జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా పంచ్ డైలాగులతో దూకుడుగా మాట్లాడుతుంటారు. సారం కంటే రూపానికే ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతారు. జనాన్ని ఆలోచింపజేయడం కంటే ఆవేశపరచడం, ఆకర్షించడమే లక్ష్యంగా ఉంటుంది ఆయన ఉపన్యాసం.
తిరుపతి తాజా పర్యటనలో ఇందుకు భిన్నంగా మాట్లాడారు. మతం వంటి సున్నితమైన అంశాలపై ఎంతో బాధ్యతాయుతంగా స్పందించారు. తమ మిత్రపక్షమైన బిజెపి వైఖరికి భిన్నంగానూ మాట్లాడారని చెప్పాలి.
ప్రార్థనాలయాలపై దాడుల గురించి స్పందిస్తూ…రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దీనికి వైసిపి ప్రభుత్వమే కారణమని నేను చెప్పను. దాడులకు పాల్పడేవారు కొద్దిమందే ఉంటారు. మతం విషయంలో సున్నితంగా వ్యవహరించాలి. అందరిలా నేను చేయను. అలాచేస్తే అమాయకులు బలైపోతారు. రామతీర్థం ఘటనపై ఆచితూచి స్పందించాను…అని పవన్ కల్యాణ్ వివరించారు.
కలిలతీర్థం టు రామతీర్థం పేరుతో బిజెపి నిర్వహించనున్న యాత్ర గురించి పవన్ ను ప్రశ్నించగా… ఆ యాత్రలో తాను పాల్గొనబోనని చెప్పారు. అటువంటి సున్నితమైన అంశాల్లో తాను స్వయంగా పాల్గొంటే ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయన్నారు.
తన మిత్రపార్టీ అయిన బిజెపి మతాన్ని ఆలంబనగా చేసుకుని రాజకీయాలు చేయాలని చూస్తుంటే….పవన్ మాత్రం అందుకు భిన్నమైన వైఖరితో వ్యవహరిస్తున్నారు.
జనసేన రాసుకున్న ఏడు మూల సూత్రాల్లో… మత ప్రమేయం లేని రాజకీయాలు అనేది ఒక కీలకమైన అంశం. దీనికి అనుగుణంగానే పవన్ తన రాజకీయాలు మొదలుపెట్టారు. బిజెపి విధానాలతీ విభేదిస్తూ, వామపక్షాలతో కలిసి రాజకీయాలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో వామపక్షాలు, బిఎస్పీతో కలిసి పోటీ చేశారు.
అయితే…ఎన్నికల తరువాత ఆశ్చర్యకరంగా బిజెపికి మిత్రపక్షంగా చేరారు. తిరుమల పవిత్రత వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడ పునరాలోచన మొదలయిందో గానీ, మతం విషయంలో బిజెపి వైఖరికి భిన్నంగా మాట్లాడుతున్నారు.
ఏదిఏమైనా పవన్ లొఇ వచ్చిన ఈ మార్పు అభినందనీయం. పవన్ క్రమంగా బిజెపికి దూరం జరుగుతారా…ఏమో చూద్దాం.
- ఆదిమూలం శేఖర్, ధర్మచక్రం సంపాదకులు