ఇంకో కోణంలో ఆందోళన చెందుతున్నారు. పురావస్తు శాఖ పరిశీలన అంటేనే అధికారుల గుబులు పుట్టుకుంది. ఎందుకంటే….పురావస్తు శాఖ అనుమతి లేకుండా ఆలయం లోపల కొన్ని గోడలను తొలగించారు. మీడియా గొంతు నొక్కేసి, ఆ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రధానంగా అదనపు లడ్డూలు ఉత్పత్తి చేసే పేరుతో ఆలయం లోపల ఉన్న పోటను ఈ మధ్యే తొలగించారు. దీనిపై గత డిసెంబర్‌లో ధర్మచక్రం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇలా గోడలు తొలగించడానికి పురావస్తు శాఖ అనుమతి ఉందా? అని ఈ కథనంలో ధర్మచక్రం ప్రశ్నించింది కూడా. పోటును విస్తరించి లడ్డూల ఉత్పత్తి పెంచాలన్న ఆలోచన చాలా మంది టిటిడి అధికారులకు వచ్చింది. అయితే పురాతన గోడలు తొలగించడానికి సాహసించలేదు. సింఘాల్‌ ఈవోగా వచ్చిన తరవాత అనుకున్నది చేసేశారు. (క్లిపింగ్‌ చూడండి)

ఇక ఆలయం లోపల ఇష్టారాజ్యంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో ఈవో వచ్చినపుడు ఒక్కో ప్రయోగం….దీంతో క్యూలైన్ల ఏర్పాటుకు అవసరమైన వైపులు వేయడానికి వందల కొద్దీ హోల్స్‌ తవ్వేశారు. గతంలో అవసరం లేని హోల్స్‌ను మళ్లీ సీసంతో పూడ్చేసేవారు. ఇప్పుడు అలా చేయడం లేదు. అలాగే వదిలేస్తున్నారు. సీసం కరిగించి పోసే సిబ్బంది కూడా ఇప్పుడు లేరు. ఆలయాన్ని శుభ్రం చేసేటప్పుడు పైపుల సాయంతో వేగంగా నీటిని చిమ్ముతారు. ఆ సమయంలో హోల్స్‌ నుంచి నేల కిందవున్న మట్టి బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల క్రమంగా గచ్చు బలహీనడపుతుంది. ఇది ఆలయ కట్టడాలకే ప్రమాదం. ఈ అంశంపై జులైలోనే ధర్మచక్రం ఓ కథన్నా ప్రచురించింది. (క్లిపింగ్‌ చూడండి)


పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తే…ఇలాంటి లోగుట్టులన్నీ బయటపడే అవకాశాలున్నాయి. అనుమతి లేకుండా నిర్మాణాల్లో మార్పులు చేసినందుకు సంబంధిత అధికారులపై కఠినమైన చట్టాలతో కేసులు పెట్టడానికీ అవకాశం ఉంటుంది. అందుకే పురావస్తు శాఖ పరిశీలన అనగానే టిటిడి అధీకారులూ ఆందోళన చెందుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*